కొన్ని చారిత్రక సందర్భాలకు కాలమే అంకురార్పణ చేస్తుంది. మానవ చరిత్రను మలుపు తిప్పిన అనేకమంది మహానుభావుల ఉద్భవం ఏదో ఒక కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉంటుంది. అణచివేతల్లోంచి ఒక ఆశయం మొలకెత్తుతుంది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చెలరేగుతుంది. ఆర్థిక, సామాజిక, అసమానతలకు వ్యతిరేకంగా విప్లవాలే మొదలవుతాయి.
బోయవాడు వాల్మీకిగా మారినా, సిద్ధార్థుడు బుద్ధుడిగా అవతరించినా, బలీయమైన ఒక సంఘటన తాలూకు భావ సంఘర్షణల్లోంచి పొందిన చైతన్యమే కారణం. తాను ప్రయాణించిన రైల్లోంచి బలవంతంగా తోసేసిన జాత్యహంకారాన్ని చవిచూసి ఉండకపోతే గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రోద్యమానికి నడుం కట్టేవాడు కాదేమో! నందులచే పరాభవమే జరిగి ఉండకపోతే చాణుక్యుడు చంద్రగుప్తునిచే మగధ మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ఉండకపోయేవాడేమో!
ఇలా ఏ పోరాటాలైనా, ఏ ఉద్యమ నేతలైనా కాలంచే సృష్టించబడి కాలాన్ని శాసించగలిగే స్థాయికి చేరుకోవడం చరిత్ర నిండా మనం చూస్తున్నాం.టీఆర్ఎస్ ఆవిర్భావం కానీ, కేసీఆర్ నాయకత్వాన్ని కానీ, అదే చారిత్రక దృష్టికోణంతో చూడవలసిన అవసరం ఉన్నది.
మానవజాతి చరిత్రలో జరిగిన విముక్తి పోరాటాలన్నింటికీ కారణాలు రెండే రెండు. ఒకటి అస్తిత్వ ఆకాంక్ష. రెండవది ఆత్మగౌరవ ఆకాంక్ష. అస్తిత్వ ఆకాంక్ష దేశాల స్వాతంత్య్రోద్యమాలకు, జాతుల విముక్తి పోరాటాలకు, ప్రజల విప్లవోద్యమాలకు దారితీస్తే, ఆత్మగౌరవ ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి నాంది అయింది.
ఏపీ అవతరణలో దాగి ఉన్న కొన్ని కుట్రల కారణంగా, ఒకనాడు అన్ని హంగులతో స్వతం త్ర దేశంగా ఉన్న తెలంగాణ కాలక్రమేణా తన అస్తిత్వాన్నే కోల్పోయింది. తెలంగాణ ప్రాంతం లో అంతర్గత పరాయిపాలన కొనసాగింది. సొంత దేశంలో, అదీ ఒక స్వతంత్ర దేశంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతం చేతిలో దోపిడీకి గురైంది. తెలుగు మాట్లాడేవారంతా ఒక రాష్ట్రం గా ఉమ్మడిగా జీవించాలన్న సాకుతో ఏకమై ఆ స్ఫూర్తినే మట్టిలో కలిపి తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని తెరమరుగు చేయడం లో ఒక పకడ్బందీ వ్యూహం కొనసాగి, సీమాంధ్రుల ఆధిపత్యంలో తాము పుట్టిన నేలపైనే కాందిశీకులుగా బతికే దుర్భర పరిస్థితి దాపురించింది తెలంగాణ ప్రజలకు. ఈ మోసాలను ప్రజలు తెలుసుకొనేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
నీళ్లు, నిధులు, నియామకాలు కొల్లగొట్టబడినాయి. ప్రజల యాస, భాష, సం స్కృతులు అవహేళనకు గురైనాయి. తెలంగాణ వేరు పడితే తప్ప మన వనరులపై పెత్తనం మనకు దక్కదని, వివక్ష ఆగదని, స్వయం పాలన సాధ్యం కాదన్న ఒక భావజాలవ్యాప్తి మరొక్కసారి తెలంగాణను సుడిగాలిలా చుట్టుముట్టింది. ఇందుకు కృషిచేసిన వాళ్లు తెలంగాణ ముద్దుబిడ్డలు, తెలంగాణ గత వైభవ చరిత్ర, సంస్కృతి పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగిన కవులు, కళాకారులు, బుద్ధిజీవులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, లెక్చర ర్లు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు.
ఇది తెలంగాణకు ఒక బౌద్ధిక ప్రపంచాన్ని సృష్టించింది. ఒక ఉద్యమ వేదికను తయారుచేసింది. కానీ, తెలంగాణకు స్పష్టమైన రాజకీయ పోరాటాన్నిచ్చింది, క్రియాశీల కార్యాచరణకు పురుడుపోసింది మాత్రం నిస్సందేహంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు @ కేసీఆరే. ఉద్యమ వ్యూహకర్త, తెలంగాణ నామస్మరణ తప్ప మరే వ్యాపకం లేని కేసీఆర్ అప్పటికి తనకున్న అలంకారప్రాయమైన, భుజకీర్తులుగా ఉన్న పదవులన్నింటినీ ఎడమకాలుతో తన్ని తెలంగాణ కదనరంగంలోకి దూకడం నిజంగా చరిత్రే!
సీత శోకం లంక దహనానికి దారితీసినట్టు, ద్రౌపది వస్ర్తాపహరణమే కురుక్షేత్ర యుద్ధానికి నాంది అయినట్టు తెలంగాణ యాస, భాష, సంస్కృతుల అవమానమే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. ఆ అవమానం ఆత్మాభిమానాన్ని మేల్కొల్పింది. ఆత్మాభిమానం ఆలోచనను రేకెత్తించింది. ఆలోచన అన్వేషణకు దారితీసింది. అన్వేషణ మూలాలను అధ్యయనం చేయించింది. అధ్యయనం ఒక సిద్ధాంతాన్ని రూపొందించింది. సిద్ధాంతం ఒక కార్యాచరణకు పురుడుపోసింది. ఆ కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం. ఆ సిద్ధాంతం తెలంగాణ వాదం.
ఇన్ని కార్యకారక సిద్ధాంతాలకారణంగా కాలం ఒక గొప్ప పోరాటయోధున్ని కన్నది. చరిత్ర ఒక గొప్ప ఉద్యమ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేసింది. ఆ పోరాటయోధుడు కేసీఆర్. ఆ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. కాలం గాయాలను మాన్పితే చరిత్ర గాయాలను కెలుకుతుంది. చరిత్ర కెలికిన ఆ గాయాల్లోంచి ఉద్యమ తరంగమై ఉద్భవించిన మహోద్యమ నాయకుడు కేసీఆర్.
తెలంగాణ అంతటా బౌద్ధిక భావజాల వ్యాప్తి జరిగిన తరుణంలోనే, ఎన్నో అంతర్మథనాలు, బాహిర్మేధోమథనాలు, ప్రణాళికలు, కార్యాచరణలు-పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతనే, ‘తెలంగాణ ఉద్యమానికి అనుకూల పరిస్థితులు అనేకం ఉన్నాయి, వీటిని నడిపించే సామాజిక శక్తులు కావాలి. ‘ఆ శక్తిని నేనైత’ అని తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్. 2001, ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ అంటే తల కోసిచ్చే తత్త్వం, మడ మ తిప్పని తెంపరితనం, తెలంగాణ గత, వర్తమాన, భవిష్యత్తు పట్ల ఒక చదువరికి, జ్ఞానికి ఉండే అవగాహన, ఆయన సొంతం! ఏ వాదననైనా గెలువగలిగిన వాగ్ధాటి, లక్షల జనాలను మంత్రముగ్ధులను చేయగలిగిన మాటల సమన్వయం, వాదన అత్యంత ప్రతిభావంతంగా ప్రవేశపెట్టి, వైరిపక్షాన్ని గెలవగలిగిన చాతుర్యత, రాజకీయ ఎత్తుగడల్లో ప్రజల భాగస్వామ్యం, అవసరమైన రాజకీయ సమీకరణాల పట్ల తెలివిడి, సామాజిక కోణాలను, వాటి మూలాలను ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగిన మన కాలపు తెలంగాణ మేధావి కేసీఆర్. అప్పటివరకు తాత్త్విక ప్రచారమే లక్ష్యంగా సాగిన కృషిని, రాజకీయ కృషిగా మలచడంలో ఆయన సఫలమయ్యారు. అందుకే నూటికి నూరు పాళ్లు తెలంగాణ ఎజెండాను జాతీయ రాజకీయ యవనికపై శిఖరాగ్రాన ఆవిష్కరించగలిగారు కేసీఆర్.
బుద్ధి కుశలత, సైద్ధాంతిక అవగాహన, ఆలోచనల చురుకు, ఎత్తుగడల చాణక్యం, వాదనాపటిమ, శత్రువు బలాన్నీ, బలహీనతనూ సరిగ్గా ఎప్పటికప్పుడు అంచనా వేసి, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక రాజకీయ ఎత్తుగడలు కేసీఆర్ సొంతం. ‘తన బలమెంతో, బలహీనతెంతో సరిగ్గా బేరీజు వేసుకొని, అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే వాడే గొప్ప బలవంతుడు’ అన్న సూత్రాన్ని ఆచరణలో పెట్టిన గొప్ప ప్రాక్టికల్ విజ్డమ్ ఉన్న వ్యక్తి కేసీఆర్.
అందుకే ఆయ న ఉద్యమం ప్రారంభించిన అతి స్వల్ప వ్యవధిలోనే ఢిల్లీలో తెలంగాణ నగారా మోగించగలిగా రు. ఎందరో రాజకీయ మిత్రులను కూడగట్టగలిగారు. ఆనాడు ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్నదంటే దానికి ప్రేరకుడు కేసీఆర్. మాకు తెలంగాణయే ముఖ్యమని ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ, మంత్రి పదవులకూ, ఎమ్మెల్యే పదవులకూ రాజీనామాలు చేసినా, ఇవన్నీ కేసీఆర్ సాహస రాజకీయాలకు ప్రతీక లు. అవి సత్ఫలితాలనిచ్చాయి. ఆనాడు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలంగాణ తారకమంత్రంగా మారిన సందర్భం!
అధికారంలోకి వచ్చిన రెండు పర్యాయాల కాలంలో అభివృద్ధి, సంక్షేమంలో సాధించిన విప్లవాత్మక విజయాలు, విధ్వంసమైన తెలంగాణను విముక్తి వైపు పరుగులు తీయించాయి. పరాధీనత నుంచి స్వయంపాలన వైపు సాగిన సుదీర్ఘ పోరాటంలో టీఆర్ఎస్ పార్టీ పోషించిన గణనీయమైన పాత్ర చరిత్రలో నమోదైంది. సకల జనుల వికాసం, సాంకేతిక ప్రగతి, విద్య, ఆరోగ్యం, శాంతియుత సహజీవన వాతావరణం, రాజకీయ సుస్థిరత, వేగవంతమైన అభివృద్ధి, సంక్షేమం, వినూత్న ఆలోచనలు కలిగిన నాయకుడి విశ్రాంతి లేని శ్రమ ఫలితంగా సాధించుకున్న విజయాలు, శిథిలాల్లోంచి చిగురించిన చిరుమొలకల్లా ఆరంభమై, వటవృక్షమై తెలంగాణ అంతటా విస్తరించాయి. వీటిని పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై ఉన్నది.
ప్రజల్లో గందరగోళం సృష్టించి, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి, వాస్తవాలను వక్రీకరించి, కులాలు, మతాలు, వర్గాల పేరుతో చిచ్చుపెట్టి, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, అధికార లాలసతో అసత్యాలపై ఆధారపడి, అభివృద్ధిని కూడా అడ్డుకోవడానికి అడ్డదారులు తొక్కి, ప్రజలను భ్రమల్లో ముంచి, ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ విజన్‌ను, మేధో పరమైన పాలనను, త్యాగాన్ని, ఔన్నత్యాన్ని, పార్టీ విధానాలను, అమలుచేసిన పథకాలను, సాధించిన ప్రగతిని ఈ రజతోత్సవాల సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి, సరైన పద్ధతిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత, అవసరం ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై ఉన్నది. అప్పుడే టీఆర్ఎస్ సాధించిన తెలంగాణ రాష్ట్ర విజయాల సాఫల్యతకు, భవిష్యత్తులో వాటి కొనసాగింపునకు అవకాశం ఉంటుంది. రజతోత్సవ ఉత్సవాలకు సార్థకత చేకూరుతుంది.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, కరీంనగర్)
-నారదాసు లక్ష్మణ్‌రావు