రాష్ట్రంలో ఎన్నికల హంగామా ముగిసిపోయింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. ఆ తీర్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనేది మాత్రం తెలియదు. అయినప్పటికీ ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. మూడుపార్టీలూ తమదే పైచేయి అన్నట్టుగా చెప్పుకొంటున్నాయి. రెండంకెలకు ఎవరూ తగ్గకపోవడం విశేషం. నియోజకవర్గాల వారీగా కూడికలు, తీసివేతలతో లెక్కలు వేసుకొని పార్టీలు తమ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి మధ్య ఈ తరహా ఆత్రుత, ఆశావహ ధోరణి సాధారణమే.
ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల హవా ఖాయమని బీఆర్ఎస్ నాయకత్వం బల్లగుద్ది మరీ చెప్తున్నది. జాతీయపార్టీలు చతికిలబడటం ఖాయమని, అప్పుడు తెలంగాణతో సహా పలు రాష్ర్టాల్లో ప్రజల మద్దతు భారీగా కలిగిన ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పుతాయని అంటున్నది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత వ్యక్తమవుతున్నదనే ప్రచారం మెల్లగా ఊపందుకుంటున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో మళ్లీ సంకీర్ణాల యుగం వస్తుందనే భావన ఆ పార్టీ మాటల్లో తొంగిచూస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కాంగ్రెస్‌కు, ఓడిన పార్టీ బీఆర్ఎస్కు మధ్య ఓట్లలో తేడా రెండు శాతం లోపు మాత్రమే కావడం వారి ఆత్మవిశ్వాసానికి ఒక కారణం. ఆ ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఓటర్లు బీఆర్ఎస్కు భారీగా మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు కొద్దిగా తగ్గాయి. ఈసారి గ్రామీణ ఓటర్లు కూడా కాంగ్రెస్ హామీలు అమలు కాకపోవడంపై అసంతృప్తితో బీఆర్ఎస్ వైపు మొగ్గారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రచారాన్ని కేసీఆర్ బస్సు యాత్ర మలుపు తిప్పిందని బీఆర్ఎస్ గట్టి నమ్మకం.
ఆ యాత్రతో సానుకూలత మరింత పెరిగిందనే అభిప్రాయమూ ఆ పార్టీలో వ్యక్తమవుతున్నది. గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, అదే తమకు విజయం సాధించిపెడుతుందని బీఆర్ఎస్ నమ్మకంగా ఉన్నది. అదేవిధంగా ఈ పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి నిధుల విషయంలో మొండిచెయ్యి చూపడం తమకు కలిసివచ్చే అంశమని ఆ పార్టీ భావిస్తున్నది.
రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో తమకు 12 నుంచి 14 స్థానాల వరకు వస్తాయని ధీమాగా చెప్తున్నది. కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీపడ్డాయనేది ఆ పార్టీ లెక్క. ఇక హమీలు, గ్యారెంటీలు పేరిట హంగామా చేసి స్వల్ప ఓట్ల తేడాతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మీద చాలా ఆశలే ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తమకు 13 సీట్లు వస్తాయంటూనే హీనపక్షం తొమ్మిది చోట్ల గెలవడం ఖాయమని అంటున్నారు. అటు బీజేపీ కూడా ‘మేమేం తక్కువ తిన్నామా’ అని అంటున్నది. గత ఎన్నికల్లో 4 సీట్లు గెల్చుకున్న ఆ పార్టీ ఈసారి 8 సీట్ల బోనస్ కలుపుకొని మొత్తం 12 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పుకొంటున్నది.
మొత్తం మీద మూడు పార్టీలది రెండంకెల విషయంలో ఒకటే ధోరణిగా కనిపిస్తున్నది. ఇందులో ఏ ఒక్క పార్టీ సీట్ల సంఖ్య పది దాటినా ఇతర పార్టీలకు అదేస్థాయి విజయం అసాధ్యమన్నది తెలిసిందే. ఎవరి అంచనాలు సరైనవన్నది తేలాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే.