అతను
కరెక్టుగానే చెప్పిండు
మనకే సరిగ్గా అర్థం కాలే
మారుస్తానన్నాడు
అన్నీ మార్చేస్తానన్నాడు
మనమేదో అనుకొని భ్రమపడ్డాం
ఇప్పుడేకంగా తల్లినే మార్చేశాడు!
మన అమ్మ తప్పిపోయింది
ఆమె కిరీటం పోయింది
కంఠాభరణం పోయింది
నడుముకు చుట్టుకున్న
వడ్డాణం మాయమైంది!
మన ఇంటి ఆడపడుచుల ప్రాణదీపమైన
చేతిలోని బతుకమ్మా అదృశ్యమైంది
కరువు కాలం నాటి
జొన్న సజ్జ కంకులు మిగిలిపోయినయ్
దిక్కూ దివాణం లేని
తల్లిని తెచ్చి ముంగట నిలబెట్టి
ఇప్పుడు ఈమెనే మన తల్లి అంటున్నాడు
వెక్కివెక్కి ఏడుస్తూ
మనం కళ్లు నలుముకుంటుంటే
దుఃఖం మొదలైంది ఇప్పుడే కదా
ఇంకో నాలుగేండ్లు గుక్కపట్టండి
అందరికీ తల్లి లేనితనం
అలవాటైపోతది
అడుక్కోవడం నేర్చుకుంటే గాని
అదానీ ఎంగిలి మెతుకుల రుచి
అందరికీ అర్థం కాదంటాడు
అరువు తెచ్చుకున్న అమ్మ
గడిచిన కరువు కాలానికి ప్రతీక!
అమ్మ తప్పిపోయింది
వెతకండిరా వెతకండి
అమ్మ దొరికేదాకా వెతకండి రా!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి 94402 33261