ఒకరు ఆటో డ్రైవర్. అతడి నెల సంపాదన రూ.10 వేలు. రోజూ పనిచేస్తేనే గాని పూట గడవని పరిస్థితి. మరొకరు పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక పోస్టులో ఉన్న వ్యక్తి. లక్షన్నరకు పైగా జీతం. పక్కపక్కనే ఉండే వీరి మధ్య ఇంటి స్థలం విషయంలో వివాదమైంది. మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్, సీఎంవోల చుట్టూ ఆటోడ్రైవర్ తిరుగగా.. అతని స్థలంతో కొంత భాగాన్ని సదరు పోలీసు కబ్జా చేసినట్టు నిర్ధారణ అయింది. అయి తే సదరు పొలీసు ముందుగా జిల్లాలోని సివిల్ కోర్టు, ఆపై హైకోర్టులో కేసు వేశాడు. దీంతో ఆ ఆటోడ్రైవర్ న్యాయం కోసం కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. లాయర్ల ఫీజు అతని కి భారంగా మారింది. న్యాయం చేయాల్సి న పురపాలక అధికారులు కేసు కోర్టులో ఉన్నదనే సాకుతో తప్పించుకుంటున్నారు. ఆటోడ్రైవర్ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన ఉన్న సదరు పోలీసు అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నాడు. పాపం ఆ ఆటోవాలా న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు.
ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ఘటన. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధితులు ఎందరో. భూ బకాసురులను ఎదుర్కోలేక.. డబ్బు, అధికార మదంతో విర్రవీగేవారిని నిలువరించలేక చాలామం ది పేదలు నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. లక్షల్లో ఖర్చుపెట్టి న్యాయం పొందడం పేద ప్రజల వల్ల కావడం లేదు. లా కంపెనీలు రావడం వల్ల యువకులకు అవకాశాలు వస్తున్నాయని, కానీ కార్పొరేట్ ఫీజులను పేదలు భరించలేరని, తద్వారా సామాన్యులకు న్యాయం దూరమవుతుందని రిటైర్డ్ జస్టిస్ ఎన్వీ రమణ గతంలో నొక్కిచెప్పారు.
అంటే.. ‘న్యాయం’ ఇప్పుడు ఖరీదుగా మారిందనే విషయం అర్థమవుతూనే ఉన్నది. అంతేకాదు, కోర్టు విధానాలు, సేవలపై పేదలకు సరైన అవగాహన ఉండటం లేదు. కేసులు, కోర్టులు అనగానే చాలామంది ప్రజలు భయాందోళనకు గురై వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అంగబలం, ధన బలం ఉన్న అక్రమా ర్కు లపై పేద ప్రజలు ఓడిపోతున్నారు. లాయర్‌ను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందనే విషయంపై పేదలకు సమ గ్ర అవగాహన కల్పించాలి. న్యాయసహాయం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఒక లాయర్‌ను కేటాయిస్తుంది. అంతేకాదు, అవసరమైతే కోర్టు ఫీజులు, సాక్షులకు సంబంధించిన వ్యయాలు, మరే ఇతరత్రా ఖర్చులున్నా ఆ సంస్థ భరిస్తుంది. ఉచిత న్యాయ సేవలు పొందాలనుకునేవారు తమ కేసు ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో తెలుసుకుని అక్కడి న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వీలుంది.
సమయానికి అందని న్యాయం కూడా అన్యాయంతో సమానం. ఒక్కమాటలో చెప్పాలంటే అది కూడా ఒక శిక్ష లాంటిదే. ఏ తప్పు చేయనివారికి, బాధితులకు పడే శిక్ష అది. న్యాయం ఆలస్యమవడమనేది పెద్దల దృష్టిలో చిన్న సమస్యే కావచ్చు. కానీ, పేదలకు మాత్రం అది జీవన్మరణ సమస్య. ఈ నేపథ్యంలో కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.