అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తాన్ని చూడనక్కరలేదు, ఒక్క మెతుకు ముట్టుకుంటే విషయం తెలిసిపోతుంది. అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న రాష్ర్టానికి ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనా విధానంతో విఫలమైందనే విషయాన్ని చెప్పడానికి కూడా ఐదేండ్లు అవసరం లేదు, ఈ ఏడాదిన్నర కాలం సరిపోతుంది. అలవికానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు విషయానికి వచ్చేసరికి అన్నింటా విఫలమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్నే ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తేటతెల్లం చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’తో హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తే, సాగునీళ్లు, కరెంటు సక్కగ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఇటు హెచ్‌సీయూ భూములను వేలం వేయడమైతేనేమీ, అటు పేదల ఇండ్లను కూల్చడమైతేనేమీ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన అసమర్థ విధానాలు తెలంగాణ రాష్ర్టాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అయితే, పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి వంతపాడటాన్ని కేసీఆర్ దుయ్యబట్టారు. మొత్తంగా రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవాల సందర్భంగా వరంగల్ సభకు వచ్చిన జన సందోహాన్ని, ఆ సభాస్థలి సాక్షిగా జనం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సందేశాన్ని, సభా వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు, కాంగ్రెస్ మంత్రులు, నాయకుల దాకా ముచ్చెమటలు పట్టాయి.
అందుకే ఏం మాట్లాడాలో తెలియక బీఆర్ఎస్ పార్టీపై, మా పార్టీ అధినాయకునిపై అవాకులు చవాకులు పేలుతున్నారు. ట్రాఫిక్‌తో బ్లాక్ అయిన అన్ని రహదారులతో పాటు లక్షలాది మందిని చూసి బిత్తరపోయిన అధికార కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు. అందుకే రజతోత్సవ సభకు ప్రజలు రాలేదని, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫిక్స్‌లతో ప్రజలను మభ్యపెడుతున్నదని అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజలు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టడంతో ప్రగతిభవన్‌ను హుందాగా వీడిపోయిన కేసీఆర్, కొత్త ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలని, ఇప్పుడే మాటల దాడులకు పాల్పడవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్నెళ్లో, ఏడాదో కాదు, సుమారు ఏడాదిన్నర గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో యాదృచ్ఛికంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా వచ్చింది. పద్నాలుగేండ్ల పాటు పోరాటం చేసి, కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని ఉద్యమ సారథి అయిన కేసీఆర్ సుమారు పదేండ్ల పాటు పాలనాపగ్గాలు చేపట్టారు.
అయితే, ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో అన్నిరంగాల్లో అగ్రపథాన దూసుకుపోయింది. ముండ్లబాటలో ఉన్న తెలంగాణను రాచమార్గానికెక్కించారు కేసీఆర్. ఇక్కడ ఒక్క విషయం ప్రస్తావించాలి. పురిటి నొప్పల బాధ తల్లికే తెలుస్తుంది కానీ, సవితి తల్లికి తెలియదు. రాచమార్గంలో నడుస్తున్న తెలంగాణను రచ్చకీడిస్తే బాధ కేసీఆర్‌కు కాకుంటే కాంగ్రెస్ నాయకులకు ఉంటుందా? అందులో భాగంగానే ఏడాదిన్నరగా దిగమింగుకుంటున్న కేసీఆర్ తన ఆవేదనను వరంగల్ సభావేదికగా బయటపెట్టారు. ఆగమైపోతున్న తెలంగాణను చూసి ఆవేదన చెందారే గానీ ఎవరినీ విమర్శించలేదు.
కేసీఆర్ బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా కాం గ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర సమయం ఇస్తే… ఇన్ని రోజులు కేసీఆర్ ఎక్కడున్నారని రాష్ట్ర మంత్రులు ప్రశ్నించటం వాళ్ల అవివేకమే అవుతుంది. బీఆర్ఎస్ గానీ, బీఆర్ఎస్ అధినేత గానీ ఏనాడు అభద్రతాభావానికి లోనుకాలేదు. వరంగల్ సభకు వచ్చిన ప్రజలను చూసే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నదన్న మాట నూటికి నూరు పాళ్లు నిజం. రజతోత్సవ సభ ఆసాంతం కేసీఆర్ ఎక్కడా వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రయోజనాలను కాంక్షించే మొదటి వ్యక్తిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించారు.
రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న ఆయన… ప్రస్తుత పాలనను చూసి ఆవేదనతో చెప్పిన మాటలను కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అయిన ఉద్యమాలో, పోరాటాలో, పదవులకు రాజీనామాలో, నిరసనలో నిర్వహిస్తేనే కదా తెలంగాణ అనే పదంలో ఉన్న ఆర్ద్రత అర్థమయ్యేది? కాంగ్రెస్ నాయకులకు ఆ తడి లేకే ఏడాదిన్నర కావొస్తున్నా తెలంగాణను ఓన్ చేసుకోలేకపోతున్నారు. రాష్ర్టాన్ని సొంత కుటుంబం వలె భావించే కేసీఆర్… కుటుంబ పెద్దగా… ఈ రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేలా ప్రసంగించారు. కానీ, కాంగ్రెస్ నాయకులు అందులో ఉండే నిజా నిజాలను గ్రహించకుండానే విమర్శలు చేస్తున్నారు. పదే పదే బూతులు మాట్లాడుతూ ప్రజల మధ్యన పలుచనవుతున్నారు.
సభలో కేసీఆర్ చేసిన విమర్శలపై ఎలాంటి సమాధానం ఇవ్వని మంత్రులు… సభ విజయవంతం కాలేదన్న విష ప్రచారంపైనే దృష్టిపెట్టారు. కాంట్రాక్టుల్లో, నిధుల విడుదలలో కమీషన్లు చేతులు మారుతున్నాయన్న దానిపై మౌనమే సమాధానమైంది. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి చివరికి రూ.12 వేలు కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు. పెంచి ఇస్తామన్న ఫించన్ కోసం దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఏడాదిన్నరగా పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేదు. విద్యార్థినులకు స్కూటీలు, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన మాట ఎక్కడ పోయింది.
దళితబంధు ప్రస్తావనే లేదు. రైతులకు క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఏమైంది?. ఇన్ని ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన కేసీఆర్నా విమర్శించేది?. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన కేసీఆర్‌కు, రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏం పట్టని రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఆదివాసీల మరణాలపై మానవతా దృక్పథంతో స్పందించిన కేసీఆర్… ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపేయాలని కేంద్రానికి సూచించారు. ప్రజల తరఫున కేంద్రప్రభుత్వానికి లేఖ రాస్తానని వరంగల్ సభ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇది కదా మానవత్వం అంటే? ఇది కదా మానవీయం అంటే? కేసీఆర్ నోట కగార్ అనే మాట వచ్చేవరకు దాని గురించి తెలియని రేవంత్‌రెడ్డి హడావుడిగా అదే రోజు పెద్దలు జానారెడ్డితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిన ముచ్చటే.
ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ ఎవరకీ పట్టు లేదు. దగ్గాలన్నా, తుమ్మాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. అలాంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల సమస్యలను తీరుస్తారనుకోవడం మన పొరపాటే? దశాబ్దకాలం పాటు అన్ని రంగాల్లో నలు దిశలా విస్తరించిన తెలంగాణను అస్తవ్యస్థంగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరగా కావస్తున్నది. కనీసం సొంతంగా మంత్రివర్గ విస్తరణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటుండటం కడు శోచనీయం.
ఇక జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో ఎలాంటి ఆధారాలు చూపించకుండా అవినీతి జరిగిందంటూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు ఏడాదిన్నర గడుస్తున్నా ఏ ఆధారమూ చూపించలేకపోతున్నారు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసి రైతులకు నీళ్లిచ్చారా అంటే అదీ లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణం ద్వారా అదనంగా లక్ష ఎకరాల భూమి సాగులోకి వచ్చిందిన నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికనే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితనానికి సాక్ష్యం.
మేడిగడ్డలో అవినీతి జరిగిందని కేంద్ర సంస్థలు చెప్తున్నాయంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఆ నివేదికను బయటపెట్టాలి, లేదా తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రజల మధ్యకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. బ్యారేజీ స్థల మార్పుపైనా ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర జలసంఘం అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభు త్వం అక్కడ బ్యారేజీని నిర్మించింది. రేవంత్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టి అక్కడి కార్మికుల మరణానికి కారణమైంది. కుటుంబాలు కనీసం మొహాలైనా చూసుకుందామని తాపత్రయపడుతుంటే కొంతమంది కార్మికుల పార్థివదేహాలు కూడా దొరకకుండాపోయాయి.
అవును, కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్టానికి ఎప్పటికీ విలనే. 1969లో, 1972లో 2004లో, 2014లో ప్రతిసారి తెలంగాణ ప్రజలను వంచించిన పార్టీ బరాబర్ విలనే అవుతుంది. వేల మంది బలిదానాల తర్వాత, తెలంగాణ మహోద్యమాన్ని చూసి భయపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందే తప్ప, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి కాదు.
సోనియా ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నామన్న సంగతిని మరిచిపోతున్నారు. సోనియాగాంధే కాదు, ఆమె స్థానంలో ఎవరున్నా తెలంగాణ ఇవ్వాల్సిందే..? అన్ని పార్టీలని ఒప్పించి, అంతటి అనివార్యాన్ని సృష్టించింది, ప్రజల్లో ఆ ఊపును తీసుకువచ్చింది ఒక్క కేసీఆర్ మాత్రమే. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
(వ్యాసకర్త: చెన్నూరు మాజీ శాసనసభ్యులు)
-బాల్క సుమన్