అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి. అయితే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా ఇప్పుడు ఆ హామీలు డొల్లలయ్యాయి. 20 నెలలైనా ఒక్కటీ నెరవేర్చలేక కాంగ్రెస్ సర్కారు చతికిలబడింది. మలిసంజెలో పెన్షన్ అందుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకునే విశ్రాంత ఉద్యోగులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడటం శోచనీయం. ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన సర్కారు వారిని గాలికి వదిలేయడం దారుణం. 2024 మార్చి నుంచి విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వడం లేదు. ఆ బెనిఫిట్లతో ఎన్నో సమస్యలు తీర్చుకోవాలని వేసుకున్న ప్రణాళికలు పట్టాలు తప్పుతున్నాయి. ఈ సమస్యపై ఓ విశ్రాంత ఉద్యోగి హైకోర్టుకు వెళ్లడం, సర్కారుకు న్యాయస్థానం తలంటు పోయడం తెలిసిందే.
రిటైరైన వెంటనే చెల్లించాల్సిన గ్రాట్యుటీ వంటి బెనిఫిట్స్ కోసం శరపరంపరగా రోజుకొక పిటిషన్ దాఖలవుతుండటం రాష్ట్ర ఆర్థిక నిర్వహణ దారుణ వైఫల్యానికి నిదర్శనం. కోర్టు మొట్టికాయల తర్వాత కూడా సర్కారులో పెద్దగా చలనం రాలేదనడానికి సమస్యలు కొనసాగుతుండటమే నిదర్శనం. న్యాయంగా రావాల్సిన చెల్లింపుల కోసం పెన్షనర్లు పోరుబాట పట్టాల్సి రావడం ఓ వైపరీత్యం. ఉద్యోగ విరమణ ప్రయోజనాల సొమ్మును ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తుండటంతోనే సమస్య తీవ్రమవుతున్నది. గత నెల ఓ రిటైర్డ్ పోలీసు ఇన్స్పెక్టర్ ఏడాది దాటినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆందోళనతో గుండె ఆగిపోయి మరణించిన ఘటన సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఆందోళనతో గుండెలు ఆగుతుంటే, మరణ మృదంగాలు మోగుతుంటే మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ అంటూ సర్కార్ కాలహరణానికి పాల్పడుతున్నది. బెనిఫిట్ల మాటేమో గానీ పెన్షన్లు కూడా సకాలంలో అందడం లేదు. హెల్త్‌కార్డులు కూడా నిరర్ధకం కావడంతో ఆరోగ్య సంరక్షణ సవాలుగా మారుతున్నది. ఇలా అన్నివైపుల నుంచి సమస్యలను రిటైర్డు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా జీవితకాలం ప్రజలకు సేవలందించిన పెద్దలకు విశ్రాంత దశ దుర్భరంగా మారడం ఆందోళనకరం. సమస్యల పరిష్కారానికి పెన్షనర్లు ఎక్కని మెట్లు, దిగని మెట్లు లేవు. మంత్రులు, అధికారులు ముఖం చాటేస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పలుమార్లు ప్రభుత్వానికి మహజర్లు సమర్పించి విసిగిపోయిన పెన్షనర్లు సర్కారు మెడలు వంచేందుకు పోరుబాట పట్టాల్సి రావడం దురదృష్టకరం. ఆగస్టు 10వ తేదీ వరకు గడువు విధించి ఆ లోగా ఎలాంటి ఫలితాలు కనిపించకపోవడంతో ముందుగా హెచ్చరించినట్టుగానే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. సముచితంగా గౌరవించుకోవాల్సిన రిటైర్డు ఉద్యోగులను ఇలా వీధికెక్కేలా చేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొద్దు నిద్ర వదిలించుకొని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మకమైన చర్యలు చేపట్టాలి.