విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి. అంతటి ఘోరకలి చూసి ఉండటం వల్ల ఇప్పుడు ఏ చిన్న వైరస్ చిటుక్కుమన్నా ప్రపంచం ఉలిక్కి పడుతున్నది. తాజాగా చైనాలో బయటపడిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్) కలకలం సృష్టిస్తున్నది. కరోనా భయావహ జ్ఞాపకాల నీడలో ఈ సరికొత్త వైరస్ కొంత బెదురు కలిగించడంలో ఆశ్చర్యం లేదు. కరోనా లాగే ఇదీ చైనాలో పుట్టడం, సోషల్ మీడియా ఊదరగొట్టడం ప్రస్తుత కలకలానికి కొంత కారణమని చెప్పక తప్పదు. గతవారం రోజులుగా మీడియాలో హెచ్ఎంపీవీ గురించిన కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. వైరస్ కన్నా వైరల్ అవుతున్న ప్రచారం ప్రమాదకరం. కరోనా పిల్లలకు ఎక్కువగా సోకకపోవడం, ప్రస్తుత వైరస్ పిల్లల్లోనే ముఖ్యంగా కనిపిస్తుండటం వంటి కారణాలు భయాలకు దారితీస్తున్నాయి.
ఇప్పటివరకు పది లోపు కేసులు, అదీ గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. చైనాలో వ్యాపించింది నిగూఢమైన, లేదా సరికొత్త వైరస్ అనే కథనాలు విరివిగా వచ్చాయి. కానీ, ఇవేవీ నిజాలు కావని వెల్లడైంది. ఏటా శీతాకాలంలో శ్వాసకోశ వైరస్లు కొత్త రూపంలో బయటపడటం జరుగుతూనే ఉంటుంది. హెచ్ఎంపీవీ కూడా అంతేనని తెలియవస్తున్నది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వైరస్‌ను కొవిడ్‌తో పోల్చి చూపడం జరుగుతున్నది. ఒక చానెల్ అయితే ఏకంగా మరో మహమ్మారి అంటూ చాటింపు వేస్తున్నది. ఇదంతా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతుండటం వల్ల అనవసరమైన ఆందోళనకు దారితీస్తున్నది. కొవిడ్‌కు, ప్రస్తుత వైరస్‌కు మధ్య మౌలిక తేడా ఏమిటో ప్రజలు తెలుసుకుంటే ఈ పరిస్థితి ఉండనే ఉండదు. కొవిడ్ మూలాలు ఇప్పటికీ తెలియవు. అది నిజంగా కొత్త వైరస్. కాగా హెచ్ఎంపీవీ తెలిసిన మూలాల నుంచి వచ్చిందే. పైగా అది ఆర్ఎన్ఏతో తయారైనది కాగా ప్రస్తుత వైరస్ డీఎన్ఏతో తయారైంది. అంతేకాదు, 2001 నుంచి ఈ వైరస్ వైద్య ప్రపంచానికి తెలిసిందేనని గూగుల్ సెర్చ్ చేసినా తెలిసిపోతుంది. కొత్త వైరస్ పూర్తిగా ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపిస్తేనే దాన్ని పాండెమిక్ లేదా మహమ్మారి అంటారు.
చైనాలో పెద్ద ఎత్తున శ్వాసకోశ వ్యాధులు పెరిగినట్టు తనకు ఎలాంటి సమాచారం అందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం గమనార్హం. గత ఏడాది కన్నా ఈ ఏడాది కేసులు తక్కువగా ఉన్నట్టు చైనా వ్యాధుల నియంత్రణ, నివారణ విభాగం పేర్కొనడం ఆలోచించాల్సిన విషయం. మరోవైపు సరికొత్తదీ అని ప్రచారం చేస్తున్న వైరస్ గురించి అంతర్జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదనేది గుర్తించాలి. హెచ్ఎంపీవీ గురించి భయపడిపోయి బెంగటిల్లడం కన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్య ప్రపంచం అంటున్నది. చికిత్స కంటే నివారణే ప్రధానమనేది తెలిసిందే. ఏ వైరస్ అయినా వ్యాపించే మార్గం ఒకటే. కరోనా పుణ్యమా అని జాగ్రత్తలూ తెలిసినవే. అవి సామాన్యమాన రీతిలో పాటించినా హెచ్ఎంపీవీ కాదు కదా, ఆ మాటకు వస్తే ఏ వైరస్ కూడా దరిచేరదు. ఈ లోగా సోషల్ మీడియా బెదరగొట్టకుండా ఉంటే చాలు.