ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ తెలంగాణ అస్తిత్వ పోరాటం మళ్లీ మొదటికే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన వెంటనే తెలంగాణ అస్తిత్వ ప్రతీకలపై దాడి మొదలైంది. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ చిహ్నాలపై విషం చిమ్మడం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కాకతీయ కళాతోరణం కళాత్మకతను కప్పిపెట్టే ప్రయత్నం జరిగింది. ఆరోగ్య, సౌభాగ్య హైదరాబాద్‌ను కాంక్షిస్తూ నిచిన ఆధునిక మానవ జీవనాభివృద్ధి, నగర నిర్మాణస్ఫూర్తి చిహ్నం చార్మినార్ రాచరికపు చిహ్నం స్థాయికి పడిపోయి అవమానపడింది.
అవమానాల వరుసలో ఇప్పుడు తెలంగాణ తల్లి వంతు వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రత్యామ్నాయ అస్తిత్వ ప్రతీకలను ముందుపెట్టుకొని సాగింది. తెలంగాణకున్న ప్రత్యామ్నాయ సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పునర్నిర్వచించుకున్నది. ఆ సాంస్కృతిక పునర్నిర్మాణ పరంపరలో తెలంగాణ తల్లి ఆవిర్భవించింది. ఉమ్మడి ఏపీలో తెలుగు తల్లికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నారు. ఊరూరా, వాడవాడలా తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. 2003లో మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నప్పటి నుంచి ఇక్కడి ప్రజల ఆకాంక్ష అంతా స్వరాష్ట్ర సాధన చుట్టే తిరిగింది.
సచివాలయంలో తెలంగాణ వాళ్లుండాలి, సచివాలయం తెలంగాణ తల్లిని గౌరవించాలి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు నిలబెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు సంతోషించారు. మన స్వీయ అస్తిత్వానికి, స్వయంపాలనకు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని సంతోషించారు, ఆహ్వానించారు. కానీ, ప్రభుత్వం మారగానే తెలంగాణ అస్తిత్వంపై దాడి మళ్లీ మొదలైంది. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించే పనిలోపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పరిపాలన చేయాలి. కానీ, అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
తెలంగాణ తల్లికి రాజీవ్‌గాంధీ ప్రత్యామ్నాయం కాగలరని కాంగ్రెస్ వారు భావిస్తున్నారా? అయితే, భరతమాతకు బదులుగా వేరే రాజకీయ నాయకులను ప్రత్యామ్నాయంగా చూపే సాహసం చేస్తారా? గతంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్రదేశాన్ని రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడానికి ఎంపిక చేయడంతో ఈ ప్రభుత్వ దుర్బుద్ధి బహిర్గతమైంది. తెలంగాణ అస్తిత్వంతో ఈ ప్రభుత్వం పనిచేయడం లేదని అర్థమవుతున్నది.
తెలంగాణపైనే ఎందుకింత కక్ష? కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ర్టాల్లో వారి స్థానిక అస్తిత్వాలను వదులుకుంటున్నారా? మన రాష్ట్రంలోనే ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఈ రాజకీయ నాయకత్వం వెనుక ఆంధ్రా నాయకత్వ లాబీ పనిచేస్తున్నదనటంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకత్వం రూపంలో తెలంగాణతనం సారంలో ఆంధ్రా తత్వం కురిపిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్న ప్రదేశంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకోవడం గర్హనీయం.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలతో రాజకీయం చేయాలని చూసిన ఆంధ్రా నాయకత్వాన్ని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మన ప్రాంత రాజకీయ నాయకులు మన అస్తిత్వాలను, మన సోయిని కలిగి లేరు. తెలంగాణ ప్రజల కరుణతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మరెవరికో ఊడిగం చేయడానికి తెలంగాణ తల్లిని అవమానించాలని చూస్తున్నారు. తమకు అధికారాన్ని అప్పగించిన ప్రజల ఆకాంక్షలు చూసేవారు ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటాన్ని మననం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.
సంచలనాల కోసం, వివాదాల కోసం ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వంతో ఆడుకునే ప్రయత్నం చేయకూడదు. మాట, యాసలోనే తెలంగాణ, ఆలోచనలన్నీ ఆంధ్రాలో అన్నట్టున్నది పరిస్థితి. విశ్వనగరంలా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరాన్ని చూసి ఇతర ప్రాంతాలవారు ఇలాంటి నగరాన్ని నిర్మించుకోవాలని ఆశపడుతుంటే, ఇక్కడ అమరావతి లాంటి నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించడం ద్వారా వారి మెదడు ఆలోచనలు ఎవరి స్వాధీనంలో, ఆధీనంలో ఉన్నాయో అర్థం అవుతున్నది.
తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందింది. అందుకే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సినచోట రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం ద్వారా అధిష్ఠానం మెప్పు పొందుతారేమో.. కానీ, ప్రజల్లో ఉన్న పతారా మాత్రం పోగొట్టుకోవడం ఖాయం. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేచోట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడతామని.. ఎవరినీ సంప్రదించకుండా, ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఇది తెలంగాణ తల్లిని అవమానించడమే.
ఇది ఇక్కడితో ఆగిపోదు. ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను దెబ్బతీస్తే.. స్వీయ అస్తిత్వ ఆకాంక్షల పరిరక్షణకు ప్రజల ప్రతిస్పందనను ముందే ఊహించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యమ సమయంలో ప్రజలు తమ నేమ్ ప్లేట్ల మీద, వెహికల్ నంబర్ ప్లేట్ల మీద స్వచ్ఛందంగా ‘టీజీ’ అని రాసుకొని ఏపీ ఆనవాళ్లను చెరిపేసిన ఘటనలు ఈ ప్రభుత్వంలో ఉన్నవారికి ఇంకా గుర్తుండే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోకి తెలంగాణ ప్రజలను నెట్టే కార్యక్రమాలేవీ చేయకపోవడం మంచిది.
సంఖ్యా బలం ఉన్నదని అస్తిత్వాలను కూలగొడదామంటే కుదరదు. సంఖ్యాబలాలు శాశ్వతం కావు. అవి ఐదేండ్లకోసారి మారేవే. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏం చేసినా సంఖ్యా బలాలు తారుమారైపోతాయి. నా తెలంగాణ తల్లి పుణ్య కంజాతవల్లి. తెలంగాణ అస్తిత్వం ముందు ఏదీ నిలబడదు. తెలంగాణ తల్లికి మరో ప్రత్యామ్నాయం లేదు.
(వ్యాసకర్త:రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి)
– ఎర్రోజు శ్రీనివాస్
97003 02973