దేశంలో సంపద పెరుగుతున్నది. కానీ, పంపిణీ సమతూకంగా జరగడం లేదు. దాని ఫలితంగా ధనవంతులు కుబేరులవుతుంటే పేదలు నిరుపేదలై నలుగుతున్నారు. సంపన్నుల మేడల నీడల్లో ఆకలి కేకలు పోటెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటిన తర్వాత ఇదీ వాస్తవిక పరిస్థితి. ప్రపంచబ్యాంకు 2024 సంవత్సరపు భౌగోళిక ఆకలి సూచీలో దీన్నే ఎత్తిచూపింది. ఈ సూచీలో 127 దేశాలుంటే అందులో భారత్ స్థానం 105గా నమోదైంది. సూచీ విశ్లేషణలో భారత్‌ను ‘తీవ్రమైన’ క్యాటగిరీలో చేర్చడం గమనార్హం. ఈ క్యాటగిరీలో భారత్ పాటు పాక్, అఫ్ఘాన్ ఉన్నాయి. కాగా దక్షిణాసియా ఇరుగుపొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఓ మోస్తరు క్యాటగిరీలో ఉండటం విశేషం. పోషకాహార లోపం, శిశు మరణాల రేటు వంటి అంశాల ఆధారంగా రూపొందించే ఈ నివేదికలో ఇండియా 27 శాతం స్కోరు చేసింది.
ఒక అంచనా ప్రకారం భారతదేశంలోని గృహోపయోగ ఆహారంలో ఏడాదిలో 68.7 మిలియన్ టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దాని విలువ రూ.50 వేల కోట్ల పైచిలుకే. ఈ విషయంలో మన దేశం ప్రపంచంలో రెండో స్థానం ఆక్రమిస్తున్నది. కానీ, ఆకలి సూచీ ప్రకారం భారత్ జనాభాలో 13.7 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతుండటం వింతల్లోకెల్లా వింతే మరి. అంతకన్నా ఘోరమైన విషయం ఏమంటే 35.5 శాతం ఐదేండ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం వల్ల ఎదుగుదల దెబ్బతింటున్నది. ఇంకా వారిలో 18.7 శాతం మందిలో ఎదుగుదల స్థగితం అవుతున్నది. 2.9 శాతం మంది పిల్లలు ఐదేండ్ల లోపు ఆకలి సమస్యల వల్ల మృత్యువు పాలవుతుండటం అత్యంత బాధాకరం. ఆహార హక్కు అని ప్రపంచదేశాలు ఊదరగొడుతున్నా అమలవుతున్నది అరకొర మాత్రమే.
ఈ పరిస్థితుల్లో 2030 నాటికి విశ్వవ్యాప్తంగా సున్నా ఆకలి సూచీని సాధించాలన్న ఐరాస లక్ష్యం సాధ్యం కాదని ప్రపంచబ్యాంకు విశ్లేషణ నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగించే అంశమే. వ్యవసాయ ఉత్పత్తి అంతకంతకు పెరుగుతున్న ఇండియాలో ఆకలి మంటలు ఎందుకో ఆలోచించాల్సిన ప్రభుత్వం మొత్తంగా ఆకలి సూచీ నే తప్పు పడుతున్నది. దాని వెనుక గల కొలమానాలలో లోపాలు వెదుకుతున్నది. పోయిన ఏడాది భారత్‌కు 111వ ర్యాంకు ఇచ్చిన సూచీని ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా, అది భారత వాస్తవ స్థితిని తెలియజేయడం లేదని కొట్టిపారేయడం తెలిసిందే.
భారతదేశంలో పైపైన సంపద పొంగులు కనిపిస్తున్నా భారతీయుల తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతుకు దిగువనే ఉండిపోయింది. మరోవైపు ఆహార ధరలు 2022 నుంచి 2024 నాటికి 3.8 శాతం నుంచి 7.5 శాతానికి రెట్టింపైంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది పంటలు గరిష్ఠ స్థాయిలో పండాయి. అయినా ఆకలి ఎందుకు పెరుగుతున్నదో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. భారతదేశంలో ఆహారభద్రత, ఆరోగ్య సంరక్షణ సరైన రీతిలో సాగడం లేదని ఈ గణాంకాలు వేలెత్తి చూపిస్తున్నాయి. అద్దాన్ని నిందిస్తే లాభం లేదు. రోగం ఎక్కడుందో తెలుసుకుని మందు వేయాలి. ఉచిత రేషన్ ధాన్యం పంపిణీ గడువు పెంచుకుంటూ పోవడం కాదు, ప్రజల వాస్తవ ఆదాయం పెరగడం ఎలా అనేదాని మీద దృష్టిపెడితే గానీ ఆకలి సమస్య అంతం కాదని చెప్పక తప్పదు.