పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’పై దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ సానుకూలంగా స్పందించాయి. దౌత్యపరమైన ప్రకటనల్లో ఎక్కడా భారత్ ప్రతీకార చర్యను వ్యతిరేకించకపోవడం గమనార్హం. ‘ప్రపంచ వ్యవహారాల మీద ప్రభావం చూపే దేశాలన్నీ సంయమనం పాటించాలని’ అన్నాయే తప్ప ఏ ఒక్క దేశమూ భారత్‌ను తప్పుబట్టలేదు. ఉగ్రవాదం విషయంలో రాజీ పడకూడదనే ధోరణి ప్రపంచవ్యాప్తంగా బలంగా నాటుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. భూమ్మీద ఉన్న ప్రతీ దేశమూ ఏదోరకంగా ఉగ్రవాద పీడను అనుభవించి ఉండటమూ మరో కారణం. ప్రస్తుత స్పందనకు పహల్గాం దాడి తక్షణ కారణమైనప్పటికీ అదే మొదటిది కాదు. చివరిది కావాలనేది భారత్ ప్రగాఢమైన అభిమతం. పాకిస్థాన్ నుంచి సరిహద్దుల గుండా చొరబడే ఉగ్రమూకలు భారతదేశంలో అరాచక హింసాకాండకు పాల్పడటం దశాబ్దాలుగా సాగడం ప్రపంచం చూస్తూనే ఉన్నది.
ముంబై దాడులు, ఉడీ ఉగ్ర ఘాతుకం, పఠాన్‌కోట్ అమానుషం.. ఒకటా రెండా.. అదొక వికట క్రీడగా, భారత్ పాలిట ఎడతెరిపి లేని పీడగా మారింది. ఆ ఉన్మాదం పహల్గాంలో నవ వధువుల సిందూరాన్ని రాల్చే కర్కోటక స్థాయికి చేరింది. ‘శస్త్ర చికిత్స’ తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓపిక, సహనం పూర్తిగా అడుగంటిపోయి, ఉగ్రవాద విషవృక్షాన్ని సమూలంగా పెకిలించేందుకు భారత్ ప్రళయగర్జన చేసింది. ‘అనివార్యం యుద్ధం శరసంధానమే ధర్మం’ అంటూ అగ్ని వర్షంలో ఉగ్ర స్థావరాలను భస్మీపటలం చేసింది. ఇది ధర్మాగ్రహంతో కూడిన అత్యంత న్యాయమైన ప్రతిస్పందన. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు రెండో అభిప్రాయం ఎలా ఉంటుంది?
ఇంతకూ పరిస్థితి ఇక్కడిదాకా ఎందుకు వచ్చింది? పాకిస్థాన్ ఉగ్రవాదుల ద్వారా సాగిస్తున్న పరోక్ష యుద్ధానికి ముంగింపు ఎప్పుడు? పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నిర్దేశకత్వంలో భారత్‌లోకి చొచ్చుకువచ్చే ఉగ్రమూకల కిరాతకాలకు అంతం ఎప్పుడు? అంటే భారత్ ‘ఇప్పుడు.. ఇప్పుడే’ అని గర్జించింది. ఆగ్రహాగ్నిని వర్షించింది. అసలు పరిస్థితి ఇంతదాకా ఎందుకు వచ్చింది? అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ అనే బాధ్యతారహిత దేశం అనుసరిస్తున్న అమానవీయ విధానాలను సూటిగా, మడతపేచీ లేకుండా ఎప్పుడో ఎండగట్టి ఉండాల్సింది. బెత్తం పుచ్చుకొని అదుపు చేయాల్సింది. కానీ, అలా జరుగలేదు ఎందువల్ల? అస్పష్ట, సంక్లిష్ట గ్లోబల్ రాజకీయాల నీడలో పాక్ ఆటలు సాగాయి. పాక్ పుట్టుకే ఓ వికృతి. మత విభజన పేరిట జరిగిన ఓ అసహజ రాజ్యకల్పన. బ్రిటిష్ వలస పాలకులు అందుకు మంత్రసానులు. మతాన్ని జాతిగా మార్చిన విశ్వ రాజకీయ విషపూరిత ఎత్తుగడ అది. ప్రత్యేక దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి పాకిస్థాన్ భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నది.
పాక్.. నాడు భారత్ ప్రహారంతో రెండు ముక్కలైన వికల రాజ్యం. అమెరికా ఆధిపత్య కాంక్షతో పెంచి పోషించిన ఓ ప్రాంతీయ కిరాయి సైనికుడు. దక్షిణాసియా గుండెలపై ఓ మానని గాయం. భారత్ వ్యతిరేకతతో నిలువెల్లా విషమయమైపోయిన దీర్ఘరోగి. చైనా కుటిల చదరంగంలో ఓ దిక్కుమాలిన పావు. పాక్ ఇవాళ ఓ కర్కోటక శక్తిగా మారడం వెనుక ప్రపంచ బాధ్యత ఉన్నది. కాదు కాదు, బాధ్యతారాహిత్యం ఉన్నదని చెప్పడం సబబుగా ఉంటుంది. ఇవాళ భారత్ తన వాదాన్ని బల్లగుద్ది మరీ వినిపిస్తున్నది. దుష్ట పన్నాగాల నికృష్ట పొరు గు పోరుపై శస్ర్తాస్ర్తాలు సంధిస్తుంటే ప్రపంచం తదేక దీక్షగా చూస్తున్నది. ‘తథాస్థు’ అని జేజేలు పలుకుతున్నది. ‘జయోస్తు’ అని తలలూపుతున్నది.