అధికారం కోసం అందమైన అబద్ధ్దాలు, ఆకట్టుకునే మాటలు చెప్పి… గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచిపోతున్నాయి జాతీయ పార్టీలు. ప్రధానంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం చెప్పిన అందమైన అబద్ధానికి పదేండ్లు కావస్తున్నది. తాము అధికారంలోకి వస్తే … కేవలం వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పిన మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగ, ఇతర ఉపకులాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడ్డది.
న్యాయమైన ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా శాంతియుత పోరాటాలు చేస్తున్నప్పటికీ… కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పార్లమెంటులో ఈ బిల్లు పెట్టక పోవడమంటేనే వారిని సామాజిక అణచివేతకు గురి చేసినట్టే. మోదీ తాను, కేంద్ర ప్రభుత్వం అనుకున్న అనేక బిల్లులను పార్లమెంటులో పెట్టి చట్టబద్ధత కల్పించారు. అందులో కొన్ని బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకించినా వినలేదు. అటువంటప్పుడు అట్టడుగు వర్గంలో ఉండి అసమానతలకు గురవుతున్న ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏబీసీడీలుగా విభజించాలని అనేక కమిటీలు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టడం సమంజసం కాదు. మెజారిటీ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ…మోదీప్రభుత్వం మాత్రం కనీసం స్పం దించకపోవడం విచారించదగ్గ విషయం.
సామాజిక సమానత్వం కోసం సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు… బలిదానాలు జరుగుతున్నప్పటికీ కేంద్రంలో ఏ సర్కారు వచ్చినా మాదిగల పట్ల సరైన వైఖరిని మాత్రం అవలంబించలేకపోతు న్నాయి. ఎస్సీల్లో ఉన్న అసమానతలకు తోడు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలకు విద్య, ఉద్యో గ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన నష్టం జరుగుతున్నది. వర్గీకరణపై గతంలో వేసిన పలు కమిషన్లు సైతం ఎస్సీ వర్గీకరణ న్యాయమైన అంశమని, దానికి చట్టబద్ధత కల్పించాలని సూచించాయి. అయినప్పటికీ కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు మాదిగల పట్ల ప్రతిసారి తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. రామచంద్రరాజు కమిషన్ నుంచి జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ వరకు ఎస్సీల్లో దిగువస్థాయి వారికి సైతం రా జ్యాంగ ఫలాలు అందాలంటే వర్గీకరణ తప్పనిసరి అని తేల్చాయి. అయినప్పటికీ గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా…మాదిగలను పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం.
కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని కేంద్ర బీజేపీ సర్కారు 2014 ఎన్నికల్లో ప్రకటించింది. పది సంవత్సరాలు గడుస్తున్నా మాదిగల న్యాయమైన ఆకాంక్షకు చట్టబద్ధత తేవడంలో తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్నది. ఈ పదేండ్లలో అత్యంత సున్నితమైన అనేక రకాల అంశాలపై కేంద్ర బీజేపీ సర్కారు పార్లమెంటులో బిల్లులు పెట్టి పరిష్కరించింది. ఎవరూ డిమాండ్ చేయని అంశాలను కూడా కేంద్రం ఆమోదించింది. అటువంటప్పుడు సుదీర్ఘమైన పోరాటం…అనేక మం ది అమరత్వానికి కారణమైన మాదిగ వర్గీకరణ ఉద్యమం పట్ల మోదీకి ఎందుకింత వివక్ష? మా దిగలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకోవాలనుకుంటున్నది బీజేపీ.
మొదట్లో ఎస్సీ వర్గీకరణ రాష్ర్టాల పరిధిలో ఉన్నప్పుడు తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేండ్లకు పైగా వర్గీకరణ అమలైంది. తద్వారా జనా భా నిష్పత్తి ప్రకారం అనేకమందికి వివిధ రంగా ల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల అమలును రాష్ర్టాల పరిధి నుంచి పార్లమెంటు ద్వారా చట్టం చేయాలని…రాష్ర్టాలకు అధికారాలు లేకుండా చేసింది. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ సానుకూలంగా స్పందించటం, అధికారం చేపట్టిన తర్వాత మాత్రం దాటవేయటం పరిపాటయింది. ఇది మూడు దశాబ్దాలుగా మాదిగల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్నది. రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ర్టాల అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి ఆమోదం కోసం పంపింది. అయినప్పటికీ ఇప్పటికీ స్పంద న లేదు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన సామాజిక శక్తి కలిగిన వర్గం మాదిగ జాతి. తెలంగాణ లో మాదిగల జనాభా 12 శాతానికి చేరుకున్నది. ప్రస్తుతం ఎస్సీలకు 16 శాతం ఉమ్మడి రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా దళితులు 17.6 శాతం ఉన్నట్టు 2014 లెక్కల్లో తేలింది. ఇందులో మాదిగల నిష్పత్తి 12 శాతం. ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీల్లో ఉన్న సామాజిక అణచివేతలను దూరం చేయడానికి ఏబీసీడీలుగా విభజించి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి సమానంగా పంచాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే అత్యధిక జనాభా కలిగి మాదిగ జాతికి వివిధ రంగాల్లో అవకాశాలు లభించకపోవడం వల్ల వెనుకబాటుకు గురవుతున్నారు. దీని కోసం అవిరామంగా మాదిగలు శాంతియుతంగా నిరసనలు, పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం మాదిగల పట్ల చిత్తశుద్ధి చూపకపోగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది.
సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందాలనేది రాజ్యాంగ ఆకాంక్ష. అటువంటి సమానత్వం కోసమే వర్గీకరణ చేయాలని దశాబ్దాల పోరాటంలో అనేకమంది నేలరాలినా..సమాజంలో సమానత్వం కోసం పోరాటం మాత్రం ఆగడం లేదు. అందులో భాగంగా ప్రతిసారి పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం వల్ల మాదిగలు అంధకారంలోనే మిగిలిపోతున్నారు.
ప్రత్యేక సమావేశాలతో ఆర్భాటపు సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోకుండా… అర్థవంతమైన చర్చలు జరిగి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టి .. మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు సముచిత రిజర్వేషన్ను అమలు చేస్తున్నది.
రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ర్టాల అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి ఆమోదం కోసం పంపింది. అయినప్పటికీ ఇప్పటికీ స్పందన లేదు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన సామాజిక శక్తి కలిగిన వర్గం మాదిగ జాతి. తెలంగాణలో మాదిగల జనాభా 12 శాతానికి చేరుకున్నది. ప్రస్తుతం ఎస్సీలకు 16 శాతం ఉమ్మడి రిజర్వేషన్లు అమలవుతున్నాయి.