రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు కావస్తున్నది. ఈ కాలంలోనే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వల్ల ఏమీ కాదని తేలిపోయింది. హామీలు, ఆపై గ్యారెంటీలు, అవీ చాలక డిక్లరేషన్లు, దేవుళ్లపై ఒట్లు.. అన్నీ తూచ్ అయ్యాయి. పంటలకు పెట్టుబడి సాయం పెంచుడు మాట దేవుడెరుగు పాతదిస్తే చాలనిపించారు. రుణమాఫీ దారుణ ప్రహసనంలా మారిపోయింది. యూరియా సరఫరా చేత కాదు. పింఛన్లు పెంచరు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించరు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించరు. ఆడపడుచులకు తులం బంగారం కలలో మాటయ్యింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాటగలిశాయి. ‘వీళ్లతో ఏమీ కాదు’ అని మోసపోయి గోస పడుతున్న ఓటర్లు ఎప్పుడో ఓ నిర్ధారణకు వచ్చారు. అతి వృద్ధ పార్టీని ఆరు నిలువుల లోతులో పాతేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీ అధినేతగా ప్రస్తుతం చలామణి అవుతున్న మల్లికార్జున ఖర్గేకు పాపం ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్టుంది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లా గెలుచుడు కల్ల అనే నిజాన్ని గ్రహించారు. ఆ సంగతినే ఆంతరంగికంగా ఆయన కుండబద్దలు కొట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా రేవంత్‌ను సీఎంగా పెట్టి తప్పు చేశామని ఆయన ఆవేదన వెళ్లగక్కడం గమనార్హం. ఖర్గేమాట ప్రతి తెలంగాణవాసి మదిలోని మాట.
కాంగ్రెస్‌తో ఏమీ కాదని అనడం కూడా ఒకరకంగా అర్ధసత్యమే అవుతుంది. వాళ్ల నుంచి కొన్ని పనులు అవుతాయి. కాంగ్రెస్ పాలకులు అప్పులు చేయగలుగుతారు, కానీ ఆస్తులు సృష్టించలేరు. సంక్షేమం గురించి కథలు చెప్పగలరు, కానీ సంపద పంచలేరు. పుట్టెడు మాటలు చెప్పగలరు, కానీ తట్టెడు పని చేత కాదు. కేసీఆర్‌ను తిట్టగలుగుతారు, కానీ ఆయనలా పరిపాలన చేయలేరు. హామీలు ఇవ్వగలుగుతారు, కానీ వాటిని అమలుచేయలేరు. అరచేతిలో స్వర్గం చూపించగలరు, కానీ అంగుళం అభివృద్ధిని సాధించలేరు. అందుకే ప్రజలకు కాంగ్రెస్ అంటే వెగటు పుట్టింది. వేటు వేసేందుకు అవకాశం కోసం చూస్తున్నారనే సత్యం జనాగ్రహం రూపంలో నిత్యం ఆవిష్కృతమవుతూనే ఉన్నది. దిక్కుమాలిన పాలనలో దిబ్బరాజ్యం అన్నట్టుగా తయారైంది తెలంగాణ పరిస్థితి. అందుకే ఊరూరూ ఓ రచ్చబండ అవుతున్నది. చివరికి సచివాలయమే ఓ ధర్నాచౌక్‌గా మారింది. మేం మళ్లీ గెలవడం సాధ్యం కాదని మంత్రులే సెలవిస్తున్నారు. అందుకే ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు.
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది రేవంత్ పరిపాలన. ప్రజలను, పార్టీని నట్టేట ముంచి తన పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నా రు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు పైనుంచి కింది దాకా అందరూ అందినకాడికి వెనకేసుకునే తొందరలో ఉన్నారు. వాటాల్లో తేడాలొచ్చి మంత్రులే వీధికెక్కి వీరంగం వేస్తున్నారు. ఓఎస్డీలు తుపాకులు గురిపెడుతున్నారు. పాలకపక్షం కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఇంత జరుగుతుంటే ఇంకా కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని ఎవరూ అనుకోరు. ఇదంతా చూసి పార్టీ పెద్దగా ఖర్గే గుండెలు బాదుకుంటున్నారు. సీనియర్ నేతగా ఆయన ఫీడ్ బ్యాక్ ఆయనకుంటుంది మరి.