రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పేరిట రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. ఒకటి ఉత్తర ప్రాంతానికి, రెండోది దక్షిణ ప్రాంతానికి సేవలందిసున్నాయి. తాజాగా ప్రభుత్వం మూడో డిస్కంను తెరమీదికి తీసుకువచ్చింది. గత నెల 17వ తేదీన జారీచేసిన జీవో 44 ప్రకారం వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త డిస్కం పని ప్రారంభించనున్నది. ఉత్తరానికొకటి, దక్షిణానికొకటి డిస్కంలు ఉండగా ఇప్పుడు ఈ మూడో డిస్కం దేనికనే సందేహం సహజంగానే తలెత్తుతుంది. రెండు డిస్కంల సమస్యలన్నీ ఎత్తి మూడో డిస్కం నెత్తిన పడేయటమే అందుకు కారణం.
ఉచిత విద్యుత్తు కింద సాగుబడి జరుగుతున్న వ్యవసాయ కనెక్షన్లు, తాగునీటి కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లను విడదీసి మూడో డిస్కంకు అప్పగించారు. రెండు డిస్కంలకు చెందిన మొత్తం 5,22,479 వ్యవసాయ కనెక్షన్లను మూడో డిస్కంకు బదలాయించి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించబోతున్నారు. ప్రస్తుతానికి మీటర్లను ట్రాన్స్‌ఫార్మర్లకే పరిమితం చేసినప్పటికీ మీటర్లు అనే మాటే రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలనే కేంద్రం ఆలోచనను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించడం తెలిసిందే. వ్యవసాయ వినియోగంపై కాకిలెక్కలు వేసి మెల్లగా మీటర్ల వైపు అడుగులు వేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిల్లో గరిష్ఠ మొత్తం, వివిధ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన అప్పుల్లో ప్రధాన భాగం కొత్త డిస్కంకు కట్టబెట్టారు. ఆర్థిక నిర్వహణ మెరుగుదల లక్ష్యంగా ఈ మార్పులు తెస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొంటున్నది. కానీ, కనీస స్థాయిలో అప్పులు, బకాయిలు మొదటి రెండు డిస్కంలకు మిగిల్చి వాటి భారాన్ని తగ్గిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ఏతావాతా ఆ రెండింటినీ ప్రైవేటీకరించే ఆలోచన ఏమైనా ఉందా? అనే దిశగా కూడా ఊహాగానాలు జరుగుతున్నాయి.
మూడో డిస్కం యావత్తు రాష్ర్టాన్ని కార్యరంగంగా కలిగి ఉంటుంది. ఎలాంటి ఆపరేషన్లుండవు. కేవలం కనెక్షన్లను చూసుకోవడమే పని. దీని పరిధిలో ఎలాంటి సబ్ స్టేషన్లు గానీ, హెచ్‌టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు, లైన్లు ఉండవు. ఇప్పటిదాకా డిస్కంలకు క్రాస్ సబ్సిడీ కింద వస్తున్న సుమారు రూ. 8 వేల కోట్లలో ఈ డిస్కంకు పైసా రాదు. ఈ డిస్కం కనెక్షన్ల వ్యయంతో పాటుగా ఉద్యోగుల జీత భత్యాలకు పూర్తిగా ప్రభుత్వం మీదే ఆధారపడి పనిచేస్తుంది. ఇంకా అదనంగా విద్యు త్తు సరఫరా చేసినందుకు ఇతర డిస్కంలకు రూ.6 వేల కోట్ల దాకా వీలింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సొంతంగా మౌలిక నిర్మాణాలు లేని కారణంగా కొత్త కనెక్షన్లు ఇవ్వడం, సమస్యలు ఎదురైనప్పడు మరమ్మతులు చేయడం వంటి సమస్యలు క్షేత్రస్థాయిలో ఎదురవుతాయి. ఈ మార్పుల వల్ల రాష్ట్ర విద్యుత్‌రంగ ముఖచిత్రం మారడమే కాకుం డా ఉద్యోగుల భవిష్యత్తూ డోలాయమానంలో పడుతుంది. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా మెల్లమెల్లగా క్రాస్ సబ్సిడీలు ఎత్తివేయాలన్న కేంద్రం ఆలోచనకు ఈ మూడో డిస్కం ఏర్పాటు ద్వారాలు తెరుస్తుందని చెప్పవచ్చు. అదే జరిగితే క్రాస్ సబ్సిడీలు ఎత్తివేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అవుతుంది.