తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఐదేండ్ల కాలానికి తమ భాగ్యవిధాతలను ఎంచుకునే అపురూప ప్రజాస్వామిక ఘట్టానికి తెరలేచింది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికలివి. తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. గత రెండు ఎన్నికల్లో ప్రజల అభిమానం చూరగొని హ్యాట్రిక్ సాధించే దిశగా పాలక బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఇదీ మా గెలుపు బృందం అంటూ అభ్యర్థులను కూడా అందరికంటే ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. మేం చేసిన కృషిని చూసి మాకు ఓటు వేయండి అని బీఆర్ఎస్ ధీమాగా బరిలోకి దిగుతున్నది. సకారాత్మక పాలనకే మళ్లీ పట్టం కట్టమని కోరుతున్నది. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు సాధించిన అభివృద్ధిని చేజారనీయొద్దని, మరో మెట్టు పైకి ఎదిగే సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకొని అండగా నిలవాలని బీఆర్ఎస్ సవినయంగా ప్రజలకు మనవి చేసుకుంటున్నది.
అటుచూస్తే విపక్ష కాంగ్రెస్, బీజేపీ ఇంకా జాబితాలతో కసరత్తులు చేస్తున్నాయి. బీఆర్ఎస్ను ఓడించాలనే నకారాత్మక ధోరణితో ముందుకు పోతున్నాయి. మభ్యపెట్టే మాటలతో, అసాధ్యమైన హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ కప్పల తక్కెడ పట్టుకొని అభ్యర్థుల లెక్క తేల్చేందుకు నానా తంటాలు పడుతున్నది. తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలుచేయని, చేయలేక చతికిలబడిన హామీలకు మెరుగులు దిద్దుతున్నది. బీఆర్ఎస్ అందిస్తున్న పథకాల లబ్ధిని పెంచే అర్రాసు పాటకు సిద్ధపడుతున్నది. మరోవైపు అభ్యర్థులే దొరుకక బీజేపీ అవస్థలు పడుతున్నది. తాను ఇన్నాళ్లుగా పట్టించుకోని మహిళా బిల్లు, పసుపు బోర్డు వంటి అంశాలను బయటకు తీస్తూ ఓటమి భయంతో లేనిపోని హంగామా చేస్తున్నది.
దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం సాధించిన అభివృద్ధి ఎంతో, ఇంకా దేశంలో వెనుకబాటుతనం ఎందుకున్నదో తెలుసుకోలేనంతటి అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. మనుషులను చీల్చి అభివృద్ధిని భ్రష్ఠు పట్టించే బీజేపీ పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలరు. అవినీతి పంకిలంలో మునిగి తేలే ‘స్కాంగ్రెస్’ లోగుట్టు వారికెరుకే. అభివృద్ధి ఎజెండాగా తమ వెంట నిలిచే, తమ బతుకులను బాగుపర్చే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని గత పదేండ్ల ప్రస్థానంలో కండ్లారా చూసినవాళ్లు. అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు-రంగారెడ్డి తెలంగాణ తల్లికి చేసే జలాభిషేకం వారికి నిత్యం ఆవిష్కృతమయ్యే దృశ్యమే. సకల జనహిత పాలనలో సంబురాలు, జాతరల తెలంగాణ కావాలా? మతోన్మాద మంటల, కపట నాటకాల తెలంగాణ కావాలా? అంటే దేనిని ఎంచుకోవాలో, ఎవరిని గద్దెనెక్కించుకోవాలో వారికి తెలుసు. ‘ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా?’ అనే సందేహం వారికి లేదు. తాము ఎవరి గట్టో వారు ఈసరికే నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 3న వారి నిర్ణయం వెల్లడి కానున్నది.