వెనుకటికి తుపాకీ రాముడు, పిట్టల దొర వంటి వేషాలు వేసేటోళ్లు ఏతులతో నవ్వించేటోళ్లు. అలా చేయడం కేవలం వినోదం పంచడానికే. మరి సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమనాలి? దావోస్‌లో రాష్ర్టానికి సేకరించిన పెట్టుబడుల లెక్కలు ఇంతింతై వటుడింతై అని ఆకాశాన్ని తాకడం వింతల్లోకెల్లా వింత. రూ.1.78 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులపై ఒప్పందం కుదిరిందని, వీటి ద్వారా 49,500 మందికి ఉపాధి లభిస్తుందని సీఎంవో ప్రకటించింది. ఇందులో దిగ్గజ సంస్థ అమెజాన్ రూ.60 వేల కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ రూ.45,500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించాయని తెలిపింది. సీఎం రేవంత్ భారీగా పెట్టుబడులు సాధించుకువచ్చారని, అది చూసి బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంట కలుగుతున్నదని హోర్డింగులు పెట్టుకోవడం హాస్యాస్పదం. నిజంగా ఆ స్థాయి పెట్టుబడులు తేగలిగితే సంతోషించేది తెలంగాణను సాధించిన పార్టీయేనన్నది నిర్వివాదాంశం. సీఎం చెప్తున్నట్టుగా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆయనకు తాము సన్మానం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చురక వేయడం గమనార్హం.
మేఘా కంపెనీతో రూ.15 వేల కోట్ల ఒప్పందం కుదిరిందని చెప్పుకొంటున్నారు. స్కైరూట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన టీ హబ్‌లో ఊపిరి పోసుకున్న కంపెనీయే. మరో హైదరాబాదీ కంపెనీ కంట్రోల్ ఎస్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నామంటున్నారు. ఈ మూడు కంపెనీలు కలిపి రూ.25,500 కోట్ల పెట్టుబడులు పెడతాయంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీలతో వేల కిలోమీటర్ల దూరంలోని దావోస్‌కు పోయి ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటో? ఇవి విదేశీ పెట్టుబడుల కిందకు వస్తాయా? అనేది ప్రశ్న. గత ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా రూ.40 వేల కోట్లకు పైగా ఒప్పందాలు కుదిరినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం టాంటాం వేసుకున్నది. 18 కంపెనీలతో ఎంవోయూలు కుదిరితే ఒక్కటీ వెలుగు చూడ లేదు. ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఈ సారి సంఖ్యను పెంచి చెప్తున్నప్పటికీ అందులో అసలు సిసలైన ఒప్పందాలు ఎన్ని? పాత వాటి విస్తరణలు ఎన్ని? అనేది ప్రశ్న. దావోస్ ఒప్పందాలు ఆసక్తి ప్రకటనలు మాత్రమేనని కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గతంలో చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేస్తే ‘విదేశీ పెట్టుబడుల’ అసలు రంగు బయటపడుతుంది.
పెట్టుబడుల గురించి ప్రకటనలు గుప్పించి ప్రచారార్భాటం చేసుకోవడం సరే.. అవి కార్యరూపం దాల్చేలా చేయాల్సిన బాధ్యత కూడా తనపై ఉన్నదని సర్కారు గుర్తించాలి. తెలంగాణ ఇమేజ్ బీఆర్ఎస్ హయాంలో పెరిగిందన్నది వాస్తవం. ఫలితంగా పెట్టుబడుల ప్రవాహం ఉధృతమైందన్నదీ వాస్తవమే. కేసీఆర్ ప్రభుత్వం ఫాక్స్‌కాన్, కిటెక్స్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా అవి సాకారమయ్యేలా చర్యలు తీసుకోవడమూ తెలిసిందే. సీఎం రేవంత్ కూడా అనవసరమైన అట్టహాసాలు మాని అదే దారిలో వెళ్తే రాష్ర్టానికి నిజంగా మేలు జరుగుతుంది.