అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపుతానని హామీ ఇచ్చిన, భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వల్లించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భీకర యుద్ధానికి తెరతీశారు. ఫొర్దో, ఇస్ఫాహాన్, నతాంజ్ అణుకేంద్రాలను భారీ బాంబులతో ధ్వంసం చేశారు. రాజీకి వచ్చేందుకు ఇరాన్‌కు రెండు వారాల సమయం ఇస్తున్నానని చెప్పిన రెండు రోజులకే యుద్ధం మొదలుపెట్టారు. పశ్చిమాసియాలో శాంతికి తద్వారా తీవ్ర విఘాతం కలిగించారు. ఇజ్రాయెల్ ద్వారా పరోక్ష యుద్ధాన్ని జరిపిన అమెరికా ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి తెగబడటం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. యుద్ధంతో అమెరికాకు ప్రమేయం లేదంటూనే ఇజ్రాయెల్ తరఫున తాఖీదులు జారీచేసిన ట్రంప్ ఇప్పుడు దాడికి తెగబడటం ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేస్తున్నది. అమెరికా సైనిక చర్య సుదూర, దీర్ఘకాలిక పర్యవసనాలు కలిగి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమెరికా చర్యను ఇజ్రాయెల్ సహజంగానే ప్రశంసలతో ముంచెత్తగా, ఇరాన్ మాత్రం అగ్రరాజ్యం అతిపెద్ద ఎర్రగీతను దాటిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే యుద్ధ ప్రభావం వల్ల పశ్చిమాసియా గగనతలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజాగా సముద్ర మార్గాలూ సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ తీర్మానించడం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. 20 శాతం అంతర్జాతీయ చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఇరాన్ చర్య ప్రభావంతో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఎదురవుతున్నది. అమెరికా సైనిక చర్యల వల్ల ఏదైనా అంతర్జాతీయ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిన దాఖలాలు ఇంతవరకైతే లేవు. అది అఫ్ఘానిస్థాన్ అయినా, ఇరాక్ అయినా ఫలితం ఒక్కటే. తాలిబన్ల పాలన అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పుతామనే బృహత్తర లక్ష్యంతో వెళ్లిన అమెరికా ఏమీ సాధించకుండానే వెనుదిరిగింది. ఇరాక్‌లో ఏ మేరకు అణ్వస్ర్తాలను అమెరికా కనిపెట్టగలిగిందో మనం చూశాం.
ఇప్పుడు ఇరాన్‌పై దాడి కూడా అణ్వస్ర్తాల పేరిట జరిగినా, అసలు లక్ష్యం ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడం, పశ్చిమాసియాలో ఆయుధ పోటీని రెచ్చగొట్టడమే అమెరికా పరమావధి అనేది తెలిసిపోతూనే ఉంది. నిజానికి ఇరాన్ వద్ద అణుబాంబులు లేవని, వాటిని తయారు చేసే సామర్థ్యం కూడా ఇంకా రాలేదని అమెరికా గూఢచార విభాగం ఇస్తున్న సమాచారాన్ని ట్రంప్ తోసిరాజనడమే ఇందుకు తార్కాణం. పశ్చిమాసియాలో నమ్మినబంటు ఇజ్రాయెల్ కోసం అగ్రరాజ్యం ఎంతకైనా తెగిస్తుందని మరోసారి రుజువైంది. దేనిమీదా నిలకడ లేని ట్రంప్ దూకుడు వల్ల మరో ప్రపంచ యుద్ధ ప్రమాదం పొడసూపుతున్నది. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని అమెరికా చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్ ప్రశంసించిన మరుసటిరోజే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఆయన ఆజ్యం పోయడం విడ్డూరం.