విదేశీగడ్డపై అనధికారికంగా చేపట్టే హత్యలు, దాడులను కోవర్టు ఆపరేషన్లు అంటారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు ఈ తరహా ఆపరేషన్లు జరిపిన చరిత్ర ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ విషయంలో మరీ దుందుడుకుగా పోతాయి. అవి విదేశాల్లో జరిపిన కోవర్టు ఆపరేషన్ల గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. ఆ కథల ఆధారంగా అనేక జనరంజక చిత్రాలూ వచ్చాయి. ఆయా దేశాలు ఆ ఆపరేషన్ల గురించి మొదట్లో ఖండించినప్పటికీ ఏతావాతా అంగీకరించడం తెలిసిందే. పాలస్తీనా తీవ్రవాదులు ఇజ్రాయెలీ పౌరుల విమానాన్ని హైజాక్ చేసి ఉగాండాకు తరలించడం, ఇజ్రాయెలీ కమాండోలు విమానంలో వెళ్లి హైజాకర్లను తుదముట్టించి బందీలను విడిపించుకు రావడం ఓ వీరోచిత గాథగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఉదంతం ఉగాండా విమానాశ్రయం పేరు మీద ‘ఎంటెబీ ఆపరేషన్’గా ప్రసిద్ధి పొందింది. ఈ ఆపరేషన్ సందర్భంగా అమరుడైన యోనాతన్ నెతన్యాహూ తమ్ముడే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ. ‘ఎంటెబీ’పై పలు సినిమాలూ వచ్చాయి. తాజాగా ఇండియాపై ఈ తరహా కోవర్టు ఆపరేషన్లకు సంబంధించిన ఆరోపణలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. అంతర్జాతీయంగానూ పన్నూ హత్య కుట్ర సంచలనం కలిగిస్తున్నది.
మన దేశంలోనూ దీనిపై చర్చ జరుగుతుండటం గమనార్హం. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణం. కెనడాలో హర్దీప్సింగ్ నిజ్జర్ అనే ఖలిస్థాన్ వేర్పాటువాది హత్య మొదటిది కాగా, అమెరికాలో మరో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకుట్ర రెండోది. నిజ్జర్‌ను చంపించింది భారతీయ అధికారులేనని కెనడా ఆరోపించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంకటం ఎదురైంది. రెండోదైన పన్నూ హత్యకుట్ర వెనుక భారత దౌత్యాధికారులున్నారని అమెరికా అంటున్నది. పన్నూను హత్య చేసేందుకు హిట్‌మ్యాన్‌కు ఓ భారత సంతతి వ్యక్తి సుపారీ ఇచ్చేందుకు ప్రయత్నించడంతో వ్యవహారం బయటకు వచ్చింది. హిట్‌మ్యాన్‌గా నటించిన అమెరికా ఏజెంటు గుట్టును రట్టు చేశాడు. ఈ కుట్ర వ్యవహారం ఓ భారతీయ దౌత్యాధికారి కనుసన్నల్లోనే జరిగిందని అమెరికా ఆరోపిస్తున్నది. ఇదీ ఓ సినిమా కథలాగే ఉత్కంఠభరితంగా ఉన్నదనడంలో సందేహం లేదు. ఆ సంగతి అలా ఉంచితే, పన్నూ అమెరికా పౌరుడు కావడం ఇక్కడ అసలు సమస్య అయింది. తమ గడ్డ మీద, తమ పౌరుడి హత్యకు భారత అధికారి కుట్ర పన్నారనేది అమెరికా ఆరోపణ. దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా రాజకీయ, న్యాయపరమైన ఒత్తిళ్లు వస్తున్నాయి.
బైడెన్ ఆదేశాల మేరకు అక్కడి గూఢచార సంస్థ సీఐఏ అధిపతి విలియం బర్న్స్ గత ఆగస్టులో భారత్‌లో పర్యటించి పన్నూ కేసుపై వాకబు చేసి వెళ్లారు. సెప్టెంబర్‌లో జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతోనూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. నవంబర్‌లో అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ పర్యటన సందర్భంగానూ ఇది ప్రస్తావనకు వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఇటీవల నేరుగానే హెచ్చరిస్తుండటం చర్చాంశమైంది. అమెరికా ఆరోపణలపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ స్పందిస్తూ.. కెనడా, అమెరికా అంశాలు రెండూ ఒకటి కాదని అన్నారు. భారత్ బాధ్యతాయుతమైన దేశమని, ఎలాంటి దర్యాప్తుకైనా సహకరిస్తుందని దౌత్యపరిభాషలో వివరించారు. మిగతా దేశాల్లాగా కోవర్టు ఆపరేషన్లు జరపడం భారత్ ప్రకటిత విధానం కాదు. కానీ అమెరికా, కెనడా వివాదాల కారణంగా భారత్ వైఖరిలో ఇటీవలి కాలంలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే సందేహాలు వ్యక్తం అవుతుండటం సహజమే.