రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్‌వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు. ఈ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు చూస్తే జనం నవ్విపోతారు. 60 ఏండ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు గ్యారెంటీ కార్డులు రాలేదు. అధికారంలోకి రాగానే గ్యారెంటీ కార్డులు ఉండవు.
చాలా రోజుల తర్వాత తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా బహిరంగ సభను కూడా నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన నాయకులు తెలంగాణను ఇచ్చిన పార్టీగా అధికారం మాకే ఇవ్వండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ తెలంగాణ ఎట్ల వొచ్చింది తెల్వదా మాకు. 14 ఏండ్లు పోరాటం చేసినం. కేసీఆర్ నాయకత్వంలో పోరాటానికి, ఎంతో మంది బిడ్డల ప్రాణ త్యాగానికి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. అంతే తప్ప అరవై ఏండ్లు అధికారంలో ఉండికూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించలేదు. ఇప్పుడు తిరిగి ఎన్నికలు అనగానే అధికారం కోసం సాధ్యం కానీ వాగ్దానాలను చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ.
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అనేక స్కాంలతో తన అధికారాన్ని కోల్పోయింది. అటు దేశంలో , ఇటు రాష్ట్రంలోనూ వారి ఉనికి లేకుండాపోయింది. దీంతో కొత్త రాగం అందుకున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలిపిస్తే మీ ఉద్దెర గ్యారెంటీ కార్డులు ఎటు పోయాయి. కేవలం అధికారం మాటున నాయకులు ఎదగడం కోసం కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే అరవై ఏండ్లు గోస పడ్డం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకుని ఒక దారిలో పోతున్నాం. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు కనిపిస్తున్నది. నాటి కరెంట్ తిప్పలు, కన్నీళ్లు లేవు. ఉద్యోగ, ఉపాధి బాధ లేదు. ఇప్పటికే లక్ష 30 వేల ఉద్యోగాలు కేసీఆర్ నాయకత్వంలో భర్తీ అయ్యాయి. మరో లక్ష ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి. వైద్య విద్య రంగంలో విప్లవాలు సృష్టిస్తున్నం. ఐటీరంగంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి, 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ , రంగనాయక సాగర్ వంటి అనేక ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మాణమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండు కుండల్లా జల కళ సంతరించుకున్నాయి. బీడు భూములన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.
ఎన్నడన్నా కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో గింత ప్రగతి చూసినమా? కాంగ్రెస్ పాలనలో పడావు పడ్డ భూములు, ఎడారిని తలపించే వాగులు, వంకలు , చెరువులు, ఆత్మహత్యలు, ఆకలి చావులు ఇవే కదా! నేడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవేవీ లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉన్నది. పచ్చని పంట పొలాలతో పరిఢ విల్లుతున్నది.
ఎన్నికలు రాగానే గ్యారెంటీ కార్డులు అంటూ బయలు దేరిన కాంగ్రెస్ పార్టీ ఊకదంపుడు ప్రసంగాలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలకు పనిచేసే వారెవరో బాగా తెలుసు. తెల్లారితే కాంగ్రెస్, పొద్దుగూకితే బీజేపీ నాయకులు రయ్ రయ్ మంటూ హైదరాబాద్ వచ్చి పోవడమే తప్ప తెలంగాణకు మీరు చేసిందేం లేదు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ కార్డులన్నీ కరపత్రాలు మాత్రమే. అవన్నీ కాపీ కరపత్రాలు. రైతు భరో సా పేరిట రైతులకు పెట్టుబడి సాయం 15 వేలు, ఇది కేసీఆర్ అందిస్తున్న 10 వేల పెట్టుబడి సాయం కాపీ. కాకపోతే 5వేలు ఎక్కువిస్తరట! మనం నమ్మాలే?. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం చేయూత, మహాలక్ష్మి, ఆర్టీసీ బ స్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇవీ కాంగ్రెస్ గ్యా రెంటీ కార్డులు. వీళ్లు చెప్పిన గ్యారెంటీ కార్డులకు వారెంట్లు ఉండవు. ఎందుకంటే అధికారం రాగానే ఆ కా ర్డులేవీ కనిపించవు. కర్ణాటకలో అదే జరిగింది కదా. బీ జేపీ మీద కోపంతో కాంగ్రెస్‌ను గెలిపించారు. అక్కడ ప్రకటించిన గ్యారెంటీ కార్డులు అరేబియాసంద్రంలో కలిశాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో గ్యారెంటీగా అమలవుతున్న పథకాలు ఎన్నో ఉన్నాయి. చెప్పినవి, చెప్పనవి ఎన్నో ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి, అంబేడ్కర్ స్కాలర్ షిప్స్, రజకులు, నాయీ బ్రాహ్మణులు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు రాయితీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు , రైతుబంధు, రైతు బీమా, చేనేత బీమా, చేనేతభృతి, దళిత బంధు, గొర్ల పంపిణీ, బీసీ, మైనార్టీలకు సాయం, గృహలక్ష్మి, డబుల్ ఇండ్లు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ళు, బీడీ కార్మికుల భృతి, కంటి వెలుగు, న్యూట్రిషన్ కిట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. గులాబీ సంక్షేమం బతుకమ్మ పండుగలా సాగుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఒక విప్లవం. విశ్వసనీయత, నమ్మకం. మా ట ఇచ్చిండంటే అది నెరవేర్చే వరకు నిద్రపోరు. ఇయ్యాల తెలంగాణ ఇంత సల్లంగా ఉందంటే కేసీఆర్ వల్లనే. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్. ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు ఏవేవో పథకాలతో ఊదర గొడుతారు. ఉద్దెర ముచ్చట నమ్మితే మన అంగీ లాగు ఊడి పోతుంది. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులు తీసుకుంటే గంగలో మునిగిపోతాం తస్మాత్ జాగ్రత్త..