కారుచీకట్లో కాంతిరేఖ అనే ప్రశంస తెలంగాణకు రాజకీయరంగంలోనే కాదు.. విద్యుత్తు రంగంలోనూ వర్తిస్తుంది. భారతదేశ రాజకీయాలకు బీజేపీ గ్రహణం పట్టిన ఈ సమయంలో ఆ చీకట్లను చీల్చే వెలుతురు పుంజంగా నేడు కేసీఆర్ నాయకత్వం కనిపిస్తున్నది. అదే విధంగా, ఇటీవల కేంద్రం అసమర్థ విధానం ఫలితంగా యావత్‌దేశం బొగ్గు కొరతను ఎదుర్కొని కరెంటు లేక చీకట్లలో మగ్గినప్పటికీ.. ఆ నిశీధిలో తెలంగాణ మాత్రమే నక్షత్రంగా ప్రకాశించింది. ఈ వెలుగులను మరింత జాజ్వలమానం చేయటానికి తెలంగాణ వేస్తున్న మరో ముందడుగే.. ‘యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్’ నిర్మాణం.
సీఎం కేసీఆర్ ఆలోచనలు ఎంత లోతుగా ఉంటాయో, ఎంత సుదూర భవిష్యత్తును చూస్తాయో తెలుసుకోవటానికి యాదాద్రి ప్లాంటు సందర్శన సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఓ ఉదాహరణ. యాదాద్రి ప్లాంటులో ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎంత కరెంటు వస్తుంది? ఎల్లప్పుడూ అందుబాటులో కనీసం 30 రోజుల బొగ్గు నిల్వలు వంటి సాంకేతిక అంశాలకే ఆయన పరిమితం కాలేదు. ఈ ప్రాజెక్టులో పని చేసే దాదాపు పది వేల మంది సిబ్బందికి సరిపడా అద్భుతమైన టౌన్‌షిప్‌ను నిర్మించాలని, అది కూడా ప్రపంచస్థాయి నిపుణుల మార్గదర్శకత్వంలో జరుగాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. ప్లాంటుకు మండల కేంద్రానికి మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, రోడ్డు-రైల్వే మార్గాల అనుసంధానం, రైల్వే క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం వంటి అంశాలపైనా ఆదేశాలు ఇచ్చారు. ఒక భారీ ప్రాజెక్టు ఎన్ని వేల జీవితాలను ప్రభావితం చేస్తుందో ఊహించి, ఆ దిశగా అధికార యంత్రాంగానికి ముందుగానే పూర్తి స్పష్టతనిచ్చారు.
ఈ దార్శనికత కారణంగానే తెలంగాణ నేడు దేశానికి దారి చూపే రాష్ట్రంగా అవతరించింది. కేంద్రంలోని అగ్రనేతల ద్వయం ఆదర్శంగా చెప్పుకొనే గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు నేటికీ కొనసాగుతున్నాయి. రైతులకు ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వటం లేదు. అది కూడా దఫాలు దఫాలుగా. కానీ, ఎనిమిదేండ్ల తెలంగాణ అన్ని రంగాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నది. రైతన్నలకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఉద్యమ కాలం నుంచీ విద్యుత్‌రంగ నిపుణులతో కేసీఆర్ కొన్ని వేల గంటలపాటు జరిపిన, ఇప్పటికీ కొనసాగిస్తున్న మేధోమథనం ఫలితం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో, ఛాలెంజ్‌గా తీసుకొని రాష్ట్ర విద్యుత్ రంగాన్ని యుద్ధప్రాతిపదికన పటిష్ఠపరిచిన కరెంటు కార్మికుల కష్టఫలం ఇది. కార్యక్షేత్రంలో ప్రణాళికలు పక్కాగా అమలు చేసిన అధికారులు, సిబ్బంది కృషి ఫలితం. మార్గనిర్దేశకత్వం, అమలు, లక్ష్యసాధన- ఇది ఒక ధార. దీనికొక సజీవ ఉదాహరణ ఈ విజయం.