తెలంగాణ రైతురాజ్యం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు ఇక్కడివాళ్లే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా అందిస్తున్న అండదండలతో రైతు నిమ్మళంగా సేతానం చేసుకుంటుంటే కాళ్లల్లో కట్టెలు పెట్టే పనికి పూనుకుంటున్నారు. ఆరుగాలం కష్టించే రైతుకు సర్కారు కల్పిస్తున్న సౌలతులకు కోతలు పెట్టాలని కత్తులు నూరుతున్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆ కరెంటును ఎనిమిదో వంతుకు.. అంటే 3 గంటలకు తగ్గిస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. తద్వారా రైతుల బతుకులు మళ్లీ ఆగం చేస్తామని చెప్పకనే చెప్తున్నారు. వ్యవసాయం దండుగన్న రాజకీయ బ్రోకర్ల మందలో మూలాలున్న వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? రైతులపై తూటాల వర్షం కురిపించిన గురువుకు తగ్గ శిష్యుడని అనకుండా ఎలా ఉండగలం?
అంతూపొంతూ లేకుండా మాట్లాడే రేవంత్రెడ్డి తను చెప్పిన మూడు గంటల కరెంటు ఎప్పుడెప్పుడు ఇవ్వాలో చెప్పగలరా? ఇంతకూ ఆయన కోరుకుంటున్నది ఏమిటి? అరకొర సరఫరాలతో, నిత్యం కోతలతో రైతును ఉసూరుమనిపించిన రోజులు మళ్లీ రావాలంటున్నారా? అర్ధరాత్రి, అపరాత్రి బాయిల కాడికి రైతులు పరుగులు పెట్టే రోజులు రావాలా? ఈ కష్టాల నుంచి రైతులను విముక్తం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా కరెంటు ఉత్పత్తిని చక్కదిద్ది, రైతులకు ఎల్లవేళలా మీట నొక్కితే మోటరు తిరిగే పకడ్బందీ సరఫరా వ్యవస్థను ఏర్పాటుచేశారు. దాంతో రైతుకు రంది లేకుండాపోయింది. వీటి గురించి ఏమీ తెలియని రేవంత్ ఉత్పత్తి, పంపిణీ గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారు. అయితే ఎకరం ఎన్ని గంటల్లో పారుతుందో తెల్వని వ్యక్తికి వ్యవసాయంపై, రైతు కష్టాలపై అవగాహన ఉంటుందని ఆశించడం అత్యాశే!
రైతు కేంద్రంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఇరుగుపొరుగు రాష్ర్టాల రైతులు సైతం మెచ్చుకుంటున్న సంగతి, అలాంటివి తమకూ కావాలని డిమాండ్ చేస్తున్న సంగతి వారికి తెలియదా? దేశమంతటా ఇక్కడి పథకాలపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని, కేసీఆర్ మూడోవిడత సీఎం పదవి చేపట్టడం ఖాయమనే మాట అంతకంతకూ బలంగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నిస్పృహకు గురవుతున్న రేవంత్ లాంటి నేతలు నోరుజారుతున్నారు. ప్రజాభిమానం చూరగొన్న పథకాలకు ఎసరు పెడుతున్నారు. రాష్ట్ర రైతులు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం సహజమే. సొల్లు మాటల రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తమ నోటికాడి కూడు ఎత్తగొట్టే మాటలు వారెందుకు సహిస్తారు? కర్రుకాల్చి వాతలు పెట్టే అదను కోసం తెలంగాణ రైతు ఎదురుచూస్తున్నాడు.