తెలంగాణ నిలిచి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఆ వరుసలో నీటికే ప్రథమ ప్రాధాన్యం అన్నది తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో ఓ పథకం ప్రకారమే జల దోపిడీ జరిగింది. స్వరాష్ట్ర సాధన తర్వాత అది కట్టడి అయ్యింది. దార్శనిక నేత కేసీఆర్ పాలనలో తెలంగాణ జలకళ సంతరించుకున్నది. కాళేశ్వరం వంటి అద్వితీయమైన ప్రాజెక్టు సాకారమైంది. నెర్రెలు వారిన నేల మీద నీరు పారింది. తెలంగాణ తీరు మారింది. కరవు నేల అన్నపూర్ణగా పరిఢవిల్లింది. కానీ మారిన పరిస్థితుల్లో మరోసారి పొరుగు రాష్ట్రం నీటి కుట్రలకు తెరతీసింది. నిన్నటిదాకా ఇటు తొంగిచూసేందుకు జంకినవారు ఇప్పుడు బరితెగిస్తున్నారు.
గోదావరి బనకచర్ల లింకు ద్వారా నీటి మళ్లింపు జరుపనున్నట్టు ఏపీ సీఎం ఇటీవల అట్టహాసంగా ప్రకటించారు. రూ.80 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మిస్తారట. ఏకంగా 200 టీఎంసీల గోదావరి జలాలను పోలవరం నుంచి పెన్నా బేసిన్‌కు తరలించే ఎత్తుగడ ఇది. నెల్లూరు, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలకు నీరు పారించేందుకు ఏపీ సర్కార్ ఆగమేఘాల మీద పథకాలు వేస్తున్నది. నిధుల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నది. నిజానికిది లింకు కాదు గోదావరికి బిగిస్తున్న ఉచ్చు.
నాటి నుంచీ నేటిదాకా నీటి మళ్లింపు కుట్రలు చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు పేరిట కృష్ణా జలాలను చెరబట్టేందుకు ఎత్తులు వేస్తే ఉద్యమ నేతగా కేసీఆర్ తీవ్రంగా ప్రతిఘటించారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకువచ్చి అలుపెరుగని పోరాటం చేశారు. రాష్ట్ర సాధన అనంతరం కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కోసం నిరంతర జాగరూకతతో ముందుకుసాగారు. ఇప్పుడు గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇందుకు వరద జలాలను సాకుగా వాడుకుంటున్నారు. వృథాగా 4 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నదని, అందులో 200 టీఎంసీలను మళ్లించుకుంటామని అంటున్నారు. గోదావరి జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో వరద ఊసే లేనప్పుడు ఆ పేరు మీద మళ్లింపు ఎలా జరుపుతారనేది ప్రశ్న.
బనకచర్ల లింకుతో గోదావరి జలాలు బేసిన్ బయటకు పోతాయి. దీనివల్ల బేసిన్‌లోని తెలంగాణకు తీరని ముప్పు ఏర్పడుతుందనేది నిర్వివాదాంశం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ దిశగా అడుగులు వేయడానికి సాహసించని ఏపీ సర్కార్ ఇప్పుడు ఏకంగా దూకుడు పెంచడానికి కారణమేమిటో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉండటం వారికి కొత్త ఉత్సాహం కలిగిస్తున్నట్టుంది. ఏవో కుంటిసాకులతో కాళేశ్వరాన్ని పండబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నది. ఆ ప్రాజెక్టుకు ప్రాణాధారమైన ప్రాణహిత జలాలను ఎత్తుకుపోయేందుకు అటు ఏపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా మాయోపాయాలు పన్నుతున్నది. వరద మళ్లింపు పేరిట ఇప్పటికే కృష్ణాను చెరబట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు 594 టీఎంసీలు తరలించింది. తెలంగాణ ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే గోదావరి పరిస్థితీ ఇంతే అవుతుంది.