‘నీవు మాట్లాడే విషయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, నీ మాట్లాడే హక్కు కోసం నా ప్రాణమిచ్చి పోరాడుతా’ అన్నాడు ప్రముఖ తత్వవేత్త, స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రబోధకుడు వాల్టేర్. నేటి ఆధునిక రాజ్యాల పాలనకైనా, పౌరుల మధ్య సంబంధాలకైనా ఈ ప్రజాస్వామిక సూత్రమే పునాది. కానీ, ప్రధాని మోదీ పాలన మొదలైన నాటినుంచి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లడం మామూలైపోయింది. బీబీసీ కార్యాలయాలపై ఐటీ సర్వేల పేర వేధింపులకు దిగటం తాజా ఉదాహరణ. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగిన దుర్ఘటనలపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన కొన్ని వారాల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ డాక్యుమెంటరీ దేశ సార్వభౌమత్వానికే భంగకరంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించింది. కానీ ప్రజలు చూడకుండా కట్టడి చేయడంలో విఫలమైంది. విమర్శలను స్వీకరించలేని బలహీనతతో, అసహనంతో కేంద్రం బీబీసీ కార్యాలయాలపై దాడులకు దిగిందనేది స్పష్టం.
మోదీ పాలనలో మీడియాపై వేధింపులు తీవ్ర స్థాయిలో సాగడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులను కలచివేస్తున్నది. ప్రభుత్వ విధానాలను విమర్శించే పాత్రికేయులపై, మీడియా సంస్థలపై నిఘా వేయడం, ప్రభుత్వ ఏజెన్సీలతో దాడులు చేయించడం దేశవ్యాప్తంగా సాగుతున్నది. పాత్రికేయులపై మూకదాడులను చేయించడం, కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యమైంది. జాతీయ భద్రత పేర సోషల్మీడియా ఇంటర్మీడియరీస్ను వేధించడం, టీవీ కేంద్రాలను నిషేధించడం, ఇంటర్నెట్ను బ్లాక్ చేయడం, హక్కులను హరించే కొత్త చట్టాలను తేవడం మొదలైన విధానాల ద్వారా మోదీ ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని కాలరాస్తున్నది. ఎడిటర్స్ గిల్డ్ ఈ నిరంకుశ పోకడను తప్పు పట్టింది. ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ నివేదిక ప్రకారం- పత్రికా స్వాతంత్య్రంలో మన దేశం 150 స్థానంలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన 30 దేశాల్లో ఒకటిగా భారత్ నిలబడటం సిగ్గుపడాల్సిన విషయం.
మూడవ ప్రపంచ దేశాలు మత కలహాలతో, సైనిక పాలనలతో అట్టుడికిపోతున్న దశలో మన ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు. బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలకు సాటిగా భారత ప్రజాస్వామ్యం వృద్ధి చెందిందనే అభిప్రాయం ఇతర దేశాల్లో ఉండేది. కానీ మోదీ పాలన మూలంగా అంతర్జాతీయంగా ఇంతకాలం సాధించిన ప్రతిష్ఠ మంటగలిసి పోతున్నది. ఒక్క పత్రికా స్వేచ్ఛనే కాదు, ఏ వర్గమూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఇతర పార్టీలు పాలించే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కూలదోస్తున్నది. దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నది. తమకు గిట్టని వ్యాపారసంస్థలపై కూడా దాడులు సాగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కవులు, కళాకారులు మొదలుకొని చైతన్యవంతమైన వర్గాలన్నీ మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అన్నివర్గాలు ఏకతాటిపై నిలిచి ఈ అప్రకటిత ఎమర్జెన్సీని తిప్పికొట్టాలి. మోదీ పరివారాన్ని గద్దె దింపితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని గ్రహించాలి.