పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు పూర్తిగా భిన్న ధ్రువాల్లాంటివి. సాంస్కృతికంగా, సైద్ధాంతికంగా, రాజకీయపరంగా ఇరుదేశాలవి వేర్వేరు దారులు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించేందుకు కూడా పాక్ నిరాకరిస్తున్నది. ఇన్ని వైరుధ్యాల మధ్యన ఈ రెండు దేశాల మధ్య ఒక సారూప్యత ఉండటం వైచిత్రి. అదేమిటంటే.. ఇటీవల ఈ రెండు దేశాలు తమ యుద్ధాలను ముగించాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి తమ దేశాల తరఫున నామినేట్ చేయడం.
2025, మే నెలలో భారత్‌తో జరిగిన యుద్ధంలో కాల్పుల విరమణ తర్వాత పాకిస్థాన్ వెంటనే అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి పురస్కారానికి అధికారికంగా సిఫారసు చేసింది. దక్షిణాసియా దేశాల మధ్య అణుయుద్ధాన్ని దౌత్యపరమైన జోక్యం ద్వారా నివారించినందుకు గాను ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. ఆ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చారు. పాకిస్థాన్ మార్గంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు. అధికారిక నామినేషన్ లేఖతో ఇజ్రాయెల్ ప్రధాని జూలై 7న వైట్ హౌజ్‌ను సందర్శించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల భీకర యుద్ధానికి ముగింపు పలికినందుకు గాను ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తున్నట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ యుద్ధాల్లో మరోవైపు ఉన్న భారత్, ఇరాన్ దేశాలు అమెరికా మధ్యవర్తిత్వ పాత్రను ఎన్నడూ గుర్తించకపోవడం ఆసక్తికరం.
భారత్, పాకిస్థాన్ మే 10న కాల్పుల విరమణకు అంగీకరించాయి. వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించి కాల్పుల విరమణకు ఇరుదేశాలను ఒప్పించానన్న ట్రంప్ వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధ పరిస్థితుల గురించి మాత్రమే అమెరికా, భారత్ మధ్య చర్చ జరిగిందని, ఆ సంభాషణల్లో ఎక్కడా వాణిజ్యం గురించి ప్రస్తావన రాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ తరఫున అమెరికా యుద్ధం చేసింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై బాంబులు వేసింది. ఆ తర్వాత జూన్ 24న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. కానీ, ఇరాన్ ఆ ప్రకటనను ఖండించింది. అయితే, ఖతార్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు ఇరాన్ అధికారి ఒకరు తర్వాత ధ్రువీకరించారు. అయినప్పటికీ ఇటు పాక్, అటు ఇజ్రాయెల్ దేశాలు మాత్రం అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపాయి.
అయితే, ఇజ్రాయెల్, పాక్ మధ్య అంతర్జాతీయ రాజకీయాల్లో మొదటినుంచీ ఏకాభిప్రాయం లేదు. పాకిస్థాన్ పాస్‌పోర్టులు ఇజ్రాయెల్‌లో తప్ప అన్ని దేశాల్లో ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయని స్వయం గా పాక్ అధికారులు చెప్తుంటారు. ఐరాసలోనూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాక్ అనేకసార్లు ఓటు వేసింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలను పాకిస్థానీలు బహిరంగంగా విమర్శిస్తుంటారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాక్‌లో నిరసనలు జరగడం సర్వసాధారణం.
పాలస్తీనాలో యూదు రాజ్యం స్థాపన ఆలోచనను పాక్ తొలినుంచీ ఆమోదించలేదు. ఇజ్రాయెల్ ఏర్పాటు తీర్మానానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో పాక్ ఓటు వేసింది. కోల్డ్ వార్ సమయంలోనూ పాకిస్థాన్ పాశ్చాత్య దేశాల వైపు నిలబడింది. అరబ్ దేశాలతో బలమైన సంబంధాలను నెరపుతున్నది. అందుకు విరుద్ధంగా మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు శత్రుత్వం ఉంది. ఆ దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధాలూ చేసింది. అయితే, అమెరికా జోక్యంతో ఈ దేశాల్లో అనేకం ఇప్పుడు ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలను కలిగి ఉన్నాయి. అయితే, పాకిస్థాన్ మాత్రం ఇంకా చాలా దూరం పాటిస్తూనే ఉన్నది.
పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్ మొదటినుంచీ తమ ప్రత్యర్థిగా భావించలేదు. అయితే, 1980లలో పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమాలను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ నిరోధించేందుకు ప్రయత్నించినట్టు వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ విదేశాంగ విధానం పాకిస్థాన్‌పై పెద్దగా దృష్టి సారించడం లేదు. మరోవైపు, ఇజ్రాయెల్ విధానాలను పాకిస్థానీయులు విమర్శిస్తున్నారే తప్ప నాశనాన్ని మాత్రం కోరుకోవడం లేదు.
ఎడిటోరియల్ డెస్క్