ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నిరంతరంగా ప్రవహించిన జీవనది ఆచార్య కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు. తెలంగాణకు జరిగిన అన్నిరకాల అసమానతలను కండ్లారా చూసి సాక్షీభూతుడిగా మిగిలిపోలేదు. ఉమ్మడి పాలకుల పాపాలను ఒక్కొక్కటిగా చిత్రగుప్తుని వలె లెక్కగట్టిండు. తెలంగాణే శ్వాసగా జీవితాంతం బతికి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్దేశించుకునే రోడ్‌మ్యాప్‌నకు ముడిసరుకు అందించి వెళ్లారు. ఇప్పుడా ముడిసరుకులో అత్యంత ప్రధానమైన నీరు తెలంగాణ ప్రమాదపు అంచులో ప్రవహిస్తున్నది. గోదావరి, కృష్ణాజలాల విషయంలో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే శాశ్వత కార్యాచరణకు దారులు తీయవలసిన అనివార్యత నెలకొన్నది. తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్లో ఉందో? ఏ నది బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉన్నదో అందరి ముందూ అడిగి చెప్పించుకోవాల్సిన ఏలికలు పాలిస్తున్న సందర్భంలో జయశంకర్ సార్‌ను మరిచిపోకుండా మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి.
తెలంగాణలో 2014 జూన్ 2వ తేదీకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో.. 2019 జూన్ 21కి అంతే ప్రాముఖ్యత ఉన్నది. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైతే, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్న తేదీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూడేండ్ల ముందు, రాష్ట్రం ఆవిర్భవించిన ఐదేండ్ల తర్వాత ఇదే జూన్ 21వ తేదీన తెలంగాణ అంత్యంత కలవరపాటుకు గురైంది. కన్నీరుమున్నీరుగా ప్రవహించింది.
1952 నుంచి 1969 దాకా, 1996 నుంచి 2001 దాకా, 2001 నుంచి 2011 దాకా నాలుగు తరాల నేతలతో, ఉద్యమకారులతో కలిసి పనిచేసి తెలంగాణే శ్వాసగా బతికిన మహోన్నతుడు ఆచార్య జయశంకర్ సార్ మరణించిందీ జూన్ 21వ తేదీనే. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’.. ఇది తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్.
ఆరు దశాబ్దాలపాటు తెలంగాణకు జరిగిన అన్యాయాలను అంకెలు, సంఖ్యలు సహా సహేతుక, శాస్త్రీయ ఆధారాలతో ప్రపంచానికి చాటిన ఆచార్య జయశంకర్ సార్ నడుస్తున్న తెలంగాణ చరిత్రను ఎట్లా చూసేవారు? ఒక మహావృక్షం కూలిపోతే ఎంత వెలితి ఉంటుందో అంత వెలితిని ఇవ్వాళ తెలంగాణ అనుభవిస్తున్నది.
తెలంగాణలో కృష్ణమ్మతో గోదావరి కరచాలనం చేసింది. ఆ కరచాలనమే కాళేశ్వరం. గోదావరి, కృష్ణా బేసిన్లను కాళేశ్వరం కలిపేసింది. ఇప్పుడా చరిత్ర మసకబారుతున్న కాలం. అక్కడెక్కడో రాజస్థాన్ బిడ్డ.. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ చెప్పేదాకా జలవిప్లవ సౌందర్యాన్ని గమనించలేదు. ఇప్పుడు బనకచర్ల బంకరాక్షసిలా, జలగలా గోదావరిని పీల్చేస్తున్నదని చెప్పినా చెవికి ఎక్కనితనం వెక్కిరిస్తున్నది. కేంద్రంతో సంబంధం లేకుండానే రాష్ర్టాలు సఖ్యతతో ఉంటే ఎంతటి జఠిలమైన జలసమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న సందేశాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చింది. ప్రజల యోగక్షేమాలే పరమావధిగా నమ్మే పాలకులు ఏ దిశగా అడుగులు వేయాలో ఆ సందర్భంగా తెలంగాణ ఆచరించి చూపింది. మేడిగడ్డ తెలంగాణ జీవగడ్డ మాత్రమే కాదు, నీటి పరిష్కార మార్గాన్ని చూపిన నిలువెత్తు జల సంతకమని తెలంగాణ నిరూపించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో శత్రుపూరిత వైఖరిని ప్రదర్శించడం ఏ మాత్రం సరికాదని తెలంగాణ భావించింది. సమస్యల శాశ్వత పరిష్కారానికి సరిహద్దు రాష్ర్టాలతో మైత్రి దోహదపడాలని తెలంగాణ భావించింది. కనుకనే ఆ రాష్ర్టాల ముఖ్యమంత్రులను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. కానీ, ఇవ్వాళ జరుగుతున్నదేమిటి?
తెలంగాణ జీవితం పట్ల, తెలంగాణ భాష పట్ల, సంస్కృతి పట్ల జయశంకర్ సార్‌కు ఉన్న లోతైన ఆత్మీయ అవగాహన ఇప్పుడెవరికి ఉన్నది? తెలంగాణ వనరుల పట్ల, వనరుల దోపిడీ, విధ్వంసాల పట్ల జయశంకర్ సార్‌కు ఉండే మ్యాథమెటికల్ అండ్ సైంటిఫిక్ ప్రమాణాలు ఎవరికున్నాయి? ఏ మేధావికి ఉన్నది?
నిజానికి మేధావి అంటే తను ఒప్పుకోరు. తెలంగాణ ఉద్యమానికి బుద్ధిజీవులు లేదా మేధావులు ఒక్కటిగా ఉండాలని ప్రయత్నాలు సాగిస్తున్నకాలంలో అనేక సంఘాలు, సంస్థలు ఏర్పడుతున్నాయి. ఆ క్రమంలో కొంతమంది తెలంగాణ ‘మేధావుల’ సంఘాన్ని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదన వస్తే ‘మనకు మనమే మేధావులు అనుకుంటే అతి అనిపిస్తది. మేధావులకు బదులు విద్యావంతులు అందాం’ అని వారు సూచించటం వల్లనే ఆ ఏర్పడిన సంస్థకు ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ అని నామకరణం చేసుకున్నారు. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అని దేశ సామాజిక ఉద్యమాలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నినదిస్తే తెలంగాణ ఉద్యమంలో అదే సమానార్థకంలో ‘భావజాలవ్యాప్తి.. ఆందోళన.. రాజకీయ ప్రక్రియ’ అనే దశల్ని నిర్ధారించి తెలంగాణ జనశంకరుడయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసే చనిపోవాలన్న ఆయన కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారు. లేదంటే తెలంగాణ పట్ల ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న వైఖరిని చూసి గుండెపగిలేవారు.
తెలంగాణ ఉద్యమానికి ఆనాడు జయశంకర్ సార్ విద్యావంతుల వర్గంపై ఆధారపడ్డారు. అది ఏ వర్గమైనా జయశంకర్ సార్‌ను ఆమోదించింది. జయశంకర్ సార్ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? రాజకీయ పార్టీలకు వ్యూహప్రతివ్యూహాలు ఉంటాయి. జిత్తులమారి ఎత్తుగడలూ ఉంటాయి. వాటి మధ్య తెలంగాణ ప్రయోజనాలు నలిగిపోకుండా బుద్ధిజీవులు, రాజకీయార్థుల ప్రయోజనాలకు అతీతంగా లేదా సమాంతరంగా కేవలం తెలంగాణ కేంద్రంగా నేతృత్వాన్ని అందించగల అందరివాడు కావాలి? తెలంగాణ మునుపెన్నడూ లేని అటువంటి లోటును గడిచిన కొంతకాలంగా అనుభవిస్తున్నది. వ్యక్తులు, సంస్థలు శిబిరాలుగా, సమూహాలుగా విడిపోయి ఎవరినీ అంగీకరించలేని స్థాయికి తెలంగాణ విద్యావంతుల సమాజం జారిపోయింది. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తిప్పుకుంటూ సంబురపడిపోయే సమూహాలు కాకుండా తెలంగాణకు జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తిని గురించిన చింతనాపరుల ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ గౌరవాన్ని, సమాజ వ్యక్తిత్వాన్ని, ప్రజాస్వామ్యతత్వాన్ని, పవిత్రతను చారిత్రక అంశగా స్వీకరించే సహృదయుల సాంగత్యం తెలంగాణకు ఇప్పుడే ఎక్కువ అవసరంగా కనిపిస్తున్నది.