తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్’ అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతున్నది. నిజానికి చాన్సులు, గ్యారంటీల సమయం ఎప్పుడో గడిచిపోయింది. ఆదర్శాలు అటకెక్కించి కేవలం అధికార లాలసతో గుమిగూడిన నాయకుల మందగా ఆ పార్టీ మిగిలిపోయింది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ మీదున్న వ్యతిరేకత పుణ్యమాని గెలిచింది. బీజేపీ మతోన్మాద విధానాలు, అలవిమాలిన అవినీతితో విసిగిపోయిన కన్నడిగులు కాంగ్రెస్‌కు ఓటేశారు. తమ పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్టయిందని వారు తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు. తాజాగా సీఎం సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధికార పోరు హద్దుల మీరి క్యాంపు రాజకీయాలకు తెరతీయడం గమనార్హం.
అక్కడ పరిస్థితి అలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముక్కు చూడు ముక్కందం చూడన్నట్టుగా మురిపాలు పోతున్నారు. కర్ణాటకలో ఏదో ఊడబొడిచినట్టు మాట్లాడుతున్నారు. అక్కడి అభివృద్ధిని చూస్తామంటే బస్సులు వేస్తామని సవాళ్లు విసురుతున్నారు. కర్ణాటకలో తాజా పరిణామాలతో కాంగ్రెస్ డొల్లతనం బయటపడింది. కుర్చీలాటతో, సిగపట్లతో పరువు బజారుకెక్కింది. బుజ్జగింపులు, బెదిరింపులు నడుస్తున్నాయి. ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కలిగిన పార్టీలో ఏదైనా జరగొచ్చునని చెప్పుకొంటున్నారు కన్నడిగులు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అనాదిగా జరిగే తంతు ఇదే. సీట్ల కేటాయింపు దగ్గరి నుంచి సీఎం ఎంపిక దాకా అంతా కుమ్ములాటలమయమే. ముఠా తగాదాలతో కాలం వెళ్లదీయడమే వారు చేసే పని. ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఐదేండ్లూ పదవీకాలం పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు. సీఎంలను గద్దె దింపేందుకు అల్లర్లు సృష్టించిన హీనచరిత్ర కాంగ్రెస్‌ది.
సీఎం కేసీఆర్ తరచుగా మాకు ఢిల్లీలో హైకమాండ్ లేదు, తెలంగాణ ప్రజలే మా హైకమాండ్ అంటుంటారు. మోసపోతే గోసపడుతమని ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్టే అని తెలంగాణ ప్రజలకు తెలుసు. వారు టక్కరి మాటలకు పడిపోయేంత అమాయకులు కారని గత రెండు ఎన్నికల్లో రుజువైంది. ముచ్చటగా మూడోసారి ఓటు పోటుతో తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలంటూ ఆశజూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు, మూడు నెలల్లోనే వాటిని అమలుచేయలేక చతికిలపడింది. నిజానికి కర్ణాటకలో గాలివాటంగా గెలిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుచేయడమే పెద్ద చిక్కు సమస్యగా మారింది ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్ఠానానికి. సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాలు సీఎం సీటు తమకే కావాలని పట్టుబట్టడమే అందుకు కారణం. నంబర్ వన్, నంబర్ టూ అంటూ సర్దుబాటు చేసి, కీలక శాఖలను చెరి సగం పంపకాలు చేస్తే గానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. అధికార పీఠం కోసం ముఠాలు కుమ్ములాడుకుంటున్నాయి.