దేశ రాజకీయాలలో కేసీఆర్‌ది ఒక ప్రత్యేక శైలి. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకెళ్తూ తనదైన రాజకీయ పంథాను సృష్టించుకున్న విలక్షణమైన నేత. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో, రాష్ట్ర సాధనతో దేశంలో ఒక బలమైన సంకల్పం గల నాయకునిగా, దార్శనికుడైన పరిపాలకునిగా కేసీఆర్ ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పును సాధించటానికి బయలు దేరారు. మన దేశంలో అన్ని రకాల వనరులున్నా సాధించాల్సిన అభివృద్ధిని సాధించటం లేదన్నది కేసీఆర్ భావన. అందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ‘అబ్ కీ బార్… కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందడుగు వేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించిన నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లకు నాయకత్వం వహించిన ఎన్టీఆర్, చంద్రబాబుల తర్వాత దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న తెలుగు వ్యక్తి కేసీఆర్ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ముందుకెళుతున్న కేసీఆర్.. ‘ఈసారి రైతుల రాజ్యం’ అని నినాదం ఇవ్వటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.
మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నం గా, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అగ్నిపథ్, పెద్దనోట్ల రద్దు, సాగుచట్టాలు, పౌరసత్వ బిల్లు, 370 ఆర్టికల్ రద్దు వంటి అనేక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకున్నది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మోదీ సర్కారు పరిష్కారం చూపలేకపోయింది. 45 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరిన నిరుద్యోగం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న వృద్ధి రేటు, రూపాయి విలువ పతనాన్ని ప్రభుత్వం అడ్డుకోలేక పోయింది. కార్పొరేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తూ విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్నది.
భారతదేశం వ్యవసాయిక దేశం. స్వాతం త్య్రం వచ్చే నాటికి జనాభాలో 72 శాతం మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉన్నారు. నేటికీ ఈ సంఖ్య 50 శాతం కంటే ఎక్కువగానే ఉన్నది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రణాళికల రూపంలో వ్యవసాయ రంగంపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేసినా రైతుల స్థితిగతులు మాత్రం మారలేదు. వ్యవసాయాన్ని పండుగగా, రైతును రాజును చేస్తామన్న ప్రభుత్వాల హామీలు నెరవేరలేదు. భూసంస్కరణలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవటం, హరిత విప్లవం ఫలాలు రైతులందరికీ చేరకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఎరువుల ధరలు పెరగటం, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించకపోవటం, సేద్యం ఖర్చులు పెరగడంతో రైతు దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఈ నేపథ్యంలో, రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వస్తున్నారు. దేశంలో కిసాన్ సర్కార్ వస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నది కేసీఆర్ విశ్వాసం. రైతు రాజ్యం కోసం, రైతుని రాజును చేయటం కోసం కిసాన్ సర్కార్ ప్రతిపాదన దేశం ముందు పెట్టారు.
దేశంలో రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ర్టాలలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, రైతు సమన్వయ సమితి, అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంట కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ లాంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం స్వరూపమే సమూలంగా మారిపోయింది. పెద్దఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ‘దుక్కి లేకపోతే దిక్కు లేదు’ అని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలో విజయవంతమైన వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు సాధించగలమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కిసాన్ సర్కార్ ప్రతిపాదన తెస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంత బలంగా ఉన్నానని చెప్పుకొంటున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయింది. అంటే, విపక్షాలు బలంగా పోరాడితే 2024 ఎన్నికల్లో బీజేపీకి జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది నిజం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ద్వారా విపక్షాల మధ్య ఐక్యతను తీసుకొచ్చి, వాటిని సమన్వయం చేయగలిగితే బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాబోదు.
రానున్న కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోగలిగితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. బెంగాల్, తమిళనాడు, బీహర్, యూపీ, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ర్టాల్లో 200 లకు పైగా లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిల్లో బీజేపీ యేతర పార్టీలు బలం పుంజుకొంటే బీజేపీని అధికారంలోకి రాకుండాఅడ్డుకొనే అవకాశం ఉన్నది. బలహీన స్థితిలో కాంగ్రెస్ ఉండటం, విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం బీజేపీ బలంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్తో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దిగారు. కేసీఆర్ వ్యూహచతురత, దార్శనికత వల్లనే తెలంగాణ సాధ్యమైంది. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుందనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ)
కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పగించే లక్ష్యంతో సాగు చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల చావుకు కారణమైంది మోదీ ప్రభుత్వం. వారి కుటుంబాలను కేంద్రం పట్టించుకోకపోయినా కేసీఆర్ వారికి ఆర్థిక సాయం అందించారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిలదీస్తున్న కేసీఆర్ కిసాన్ సర్కారు ప్రతిపాదనకి దేశవ్యాప్తంగా మద్దతు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డాక్టర్ తిరునాహరి శేషు: 98854 65877