పంజాబ్ పర్యటన సందర్భంగా వంతెనపై ప్రధాని వాహనశ్రేణి దాదాపు 20 నిమిషాలు ఆగిపోవడమనేది దిగ్భ్రాంతికరమే. అయితే ఇందుకు కారణమేమిటనేదే ఆసక్తిదాయకంగా మారింది. ‘ప్రాణాలతో బయటపడ్డాను. మీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పండి’ అని పంజాబ్ సీఎం మీద ప్రధాని మోదీ వ్యంగ్యబాణాలు విసిరారు. మరోవైపు ‘దేశ ప్రధానమంత్రి ప్రాణాలు రక్షించటానికి ఒక పంజాబీగా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధం. కానీ, ఇదంతా నాటకం. మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర’ అని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వ్యాఖ్యానించారు. ఈ ఇరువురి వ్యాఖ్యలు ప్రధాని కాన్వాయ్ వివాదం తాలూకు భిన్నపార్శాల్ని పట్టిచూపుతున్నాయి. ఇందులో రైతుల నిరసన ప్రధానాంశంగా మారడం కూడా గమనా ర్హం. అన్నిటికీ మించి పంజాబ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భమిది!
ప్రధాని సాధారణంగా వాయుమార్గంలో-హెలికాప్టర్ ద్వారా- సభాస్థలికి చేరుకుంటారు. కానీ వాతావరణం అనుకూలంగా లేనందువల్ల రోడ్డు మార్గంలో ప్రయాణించారని అంటున్నారు. నరేంద్ర మోదీ ప్రయాణమార్గం మారిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆలస్యంగా చేరిందనే వాదన వినిపిస్తున్నది. రైతుల నిరసన అవరోధంగా ఏమీ లేదని, ప్రధానమంత్రి కార్యక్రమం రద్దుకు అది కారణమే కాదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. మోదీ సభకు జనం తక్కువగా రావడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారనీ వారు వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇది తీవ్రమైన భద్రతాలోపమనీ, ఇందుకు బాధ్యత పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ వారు ఆరోపిస్తున్నారు. ఏదే మైనా ప్రధాని మోదీ భద్రత విషయం కూడా రాజకీయ అంశంగా మారడం ఆందోళనకరం.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రధాన రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనే అభిప్రాయం బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ నిరసనలో ఈ రెండు రాష్ర్టాల రైతులది ప్రధాన పాత్ర. ఇప్పటికీ రైతులు మోదీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహంగానే ఉన్నారు. రైతుల పట్ల ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి ఇటీవల మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించిన విషయాలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ‘రైతులేమైనా నా కోసం చనిపోతున్నారా?’ అని మోదీ తనతో వ్యాఖ్యానించినట్లుగా మాలిక్ మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెండింటికీ బాధ్యతాయుతంగా వ్యవహరించే స్వభావం లేకపోవడం గమనించాల్సిన అంశం. ప్రధాని భద్రత వంటి కీలకమైన అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఈ ఘటన వెనుక అసలు కారణాలేమిటనేది దర్యాప్తు చేయాలి. రాజకీయంగా చలిమంటలు కాచుకునే ప్రయత్నాలు చేయకుండా రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించాలి