వేమన రాసిన ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన’ అనే పద్యం ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలంగాణ బీజేపీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. వెనుకటికి రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంటే ప్రధాని మోదీ మాత్రం దేశవ్యాప్తంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడటమే పనిగా పెట్టుకొని ప్రజలను, వారి ప్రయోజనాలను విస్మరిస్తుండటం హేయనీయం.
ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ, అభివృద్ధ్ది అంటూ పరుగులు పెడుతుంటే ప్రధాని మోదీ పాలనలోని భారతదేశంలో మాత్రం ద్వేషం, అశాంతి, మత విద్వేషాలు, అల్లర్లు పెచ్చరిల్లుతున్నాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా అధికారమే ఎజెండాగా ఈ దేశంలో పాలన కొనసాగుతున్నది. సంపదను పెంచి పేదలకు పంచాలనే విషయాన్ని మరిచిన ఈ దేశ పాలకులు కార్పొరేట్ శక్తుల సంపదను పెంచి పేదలను మోసం చేస్తున్నారు. అందుకు ఉదాహరణ అదానీకి కేంద్రం అండగా నిలుస్తున్న తీరు. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై మాత్రం ధరల భారాన్ని మోపుతున్నది. దేశంలోని సహజ సంపదను వినియోగించుకొని అద్భుతాలు సృష్టించవచ్చు కానీ, అది చేయకుండా రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలతో పబ్బం గడుపుతున్నది. అభివృద్ధ్ది వార్తలతో వెల్లివిరియాల్సిన దేశం కక్ష సాధింపులు, అణచివేతల వార్తలతోనే పూటగడుపుతున్నది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు అందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొన్నేండ్లలోనే దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలుచేస్తున్నది. పలు రాష్ర్టాల్లో కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్త్తున్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వటమా, ఇవ్వకపోవటమా అనేది కేంద్రం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే దేశ పరిస్థితిని చూసి, అభివృద్ధిలో దేశం వెనకబడటాన్ని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతూ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణ మాడల్‌గా దేశంలో పాలనా ఫలాలు ప్రజలకు అందాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని తలచి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఎత్తుకున్నారు.
ఆయన పిలుపుతో దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ఇది మింగుడు పడని నరేంద్ర మోదీ ప్రభుత్వం కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది. తొలుత ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర పన్ని అది నెరవేరక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నది. అయినా కేసీఆర్ వెరవకపోవడంతో వారి కుటుంబసభ్యురాలైన ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం పేరుతో ఒక తప్పుడు ఆరోపణ చేసి కేసుల పరంగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఆ పాచికా పారలేదు. ఉద్యమ నేపథ్యం, పోరాటతత్వం కలిగిన కేసీఆర్ ఏనాడు ఏ పోరాటంలోనూ వెన్ను చూపలేదు. రాజీలేకుండానే ఆయన ముందుకు వెళుతున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనలేక ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తూ జనాల్లో బీజేపీ మరింత పలుచనవుతున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా మార్చుకున్నది. ఈడీ, సీబీఐ ఫైల్ చేసిన మొత్తం కేసుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే ఉన్నాయి. అందులో శిక్షపడిన వారు 0.46 శాతం మంది. తొమ్మిదేండ్ల కాలంలో ఈడీ 121 కేసులు పెడితే అందులో ప్రతిపక్షాలపై పెట్టినవే 115 కేసులు. సీబీఐ పెట్టినవి 124 కేసులైతే ఇందులో ప్రతిపక్షాలపై చేసినవి 118 కేసులు. పీఎంఎల్ఏలో ఈడీ 5,422 కేసులు నమోదు చేస్తే అందులో ప్రతిపక్షాలపై ఉన్నవి 5150 కేసులు. కానీ శిక్ష పడ్డది మాత్రం 25 మందికి. అంటే బీజేపీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదో ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇలా కేసులు పెట్టగానే పలువురు తమను తాము రక్షించుకోవడానికి బీజేపీలో చేరారు. అలా చేరినవారిలో చాలామంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వారిలో మనీలాండరింగ్ కేసులో నారాయణ్ రాణే, శారద మల్టీలెవెల్ మార్కెటింగ్ కేసులో సువేందు అధికారి, శారద కుంభకోణంలో నిందితుడు హిమంత్ బిశ్వశర్మ, ముకుల్‌రాయ్, భూ అక్రమణ కేసులో జ్యోతిరాదిత్య సిందియా, భావన గవాలి, యశ్వంత్ యాదవ్, ప్రతాప్సర్ నాయక్, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలా పలు రాష్ర్టాల నేతలున్నారు. వీరంతా బీజేపీలో చేరగానే నీతిమంతులైపోయారు. వారిపై ఎలాంటి కేసులుండవు. విచారణ సంస్థలు వారి జోలికి పోవు. అంటే ఈడీ, సీబీఐలను బీజేపీ ఎంత దుర్వినియోగం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వీళ్ల చర్యలు నచ్చక ఓ అధికారి రాజీనామా చేయడం అత్యంత బాధాకరం.
ఇక ఊరంతా ఒకదారి అయితే ఊసుకండ్లోడిది ఒక దారి అన్నట్టు రాష్ట్రంలో బీజేపీ నేతలది తలోదారి. వీరి చేష్టలను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. వికృతపు మాటలు, చిల్లర చేష్టలతో తెలంగాణ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇంకో 50 ఏండ్లయినా వీళ్ళకు అధికారం రాదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉ న్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఇటీవల బండి సంజయ్ చేసిన వాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, ఆక్షేపణీయం. ఒక మహిళ పట్ల ఎలా మాట్లాడాలో తెలియని సంస్కార హీనుడు బండి సంజయ్. అతని వాఖ్యలను ఆ పార్టీ నేతలే ఛీ కొడుతున్నారు. కవితపై బండి సంజయ్ వాఖ్యలకు గవర్నర్ స్పందించకపోవడం విచారకరం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయాలు చేస్తూ గవర్నర్ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు.
ఇక మరో పార్టీ కాంగ్రెస్ రూ టే వేరు. వందేండ్ల చరిత్ర కలిగి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బీజే పీ వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తిగా విఫలమైంది. బీజేపీ చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపకపోగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్యాలు, చిల్లర మల్లర కూతలు తప్ప ప్రజలకు మంచి చేసే ఒక్క విషయం ఉండదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు.
మొత్తంగా దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ఆగం చేస్తున్నది. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నది. ఈ తరుణంలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం శుభపరిణామం. ఇలాంటి విపత్కర సమయంలో కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఈ దేశానికి తప్పనిసరిగా ఉన్నది.
-తెలంగాణ విజయ్
94919 98702