చాలా ఏండ్ల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎథిక్స్ కమిటీ పేరు వినిపించింది. తెలంగాణ శాసనసభలో ఒక ఎమ్మెల్యేకు మరో శాసనసభ్యుడు సంజ్ఞలు చేశారట. దీనిపై విచారణకు ఎథిక్స్‌కి అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది ప్రకటించే సమయానికి ఎథిక్స్ కమిటీ లేదు. అయితే ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా’ అన్నట్టు ఎథిక్స్ కమిటీని అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంజ్ఞలు చేశారు అనేది అభియోగం. అసెంబ్లీ రికార్డ్, స్పీకర్ ప్రకటన ప్రకారం ఈ ఇద్దరు సభ్యులు కూడా బీఆర్ఎస్కు చెందినవారే. తమ పార్టీకి చెందిన శాసనసభ్యునికి అదే పార్టీ సభ్యుడు సంజ్ఞలు చేయడంపై ఎథిక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వాడీవేడి చర్చ జరుగుతున్న అంశం.. ఎథిక్స్ కమిటీ. పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి మధ్య అసెంబ్లీలో వివాదం నెలకొన్నదని, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అసలు రాష్ట్రంలో ఏథిక్స్ కమిటీయే లేదు. ఇది కూడా తెలియదా అని ప్రతిపక్ష సభ్యులు నిలదీశారు. దీంతో ఆగమేఘాలపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అసలు ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందో, గతంలో ఎప్పుడు ఏర్పాటు చేశారో చూద్దాం. దేశంలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎథిక్స్ కమిటీ వేశారు. అది 1995 నాటి అసెంబ్లీ. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నారు. కానీ ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారు.
కానీ అప్పటికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోలేదు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా నిలబడ్డాను. నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అని ఎన్టీఆర్ ఎన్నిసార్లు వేడుకున్నా స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటుతో అధికారం నుంచి దించేశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో బాబుకు వెన్నుపోటు ముద్ర పడింది. స్పీకర్ చర్యను కూడా హైకోర్టు తప్పుపట్టింది. ఎన్టీఆర్‌ను దించేయడానికి యనమలను అప్పటికప్పుడు హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు రప్పించారు బాబు. ఎన్టీఆర్ తనను దించేయడం చట్టవిరుద్ధం అంటూ కోర్టుకు వెళితే యనమల తొందరపాటుగా వ్యవహరించారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పొడిచిన ఘట్టం ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయం. చంద్రబాబు రాజకీయ జీవితంలో వెన్నుపోటు మాయని మచ్చ. కానీ ఆ ముద్రను చెరిపేసుకొని తమ ప్రభుత్వానికి క్లీన్ ఇమేజ్ కోసం చంద్రబాబు అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ పేరుతో జిమ్మిక్కులకు పాల్పడ్డారు. శాసనసభ్యులు సభలో, బయట విలువలకు కట్టుబడి ఉండేందుకే ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసినట్టు నమ్మబలికారు.
ఏ విలువలనైతే చంద్రబాబు ఉపేక్షించారో, ఆ విలువలకు తానే అంబాసిడర్ అన్నట్టు కలరింగ్ ఇవ్వడం కోసం బాబు చేసిన ప్రయత్నమే ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ 1995-99 సభకే పరిమితమైంది. విచిత్రం ఏంటంటే 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అయ్యదేవర కాళేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. చంద్రబాబు ఉపన్యాసంలో రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని అన్నారు. ఎన్టీఆర్‌కు వె న్నుపోటు పొడిచి అప్పటికి నెల కూడా కాలేదు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో చంద్రబాబు విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే ‘రాజకీయాల్లో ఉంటూ విలువల గురించి మాట్లాడవద్దు’ అని వైఎస్ చురక అంటించారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎథిక్స్ కమిటీ గురించి మాట్లాడారు.
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి గురుశిష్యులు. ఇటీవలే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పు ఆశ్చర్యం కలిగించింది. వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ నిర్ణయానికి వచ్చారు. సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని, కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా వాళ్లు పార్టీ మారలేదు అని నమ్మాలట. అందరికన్నా చిత్రమైన విలువలతో కూడిన రాజకీయం దానం నాగేందర్‌ది. బీఆర్ఎస్ నుంచి శాసనసభ్యునిగా గెలిచి, కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయినా నాగేందర్ పార్టీ మారలేదని, విలువలకు కట్టుబడి ఉన్నారని నమ్మాలా? కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ సభ్యులే. ఒకే పార్టీకి చెందిన సభ్యులు సంజ్ఞలు చేసుకుంటే ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందో చూడాలి. సీఎం సమక్షంలో కండువాలు మార్చుకున్నా, ఆధారాలు లేవంట. దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినా ఆధారాలు లేవంట. మరి సంజ్ఞలు చేస్తే ఆధారాలు ఎలా ఉంటాయో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో!
చరిత్రలో ఏ సీఎం కూడా ఇప్పుడున్న సీఎంలా బూతులు మాట్లాడలేదు. చివరకు విద్యార్థులు పాల్గొన్న సభలో కూడా బట్టలూడ దీసి కొడతా, లాగుల్లో తొండలు విడుస్తా అని బూతులు మాట్లాడే రేవంత్‌రెడ్డి ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి నైతిక విలువలు పెంపొందిస్తారో చూడాలి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు… నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు అన్నట్టుగా రాజకీయాల్లో విలువల గురించి ఎక్కువగా ఉపన్యాసాలు చేస్తారు… కానీ పాటించరు
– బుద్దా మురళి