తొలి ఎన్నికల నాటి నుంచి సుమారు 30 ఏండ్ల దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. పల్లెల్లో రాజరికం నడిపినవాళ్లే కాంగ్రెస్‌లో చేరి తమ పెత్తనాన్ని యథావిధిగా కాపాడుకున్నారు. ఆస్తులకు కొదవ లేని ఆ కుటుంబాలు రాజదండం తమ చేతిలో ఉందని తృప్తిపడ్డాయి. ఇప్పటిలా సాగు నష్టాలు, నిరుద్యోగం, వాటికి విరుగుడుగా సంక్షేమ పథకాలు లేనందువల్ల జనం ప్రభుత్వం వైపు ఆశగా, ఆసక్తిగా చూసేవారు కాదు. దాంతో నాయకులకు పార్టీ మారే అవసరమే పడలేదు.
కాంగ్రెస్ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతున్న కాలంలో 1980 దశకం ఆరంభంలో ఓ కుదుపు వచ్చింది. ‘రాష్ట్రంలో ఈ రాయలసీమ రెడ్ల పాలన ఎన్నాళ్లు?’ అనే ఆలోచన సీమాంధ్ర కమ్మవారికి కలిగింది. దీనికి సూత్రధారి ఈనాడు రామోజీరావు కాగా, పాత్రధారి నటుడు ఎన్టీ రామారావు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ప్రత్యేకిచి నాన్ రెడ్డి వర్గాలను ఎన్టీఆర్ ప్రోత్సహించి చేరదీశారు. దీంతో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ మార్పుతో క్యాడర్‌ను కోల్పోయిన కాంగ్రెస్ బలహీనపడింది.
కేసీఆర్ రూపంలో తెలుగునేలపై మరో ప్రభంజనం పుట్టింది. 2001లో ఆయన స్థాపించిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఏపీ రాజకీయాలను అతలాకుతలం చేసింది. 45 ఏండ్ల పాటు పెత్తనం చెలాయించిన ఆంధ్రులు కేసీఆర్ డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ను పురిటిలోనే చంపేందుకు వైఎస్ఆర్ కుట్రలు చేశారు. క్రమంగా కేసీఆర్‌కు పెరుగుతున్న ప్రజల మద్దతు చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. తెలంగాణ సాధన కోసం లక్షలాది మంది యువకులు కేసీఆర్ వెంట నడిచారు. ఈ రూపంలో తెలంగాణలోని అన్ని వర్గాలు కొత్తగా రాజకీయాలకు చేరువయ్యాయి. వారిలో చాలామంది స్వరాష్ట్రంలో పదవులను చేపట్టారు.
ఎన్టీఆర్, కేసీఆర్ పార్టీలను స్థాపించడం, అవి విజయవంతమవడంతో కాంగ్రెస్‌లోని పెద్దపెద్ద నాయకులు, చిన్నాచితక నేతలు ఆ పార్టీల్లో చేరిపోయారు. తెలంగాణలో కేసీఆర్ పాలన మొదలయ్యాక 2014లో మరో భారీ కుదుపు తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యమైపోయింది. తెలంగాణలో ఆ పార్టీ మళ్లీ బతికి బట్టకట్టదని స్థానికంగా బలమైనవారు బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ గద్దె దిగడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ అభద్రతాభావం ఏర్పడింది. వారు కూడా బీఆర్ఎస్ను నమ్ముకున్నారు. కొత్త రాష్ట్రంలో జరిగిన ఈ మార్పులను స్వీయపాలనలో అనివార్య రాజకీయ సమీకరణంగానే భావించాలి.
తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడేవారంతా ఒక్కతాటిపైకి రాక తప్పని అవసరమది. ఒకసారి నేతల కోణంలోంచి చూస్తే.. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతి వ్యాపించింది. గత 40 ఏండ్లుగా రాజకీయాల్లోకి వచ్చినవారికి పార్టీ సెంటిమెంట్ లేదనే చెప్పాలి. ప్రజాప్రతినిధులుగా గెలిచినప్పటికీ తమ పార్టీ అధికారానికి దూరమైనవాళ్లలో ఐదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండే ఓపిక కొరవడుతోంది. ‘కోట్లు కుమ్మరించి గెలిచిందే అధికారం కోసం కదా!’ అనే కాంక్ష వారిని నిద్రపోనీయడం లేదు. తాము గెలిచిన చోట తమపైనే ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థులు అధికారుల వద్ద గౌరవం పొందడం, ఆఫీసుల్లో పనులు చకచకా చేసుకోవడం జీర్ణించుకోలేని పరిస్థితి. ‘గెలిచి ఎదురీదే ఖర్మ నాకెందుకు’ అనే చికాకు వారిని నిలవనీయడం లేదు. ‘పార్టీ గీర్టీ జాన్ తే నై.. చలో జంప్ జలానీ’ అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ అనిశ్చితిలో ‘నేను పార్టీ మార ను’ అన్న మర్నాడే కండువా మార్చేస్తున్నారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారెవరూ తమ పదవులకు రాజీనామా చేయలేదు. వారిలో ఒకరు కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా.
కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం పదవులిచ్చిన పార్టీకి ఒకరు తీరని ద్రోహం చేశారు. రెండోసారి గెలిచిన ఓ యువ ఎమ్మెల్యే గురువుకే పంగనామాలు పెట్టడం దారుణం. వయసు మీద పడిన పెద్దలు పార్టీ మారి వారి చరిత్రకే మచ్చ తెచ్చుకున్నారు. 81 ఏండ్ల పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరినప్పుడు ‘సచ్చే ముందు ఏం రోగమొచ్చిందని పార్టీ మారిండు’ అని తిట్టిన రేవంత్ రెడ్డి.. 85 ఏండ్లున్న కె.కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డిలను కాంగ్రెస్‌లో చేర్చుకొని ప్రభుత్వ పదవులు కట్టబెట్టారు. వారి ఖర్చంతా ఖజానాకు దండగే. ఈ వ్యవహారంలో తప్పు చేర్చుకొనే పార్టీదా.. చేరే ప్రజాప్రతినిధిదా? అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. ఫిరాయింపు వల్ల పరిణామాలు రకరకాలుగా ఉంటాయి. ఇలాంటి ఫిరాయింపులను నిరోధించేందుకు 1985లోనే చట్టం వచ్చింది. పార్టీ నియమాలను, ఆదేశాలను ఉల్లంఘించినట్లు సాక్ష్యాలుంటే స్పీకర్ వారి సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. పార్టీ మారే ఎమ్మెల్యేల సంఖ్య 2/3 దాటితే ఈ చట్టం వారికి వర్తించదు. 2016లో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్లో చేరడం ఈ రకంగా చట్టబద్ధమైనదే.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు గులాజీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో వారు కోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం ఓ శుభపరిణామం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 8న స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేకపోతే సుమోటోగా ఈ కేసును విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫిరాయింపు చట్టం ప్రకారం వారు ఎమ్మెల్యేలుగా కొనసాగలేరు. న్యాయం నిలబడి ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఓటర్లు వారికి తగిన బుద్ధి చెప్తరు.
– నర్సన్ బద్రి 94401 28169