‘భూగోళం మనిషి సొంతం కాదు.. మనిషే భూమి సొంతం. భూమ్మీద ఉన్నవన్నీ పరస్పర ఆధారితాలు. ఈ జీవవ్యవస్థలో మనిషి ఒక భాగం మాత్రమే. ఆ జీవవ్యవస్థకు మానవులు ఏం చేస్తే దానిప్రభావం తిరిగి మానవులపై కూడా అదేస్థాయిలో పడుతుంది’- అమెరికాలోని తమ తెగలను అణిచివేస్తూ, తమ భూములను ఆక్రమించుకుంటున్న శ్వేతజాతి వలసదారులను ఉద్దేశించి రెడ్ ఇండియన్ల నాయకుడు ‘చీఫ్ సియాటల్’ (1786-1866) చేసి న హితబోధ ఇది. ఆధునిక పోకడలు, నాగరికత అని మనం దేన్నైతే అంటున్నామో దానికి దూరంగా, అడవుల్లో నివసించే ఒక మూలవాసుల తెగ నాయకుడు 200 ఏండ్ల కిందట చేసిన ఈ సూచన నేటి కీ శిరోధార్యమని, కీటకాలు అంతరించడంపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధన రూఢీ చేస్తున్నది.
తేనెటీగలు, సీతాకోక చిలుకలు, చిమ్మటల వంటి కీటకాల సంఖ్య క్షీణిస్తుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.57 వేల కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని కేంబ్రిడ్జ్ పరిశోధనలో తాజాగా తేలింది. 2019లో జరిగిన తొలి ‘గ్లోబల్ సైంటిఫిక్ రివ్యూ’ లో కూడా కీటకాల సంఖ్య వేగంగా పడిపోతున్నదని, ఇలాగే కొనసాగితే మరో పదేండ్లలో 25 శాతం, 50 ఏండ్లలో 50 శాతం, 100 ఏండ్లలో మొత్తం కీటకాలు అంతరించిపోతాయని వెల్లడైంది. అడవుల నిర్మూలన, వ్యవసాయంలో విచక్షణరహితంగా పురుగు మం దుల వాడకం, పట్టణీకరణ, భూతాపం పెరగడం వంటి వాతావర ణ మార్పులు ఇందుకు కారణాలని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమ్మీద చోటుచేసుకుంటున్న ఆరో మహా వినాశనానికి కీటకాల అంతర్థానం ఒక సంకేతమన్న హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి.
భూమ్మీద ఉన్న మనుష్యుల మొత్తం బరువుతో పోల్చితే కీటకాల బరువు 17 రెట్లు అధికం. ఇంతటి భారీసంఖ్యలో ఉన్న కీటకాలు అంతరిస్తే జీవావరణం అతలాకుతలమవుతుంది. తేనెటీగలు వంటి కీటకాలు పువ్వు పువ్వు మీద వాలుతూ పోయినప్పుడే పరపరాగ సంపర్కం జరుగుతుంది. పంటలు పండుతాయి, మన కడుపులు నిండుతాయి. ఒక జీవి మరో జీవికి ఆహారమైనట్టే.. కీటకాలపై ఆధారపడే అనేక రకాల జీవులుంటాయి. గ్రీన్‌హౌజ్ ఉద్గారాల వల్ల చెట్ల ఆకులు, నీటిలోని నాచు పత్రహరితాన్ని తయారు చేసుకోలేకపోయినా మానవులతో సహా మొత్తం జీవరాశులు అంతరిస్తాయి. గడ్డి కూడా మొలవని, కీటకాలు కూడా బతకలేని రీతిలో భూగోళాన్ని నాశనం చేసుకుంటే చివరికి మన మనుగడ కూడా ఉండదు. ఇంత టి విలయం సంభవించకూడదంటే మనిషి ఈ భూమికి రారాజును అనే భ్రమను పక్కనపెట్టి, భూమ్మీద నివసిస్తున్న జీవరాశుల్లో తాను ఒకడిని మాత్రమే అనే స్పృహను పెంచుకోవాలి. భూమి వనరులను తరగదీసే, పర్యావరణాన్ని నాశనం చేసే విధానాలను మార్చుకోవాలి. విధ్వంసానికి దారితీయని అభివృద్ధి విధానాలను అమలుచేయాలి. జీవావరణం ఉంటేనే జీవులుంటాయి! మనిషీ జీవే కదా!