‘బేటీ బచావో.. బేటీ పఢావో’ అనే అందమైన నినాదాన్ని కేంద్రం ప్రభుత్వం దేశం మీదకు వదిలి పదేండ్లకు పైగా అవుతున్నది. ఆడపిల్లను కాపాడి విద్యాలయాలకు పంపిస్తే అక్కడ సురక్షితమా అంటే అదీ సందేహాస్పదమే అవుతున్నది. నలువైపులా కమ్ముకుంటున్న కీచకపర్వం వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నది. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకువచ్చిన సమస్య కానప్పటికీ, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా క్యాంపస్‌లలో పెచ్చరిల్లుతున్న లైంగిక నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజీ కార్ లైంగికదాడి ఘటనను మరువకముందే అదే మహానగరంలోని ఓ న్యాయశాస్త్ర కళాశాల క్యాంపస్‌లో ఒక విద్యార్థినిపై గతనెల సామూహిక లైంగికదాడి జరగడం విషాదకరం. ఈ వరుస ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది.
సీనియర్ అధ్యాపకుని లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ బీఈడీ విద్యార్థిని ప్రిన్సిపాల్ కార్యాలయం ముందే ఆత్మాహుతికి ప్రయత్నించి, దవాఖానలో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తర్వాత ప్రిన్సిపాల్‌ను, అధ్యాపకుడిని అరెస్టు చేసినప్పటికీ, ఆలోపే ఓ భావి ఉపాధ్యాయురాలి అమూల్యమైన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
బాధితురాలు తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి ఎక్కని మెట్టు, దిగని మెట్టు లేదు. దీనిపై ప్రిన్సిపాల్ మొదలు ముఖ్యమంత్రి దాకా ఆ విద్యార్థిని అందరికీ మొరపెట్టుకుంది. కానీ, ఎవరూ ధైర్యం చెప్పి ఆదుకోలేదు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన మన దేశపు ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్యలోని విభిన్న పార్శ్వాలను బయటపెట్టింది.
2012లో నిర్భయ ఉదంతం తర్వాత కఠినమైన చట్టాలు తెచ్చారు. కానీ, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. 2013లో కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి తెచ్చిన చట్టం అన్ని చోట్లా అంతర్గత ఫిర్యాదుల కమిటీలు తప్పనిసరి చేసింది. కానీ, ఒడిశాలో విద్యార్థిని ఆత్మాహుతి తర్వాతనే ఆ రాష్ట్ర సీఎం హడావుడిగా అన్ని విద్యాలయాల్లో 24 గంటల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చర్య తప్ప మరోటి కాదు. లైంగిక వేధింపుల ఘటనల్లో బాధితులు ఫిర్యాదు చేయకుండా దిగమింగుకుంటారు. కానీ, ఇక్కడ ఆ విద్యార్థిని ఫిర్యాదు చేసేందుకు తన వద్దకు వచ్చినా పట్టించుకోని సీఎం.. ఘోరం జరిగిపోయిన తర్వాత ఆదేశాలు జారీ చేయడం విడ్డూరమే. వారి ప్రాధాన్యతలను ఈ వ్యవహారశైలి ఎత్తిచూపుతున్నది.
అరచేతిలో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ, ప్రభుత్వాలూ అదుపు చేయలేని స్థితిలో విచ్చలవిడిగా మారిన వికృత సోషల్ మీడియా.. ఇలా నేటి దుర్మార్గానికి కారణాలు ఎన్నో. అందువల్ల, ఆడపిల్లలను కాపాడుకోవడంలో సభ్య సమాజం బాధ్యతే ఎక్కువ. ఘటన జరిగినప్పుడు గగ్గోలు పెట్టి ఆ తర్వాత మరిచిపోయే తత్వాన్ని మనం విడనాడాలి. లైంగిక వేధింపులు, హింసకు సంబంధించి మన దేశం అనేక సంక్లిష్టతలను ఎదుర్కొంటున్నది. ఫిర్యాదులు మొదలుకొని కేసు నమోదు, కోర్టులో కొట్లాడటం దాకా అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నినాదాలకు పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా రక్షణ కల్పిస్తేనే ఈ పరిస్థితి మారుతుంది.