ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెరమీదికి వచ్చింది ఎందుకు? సలహా ఇచ్చింది ఎవరు? అమల్లోకి తెచ్చింది ఎవరు? మున్సిపల్ ఎన్నికల వేళ ఈ హడావుడి ఏమిటి? అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రత్యేకంగా తెప్పించిందా? సిట్ వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటువంటి నిఘా యంత్రాలను రాష్ట్రంలో గుర్తించిందా? గడ్డిపరకను పట్టుకొని బ్రహ్మాస్త్రం అని చూపే ప్రయత్నం ఏమిటి? బీఆర్ ఎస్ ప్రభుత్వానికి అంటగట్టి, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకునే కుట్రలు ఎందుకు? దీని మూలాలు దొరకాలంటే ఒకసారి 2015లోకి వెళ్లాలి. పసిగుడ్డు తెలంగాణను హత్య చేయగావించిన దుష్ట చరిత్రను తడిమి చూడాలి.
అమరావతి అలీబాబా వదిలిన స్లీపర్ సెల్ హైదరాబాద్‌లో యాక్టీవ్ రోల్‌లోకి వచ్చిన నాటి నుంచే ‘తెలంగాణ ఆత్మకు’ మలినం పులిమే దుస్సాహసానికి బరితెగించింది.‘మన వాళ్లు బ్రీఫుడు మీ’ అంటూ పొరుగు రాష్ట్రం పాలకుడు ఫోన్లో మాట్లాడుతుండగా.. బ్యాగుల నుంచి రూ. 50 లక్షల నోట్ల కట్టలు బయటకు తీసి సర్దుతున్నపాపిష్టి కార్యంలో దొరికిపోయాడనే కడుపుమంట నుంచి పుట్టిందే ఫోన్ ట్యాపింగ్ విచారణ భూతవిన్యాసం. అప్పుడు చంద్రబాబు చుట్టూ పరిభ్రమించిన ఉప గ్రహాలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌ను ఎత్తుకున్నాయి. గ్రహబలం బాగుండి అధికారం చేతికి అందిన పొద్దు నుంచి డైలీ సీరియల్ ఎపిపోడ్స్ నడిపిస్తూనే ఉన్నరు. సినిమా తారలు.. అక్రమ సంబంధాలు అంటూ జుగుప్సాకరమైన ఊహలను ప్రచారం చేశారు. మహిళా మంత్రులను ఎగదోసి లేని రంకులు అంటగట్టారు. బ్లాక్ మెయిల్‌తో రూ.కోట్లకు కోట్లు వసూలు చేశారంటూ ఎల్లో మీడియాకు లీకులు వదిలారు.
అమరావతిలో రూపం పోసుకొని హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన ఈ వికృతం 26 నెలలుగా సాగుతూనే ఉన్నది. ఇక్కడో సందర్భం గుర్తు చేయాలి. 2024 మార్చి 31రోజున ఆంధ్రజ్యోతి కొత్త పలుకులోని ఓ పేరా..‘ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్‌ను అప్పట్లో ట్యాప్ చేయడం వల్లనే ఓటుకు నోటు కేసులో ఆయనను ఇరికించి జైలుకు పంపారు. ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నాటి ఘటనకు ప్రతీకారంగా విచారణకు ఆదేశించారు’ అని రాసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఏం చేయాలకున్నా.. ముందుగా ఎల్లో పత్రికలో రాయించటం రివాజే కదా..! మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలిపించుకుంటున్నారు అని ఆ పత్రికాధిపతి పలికిన తర్వాతే కదా… మహిళా ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య అనైతిక సంబంధం అంటగడుతూ జనబాహుళ్య ప్రచారంలోకి వచ్చింది. అట్లా ఓటుకు నోటు కుట్రకు కొనసాగింపుగానే కేసీఆర్‌ను అవమానించాలనే ఆలోచన.
గడ్డి పరక వంటి కేసును బ్రహ్మాస్త్రమనే కలరింగ్ ఇచ్చి, ఇప్పుడే తెర మీదకు తీసుకు రావటం వెనుక ‘క్లాసికల్ పొలిటికల్ డైవర్షన్ స్టాటజీ’ ఉన్నది. సర్పంచ్ ఎన్నికల్లో చావుతప్పి లొట్ట పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలు జీవన్మరణ సమస్య అయింది. కాంగ్రెస్‌కు మెజారిటీ మున్సిపాలిటీలను గెలుచుకోవాల్సిన అనివార్యత ఏర్పడ్డది. కానీ క్షేత్ర స్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఎన్ని మాటలు చెప్పినా.. ఇంకెన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి అసలే లేదు. ఇటువంటి విపత్కర కాలంలోఎన్నికల మూడ్ నుంచి బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ దృష్టిని మళ్లించే కుట్రే ఫోన్ ట్యాపింగ్ విచారణ. ముందుగా కేటీఆర్‌కు, తర్వాత హరీశ్‌రావు, సంతోష్‌రావు నోటీసులు ఇవ్వటం ద్వారా క్యాడర్ మూడ్‌ను ఎన్నికల వైపు నుంచి ఇటువైపు తిప్పాలని భావించారు.
ఇప్పుడు ఏకంగా కేసీఆర్‌కే నోటీసులు జారీ చేయించి, లీడర్, క్యాడర్ మూడ్‌ను సంపూర్ణంగా ఇదే ఇష్యూ మీద కేంద్రీకరించే విధంగా కుట్ర పన్నారు. ఎన్నికలు ముగిసే వరకు రేవంత్‌రెడ్డి ప్రేరేపించిన పోలీసులు ఈ డ్రామాను రక్తి కట్టిస్తూనే ఉంటారని అర్థమవుతున్నది.
ఫోన్ ట్యాపింగ్ నూటికి నూరుపాళ్లు పోలీసుల పని, పోలీసులు మాత్రమే చేసే పని. రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ డీజీ స్థాయి అధికారి చేసే పని. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే సిట్ ముందు ఎవరిని విచారించాలి? అప్పటి ఇంటెలిజెన్స్ డీజీని విచారించాలి కదా? అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ.. ఇప్పటి డీజీపీ. ఆ.. ప్రాథమిక సూత్రాన్ని వదిలేసి కేటీఆర్ , హరీశ్ రావు, సంతోష్‌రావును వరుసగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవటంలో పోలీసులు తెలిసి తెలిసి పొలిటికల్ డైవర్షన్ డ్రామాలో పావులు అవుతున్నారనేది జగమెరిగిన సత్యం.
రాజ్య పాలనలో పకాగా గూఢచర్యం ఉన్నది. ఇందుకోసం ఓ పోలీసు విభాగమే ఉన్నది. ఇండియన్ పోస్టాఫీస్ యాక్ట్ 1898 (సెక్షన్ 26), భారత టెలిగ్రాఫిక్ చట్టం, 1885లోని సెక్షన్ 5 (2) రూల్స్ , 2007లోని రూల్ 419 ఏ ద్వారా ట్యాపింగ్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖలకు అధికారం ఉన్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా ఫోన్ ట్యాప్ చేసే అధికారం సంబంధిత శాఖలకు సంక్రమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉన్నది. మారుమూల ప్రాంతాల్లో లేదా ఆపరేషన్ కారణాల వల్ల, ముందస్తు ఆదేశాలను పొందడం సాధ్యం కానట్టయితే, సంస్థ డైరెక్టర్ లేదా రెండవ సీనియర్ అధికారి ఆదేశాలు ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తకువ కాకుండా ఉండాలి.
కాంగ్రెస్ ప్రధానులైన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రతిపక్ష, స్వపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు 1991లో సీబీఐ రహస్య నివేదికలో పొందుపరిచింది. చంద్రశేఖర్ ప్రభుత్వానికి రాజీవ్‌గాంధీ మద్దతు ఉపసంహరించడానికి ఫోన్ ట్యాపింగ్ ముఖ్య కారణం అని అప్పట్లో చర్చ జరిగింది. పీవీ ప్రభుత్వం, వాజపేయి ప్రభుత్వంపై కూడా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అభియోగాలున్నాయి. ఎస్పీ నేత అమర్‌సింగ్ 2006లో యూపీఏ ప్రభుత్వంపై, అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు మోపారు. ఫోన్ ట్యాపింగ్ చరిత్రను ఎంత తవ్వినా.. అటు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు, ఇటు చంద్రబాబు వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి.
చంద్రబాబుకు ఫోన్ ట్యాపింగ్ పితామహునిగా గుర్తింపు ఉన్నది. సాంకేతిక నైపుణ్యం పెద్దగా అందుబాటులో లేని 1995 రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం నెలకొన్నది. దానికి ఆద్యుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్, వ్యక్తిగత డాటా చౌర్యం జరిగిందని ఆ రాష్ట్ర శాసనసభ ఉపసంఘం కూడా నిగ్గు తేల్చింది. ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ వెళ్లి మరీ పెగాసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని, ఇందుకోసం రూ.25 కోట్లు ఖర్చు చేశారని ఉప సంఘం నిర్ధారించింది. ఇదే అంశాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర శాసనసభలో స్వయంగా వెల్లడించారు.
ఓటుకు నోటు కేసులో ‘హలో బ్రదర్.. మనవాళ్లు బ్రీఫుడు మీ.. ఐ యామ్ విత్ యూ.. డోన్ట్ బాదర్, ఫర్ ఎవ్రీ థింగ్ ఐయామ్ విత్ యూ’ అనే సెల్‌ఫోన్ స్వర పలుకులు చంద్రబాబువే అని ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ధారించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అదే సందర్భంలో చంద్రబాబు వ్యక్తిగత సెల్‌ఫోన్ గాని, ఆయన అధికారిక సెల్‌ఫోన్ గానీ ట్యాపింగ్‌కు గురికాలేదని ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసింది. ఇది రాజనీతిజ్ఞునిగా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని విశదపరిచిన నివేదిక. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ల మీదనే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించలేదని ఇంటెలిజెన్స్ బ్యూరోనే స్పష్టం చేసింది. అర్భకుల ముచ్చట్లు ఆయనకేల? ఓటుకు నోటు కేసు ప్రతీకారం తీర్చుకోవాలనే వ్యక్తిగత కసి, మున్సిపల్ ఎన్నికల్లో గెలువాలనే యావ తప్ప ఇందులో తెలంగాణ జాతి జనుల ప్రయోజనాలు ఇసుమంతైనా ఉన్నాయా?
చరిత్రలో రాజకీయ వేధింపుల కోసం ఎన్నో కమిషన్లు వేసిండ్రు. అవేవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె మీదికెక్కిన నాటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా.. కేసులు, కమిషన్లు, విచారణల పేరుతో ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తూనే ఉన్నది. ఘోష్ కమిషన్ అని కొంత కాలం, ఈ-కార్ రేసింగ్ అని కొంత కాలం నెట్టుకొచ్చిండ్రు. విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారం అన్నారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్, జస్టిస్ లోకూర్ కమిషన్లతో ఇంకొంత కాలం సాగతీసిండ్రు. ఏదీ ఏమీ తేల్చలేదు. మున్సిపల్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ సిట్ అంటున్నరు. అన్నీ ట్రాష్.. బేస్‌లెస్ ఎలిగేషన్స్. 26 నెలల నుంచి చేయని చేతబడులు లేవు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు, పఠించని క్షుద్ర రాజకీయ పఠనాలు లేవు. అయినా తెలంగాణ ప్రజల ఆశీర్వాద బలమే రక్షణ కవచమై కేసీఆర్‌ను కాపాడుతున్నది… భవిష్యత్తులోనూ కాపాడుకుంటుంది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు