ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో దేశానికి లౌకిక పౌరస్మృతి కావాలని ప్రకటించడం ఒక విరోధాభాసలా కనిపిస్తున్నది. ఎందుకంటే, మతపరమైన రాజకీయాలకు పెట్టింది పేరైన బీజేపీ నేతగా, హిందూత్వ అతివాదిగా పేరొందిన ప్రధాని లౌకికవాదం గురించి మాట్లాడటం విచిత్రమే మరి.
బీజేపీ ఇదివరకటి ఉమ్మడి పౌరస్మృతి నినాదానికి ఇది లౌకిక తొడుగు వేయడమే తప్ప మరొకటి కాదని భావించాలి. ఉమ్మడి పౌరస్మృతి విషయమై దేశంలో ఏకాభిప్రాయం లేకపోవడం, ముఖ్యంగా లౌకికవాదులంటూ బీజేపీ ఈసడించుకునే ప్రస్తుత ‘ప్రధాన మిత్రపక్షాలు’ దానికి అంగీకారం తెలపడం అసాధ్యం కావడం నేపథ్యంలో మోదీ ఈ కొత్త పదబంధాన్ని సృష్టించారు!
అందుకే ఉమ్మడి పౌరస్మృతి విధానానికి మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగానే ప్రధాని సరికొత్త రూపంలో ఆ నినాదాన్ని ప్రజల ముందు లేదా రాజకీయ పార్టీల ముందు ఉంచడానికి ప్రయత్నించారని భావించవచ్చు. ఎన్డీయే ప్రధాన మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పార్టీలు బీజేపీ మతపరమైన ఎజెండాకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపే అవకాశాలు అంతంతమాత్రమేననేది తెలిసిందే. ఇది పరస్పర అవసరాల ఆధారంగా ఏర్పడిన పొత్తు కావడమే అందుకు కారణం.
ప్రధాని చేసిన లౌకిక పౌరస్మృతి ప్రతిపాదనపై జేడీయూ, టీడీపీ స్పందనలు ఊహించిన విధంగానే ఉన్నాయి. 2017లో కేంద్రానికి నితీశ్‌కుమార్ రాసిన లేఖనే పౌరస్మృతిపై తమ ప్రవచిత విధానమని జేడీయూ అంటున్నది. విస్తృతస్థాయి సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన తర్వాతనే పౌరస్మృతి మార్పు గురించి నిర్ణయం జరగాలని ఆ లేఖలో నితీశ్ పేర్కొన్నారు. కాగా, ఇంకా ఈ అంశంపై సంప్రదింపులు జరగాల్సి ఉందని టీడీపీ స్పష్టం చేసింది.
ఉమ్మడి పౌరస్మృతి అయినా, లౌకిక పౌరస్మృతి అయినా ముందుగా విస్తృతస్థాయి సంప్రదింపులు జరగాలనేదే తమ అభిమతమని టీడీపీ అంటున్నది. కేంద్రం తెచ్చిన వివాదాస్పద వక్ఫ్ చట్టాన్ని టీడీపీ సమర్థించినప్పటికీ దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించాలని సూచించడం గమనార్హం. మైనారిటీల విషయంలో ఎన్డీయేలోని ప్రాంతీయ పార్టీల విధానం, బీజేపీ విధానం ఒకేవిధంగా లేదనడానికి ఇదే నిదర్శనం. ఈశాన్య ప్రాంతానికి చెందిన బీజేపీ మిత్రపక్షాలు కూడా ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకమనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి.
1996 నుంచి వరుసగా ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఉమ్మడి పౌరస్మృతి గురించి బీజేపీ ప్రస్తావిస్తూ వస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతిపై అన్ని పక్షాల, అదేవిధంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు 22వ లా కమిషన్ నిరుడు ఒక నోటిఫికేషన్ జారీచేసింది. అంతకుముందు వేసిన 21వ లా కమిషన్ 2018లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉమ్మడి పౌరస్కృతి అవసరం కాదు, వాంఛనీయమూ కాదని చెప్పడం విశేషం.
అయితే ప్రధాని మోదీ మాత్రం గత 75 ఏండ్లుగా దేశం మతపరమైన పౌరస్మృతి కిందే ఉన్నదని, ఇక ఇప్పుడు లౌకిక పౌరస్మృతి వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఎర్రకోట ప్రసంగంలో చెప్పడం గమనార్హం. రాజ్యాంగంలోని లౌకికవాద విలువల్ని కాపాడేందుకే ఉమ్మడి పౌరస్మృతి స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకువస్తున్నట్టు బీజేపీ నేతలు అంటున్నారు.
నిజానికి ఉమ్మడి పౌరస్మృతి బీజేపీ, సంఘ్ పరివార్ మూల సిద్ధాంతాల్లో ఒకటి. సొంత బలం లేక మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి రావడం వల్లే ప్రస్తుతం బీజేపీ భాష చాలా వరకు మారిందని అర్థమవుతున్నది. బీజేపీ మాట మారినట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ లోపల అసలు విషయం ఉమ్మడి పౌరస్మృతేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!