మోసానికి మారుపేరు కాంగ్రెస్. వంచనకు కేరాఫ్ అడ్రస్ హస్తం పార్టీ. నమ్మినవాళ్లను ముంచడంలో ఆ పార్టీ దిట్ట. వెంట నడిచిన వాళ్ల వెన్ను విరవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించిన వారిని కూడా ఆ పార్టీ వదలడం లేదు. అందులో భాగంగానే తమకు ఓట్లు వేసి గెలిపించిన వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నది. పార్టీ జెండా మోసిన వాళ్లను నిండా ముంచుతున్నది. ఏరికోరి మరీ కాంగ్రెస్‌ను గద్దెనెక్కించిన వర్గాలనే మొదట దెబ్బకొడుతున్నది.
Congress | ‘నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్టు’ ఉన్నది ప్రస్తుత తెలంగాణ గ్రామీణ ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది గ్రామీణ ప్రాంతాల్లోనే. కేసీఆర్ సర్కార్ కంటే ఇంకా ఎక్కువే చేస్తారని అమాయకంగా నమ్మిన గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకున్నది. అన్నదాతను ఆగమాగం చేస్తున్నది. కొత్త పథకాల సంగతి పక్కనపెడితే ఉన్న పథకాలను ఊడగొట్టింది. కేసీఆర్ సర్కార్ గుట్టలకు, పుట్టలకు రైతుబంధు ఇచ్చిందని సాకులు చెబుతూ పెట్టుబడి సాయానికి పంగనామం పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టలకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చిందో, లేదో తెలియదు గానీ, స్వేదం చిందించి సేద్యం చేసే ప్రతి రైతన్నకు ఠంచనుగా సాయం అందించి పెట్టుబడి వెతలు తీర్చింది.
కానీ, ఏడాది నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క తేలడం లేదు. ఇప్పటికే ఒక సీజన్ ఎగ్గొట్టింది. ఎకరానికి రూ.15,000 ఇస్తామని బాకాలు ఊది, ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. అది కూడా గణతంత్ర దినోత్సవం రోజున. ఆ రోజు జరిగిన సభలో 15 నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు మాటలు మాట్లాడారు. మొదట అర్ధరాత్రి నుంచి ఫోన్లు మోగుతాయని చెప్పి, ఆ తర్వాత మార్చి 31 వరకు సాయం సొమ్ము వేస్తామని మాట మార్చేశారు. తమ ఫోన్లు ఎప్పుడు మోగుతాయోనని రైతన్నలు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, కరెంటు కోతలు కర్షకులను ఇబ్బంది పెడుతున్నాయి. రుణమాఫీ అరకొరగా చేశారు. రైతుబీమా సాయం కూడా ఆగిపోయింది. నీళ్ల గోస మళ్లీ మొదలైంది. యూరియా తిప్పలు తప్పడం లేదు. దీంతో ఏరికోరి మరీ నెత్తిన శనిని కూర్చోబెట్టుకున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ముంచిన మరో వర్గం యువత. హస్తం పార్టీ మాయమాటలు నమ్మిన నిరుద్యోగులు ఎన్నికల వేళ మూడు రంగుల జెండాను భుజాలపై మోశారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కానీ, వారు ఆశించినట్టుగా ఇటు రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు, అటు నిరుద్యోగ భృతి కూడా దక్కలేదు. జీవో 46 బాధితులను కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకొని నడిరోడ్డుపై వదిలేసింది. చదువుకునే యువత డిగ్రీలు, పీజీలు పూర్తి చేయగానే ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కానీ, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు కూడా రాకపోవడంతో వారి చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పైగా ఉద్యోగాల కోసం నిలదీస్తున్న నిరుద్యోగులకు లాఠీచార్జీలు, కేసులు బోనస్‌గా దక్కాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు కూడా దారుణంగా మోసపోయారు. ఎన్నికలకు ముందు ఏ ఆటో చూసినా మూడు రంగుల జెండా పాటే వినిపించేది. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఆ పాట వింటేనే చిర్రెత్తుకొస్తున్నది. ఇక, ఆర్టీసీ కార్మికుల బాధ వర్ణనాతీతం. కోరి తెచ్చుకున్న సర్కార్ ఇప్పుడు వారి కొంపలు ముంచింది. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా కాంగ్రెస్ సర్కార్ రాగానే దాన్ని అటకెక్కించింది. అంతేకాదు ఇప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నది. ఒక్కొక్కటిగా డిపోలను ప్రైవేటుపరం చేస్తున్నది. రానున్న రోజుల్లో ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కుయుక్తులు పన్నుతుండటంతో కార్మికులు సమ్మె హారన్ మోగించాల్సి వచ్చింది.
మహిళలకు ఒకే ఒక్క ఉచిత బస్సు పథకాన్ని అమలుచేసిన ప్రభుత్వం మిగతా అన్నింటికీ ఎగనామం పెట్టింది. రూ.2,500 ఆర్థిక సాయం మాటే లేదు. 500 రూపాయల గ్యాస్ ఊసే లేదు. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వారికి న్యాయంగా దక్కాల్సిన పెండింగ్ డీఏలను కూడా విడుదల చేయడం లేదు. ఆర్థికపరమైన హామీలను పక్కన పెడితే, కనీసం సాధారణ హామీలను కూడా నెరవేర్చడం లేదు.
ఉద్యమకారుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ వర్గాన్ని కూడా నిండా ముంచింది. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇవ్వడంతో వారు కూడా ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, ఆర్థికపరమైన సాయం చేస్తామని హస్తం నాయకులు హామీ ఇవ్వగా, వాటిలో ఏ ఒక్కటీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వర్గాలు కాంగ్రెస్ హామీలకు బలయ్యాయి.
నమ్మి ఓట్లు వేసిన వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమకు ఓట్లేయని వర్గాలను, ప్రాంతాలను విడిచిపెడుతుందా? నమ్మిన వర్గాలను ఒకే విధంగా మోసం చేస్తే.. నమ్మని వర్గాలు, ప్రాంతాలకు అసలు భవిష్యత్తే లేకుండా చేస్తున్నది. హైదరాబాద్‌లో జరుగుతున్న విధ్వంసమే అందుకు చక్కని ఉదాహరణ.