‘వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి’ అనే వార్త చదివాక నా హృదయం కకావికలమైంది. దాడిచేసిన కుక్కలు ఆ చిన్నారిని పీక్కుతిన్న విధానాన్ని వీడియోలో చూసిన ప్రతి వ్యక్తి గుండె కన్నీరు కార్చకుండా ఉండదేమో! తాజాగా హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో జరిగిన వీధికుక్కల దాడి సంఘటన యావత్ ప్రజానీకాన్ని కదిలించింది. అయితే చిన్నారులపై వీధి కుక్కల దాడి ఘటనలు తరచూ జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.
Street Dogs | గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. నిద్రలో లేచి గుడిసె నుంచి బయటకువచ్చిన బాలుడిని అర్ధరాత్రి వేళ వీధి కుక్కలు దాడిచేసి చంపాయి. ఈ సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏమంటే… కార్లలో తిరిగే ఉన్నత వర్గాల పిల్లలో, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రదేశాల్లో నివసించే అత్యున్నత వర్గాల పిల్లలో కాదు కుక్క కాట్లకు బలయ్యేది. రాష్ట్ర నలుమూలల నుంచి నగరానికి వలస వచ్చి, గుడిసెల్లో బతుకుతున్న, రెక్కాడితేగానీ డొక్క నిండని పేద వర్గాల పిల్లలే వీధికుక్కల దాడులకు బలవుతున్నారు.
ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మాత్రమే స్పందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శునక నియంత్రణ పద్ధతులను పాటిస్తున్నామని చెప్తున్నది. అయినా వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పైగా వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా, ఏటా ఫిబ్రవరి నుంచి ఆగస్టు మాసాల మధ్య వీధికుక్కల దాడులు తీవ్రతరమవుతున్నాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కుక్కల దాడులకు ముఖ్య కారణం వాటికి తగిన ఆహారం లభించకపోవడమే. గతంలో ప్రతి
వీధికో చెత్తకుండీ ఉండేది. తినగా మిగిలిన ఆహార పదార్థాలను వీధిలోని ప్రజలు ఆ కుండీల్లో వేసేవారు. ఆ రోజుల్లో కుక్కలకు అదే ఆహారమయ్యేది. అయితే నగరాల సుందరీకరణలో భాగంగా నగరాల్లోని చెత్తకుండీలు మాయమయ్యాయి. వాటి స్థానంలో ఇంటింటికీ చెత్త తరలింపు వాహనాలు వస్తున్నాయి. ఇక ప్రజలు తినగా మిగిలిన ఆహార పదార్థాలన్నీ దూరంగా, ఎక్కడో ఉన్న డంప్ యార్డుకు చేరుకుంటున్నాయి.
ఆకలి మనిషిని మృగంగా మారుస్తుందన్నాడొక మేధావి. వివేకం ఉన్న, అన్నీ తెలిసిన మనిషే ఆకలితో మృగంగా మారుతున్నప్పుడు నోరులేని జంతువులైన శునకాలు మృగాలుగా మారడంలో ఆశ్చర్యం లేదు. అందుకే పసి పిల్లల మీద వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శునకాల ఆకలి సమస్యకు వెంటనే పరిష్కారం వెతకకపోతే కుక్కల దాడులకు పిల్లలు మాత్రమే కాదు, రానున్న రోజుల్లో పెద్దలు కూడా బలి కావాల్సి వస్తుంది. ఇంతటి తీవ్రమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పరిష్కారంగా తూతూ మంత్రంగా సాగే శునక నియంత్రణ కార్యక్రమాన్ని ప్రధాన కార్యక్రమంగా నిర్వహించాలి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో పాటిస్తున్న శునక నియంత్రణా విధానాలను పరిశీలించి సాధ్యమైతే, రాష్ట్రంలోనూ అమలుచేయాలి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో రకరకాల జంతువులకు రకరకాల పార్కులున్నాయి. మన దేశంలోనూ జింకల కోసం పార్కులున్నాయి. భయంకరమైన జంతువులు సింహాలు, పులుల కోసం వేల ఎకరాల అభయారణ్యాలున్నాయి. కానీ, చిన్నపిల్లలపై దాడులు చేస్తున్న శునకాలకు పార్కులు లెవ్వు. కాబట్టి కుక్కలకు కూడా నగరాలకు దూరంగా పార్కులను ఏర్పాటుచేయాలి. చదువడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ, కుక్కల కోసం పార్కులను ఏర్పాటుచేసి, అవి ఆ పార్కు దాటిరాకుండా కంచెలను నిర్మించి, ఎప్పటికప్పుడు వాటికి ఆహారం అందిస్తే క్రమంగా కుక్కల సంఖ్యను నియంత్రించవచ్చు. అప్పుడే మనుషుల మీద కుక్కల దాడుల ఘటనలు తగ్గుతాయి. ఏదేమైనా పిల్లలపై వీధి కుక్కల దాడుల ఘటనలను ప్రభుత్వాలు తేలికగా తీసుకోవద్దు. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయస్థాయిలోనూ ఈ అంశం చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది.
– బసవరాజు నరేందర్ రావు 99085 16549