‘తలె అమ్మి చెప్పులు కొన్నట్టు!’ అనే సామెత ఒకటి ఉన్నది. చెప్పు ల షోకు కోసం అన్నం తినే పళ్లాన్ని అమ్ముకోవడాన్ని మించిన దివాలాకోరుతనం ఉండదు. కేంద్రాన్ని, రాష్ర్టాన్ని పరిపాలనారంగంలో బేరీజు వేసి చూస్తే, ఎవరు ఇగురంతో ఇల్లు చక్కబెడుతున్నారనేది తెలుస్తుంది. జీఎస్టీ నష్టాన్ని సర్దుతామని హామీ ఇచ్చిన కేంద్రం చివరికి రాష్ర్టాల నెత్తికొట్టింది. ‘గుడిలో లింగానికి అంగట్లో బెల్లం సమర్పయామి’ అన్నట్టు కేంద్ర ప్యాకేజీలతో కొత్తగా వచ్చిందీ లేదు, జనం పుచ్చుకున్నదీ లేదు. నిజానికి కరోనా రాకముందే కేంద్రం చతికిలబడ్డది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తీరు, కార్పొరేట్ సం స్థలకు లక్షన్నర కోట్ల మేర పన్నుల తగ్గింపు వంటి అనాలోచిత చర్య ల వల్ల చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి! ఇప్పుడు అమ్మకాలు కాదంటూనే, పబ్లిక్‌రంగ ఆస్తులను అప్పనంగా ప్రైవేటుకు అప్పగిస్తున్నది.
తెల్లారితే చాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే రాష్ట్ర బీజే పీ నాయకులు కేంద్రంలో సాగుతున్న తతంగాన్ని గమనిస్తే మంచిది. కార్పొరేట్ సంస్థల పన్నులు తగ్గిస్తున్న కేంద్రం మరి పేదలను కనికరించడం లేదెందుకు? వంటగ్యాస్ సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చింది. కానీ సిలిండర్ ధర పెరిగిపోతుం దే తప్ప ఖాతాలో వేసే సొమ్ము పెరగడం లేదు. రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నది. కానీ వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌కూ మీటర్లు పెట్టాలంటున్నది. కేంద్రం ఇది ఏదో రూపంలో దొంగదెబ్బ కొట్టడానికి కాదా? పెట్రోలు ధర పెంచుతూ పోతున్నది. దీనివల్ల రవాణా ఖర్చు పెరిగి అన్ని ధరలూ పెరుగుతాయి. ఈ పరోక్ష పన్ను వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడటం లేదా? కొన్ని భారీ వ్యవస్థలను ప్రైవేటు సంస్థలు సమర్థతతో ప్రజోపకరంగా నిర్వహించడం సాధ్యం కాదని బ్రిటిష్ రైల్వే ప్రైవేటీకరణ ప్రయోగ ఫలితం చెప్పడం లేదా? పబ్లిక్ రంగాన్ని పణంగా పెట్టి ఎన్రాన్ విద్యుత్సంస్థకు అడ్డగోలు హామీలు ఇచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం చేయి కాల్చుకోలేదా? ఆస్తులను ప్రైవేటుకు ఎందుకు కట్టబెడుతున్నట్టు? ఆ నిధులు ఎవరి కోసం వెచ్చిస్తున్నట్టు?
బొగ్గుబాయిలను కేంద్రం అమ్మివేస్తుంటే, ఇక్కడ సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. దేశ సౌభాగ్యానికి తనవంతుగా భారీ నిధులు అందించిన కల్పతరువు జీవిత బీమా సంస్థను కేంద్రం విదేశీ సంస్థల చేతుల్లో పెట్టాలనుకుంటున్నది. ఖాయిలా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. విద్యుత్ కేంద్రాలను వృద్ధి చేస్తున్నది. వీటి నిర్మాణ ఆర్డర్లను బీహెచ్ఈఎల్కు కేటాయించి ఈ పబ్లిక్‌రంగ సంస్థకు ఊపిరి పోస్తున్నది. కరోనాను తట్టుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నెగ్గుకొచ్చింది! ఉష్ట్రపక్షిలా ఇసుకలో తలదూర్చిన ప్రతిపక్షాలు, ఒకసారి తలెత్తి రాష్ట్రంలో సాగుతున్న సంక్షేమ పాలనను చూడాలి. తమ ప్రేలాపనలతో ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నామని గ్రహించాలి.