పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాలక, విపక్షాలు రెండు చక్రాల వంటివి. రెండూ కలిసి ప్రజాహితమనే ఏకైక లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. దీనికనుగుణంగానే వ్యవస్థలు, సంప్రదాయాలూ స్థిరమైనాయి. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కి విపరీతపు పోకడలకు పోతున్నది. అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడమే దీనికి ఉదాహరణ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన గాంధీ, ఆ తర్వాత చేరారు. చేరినట్టుగా ఫొటోలు, ఆయన పోస్టు చేసిన ట్వీట్లు కూడా ఉన్నాయి. కానీ, తన పీఏసీ నియామకంపై వివాదం తలెత్తడంతో తాను పార్టీ మారలేదని మాట మార్చారు. గాంధీ ఫిరాయింపుపై అంతిమంగా ఏం జరుగుతుందనేది వేరే విషయం. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధంగా తమ పక్షానికే ఇచ్చుకోవడం కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యంగా భావించాలి.
శాసనసభ నిబంధన 250 ప్రకారం దామాషా ప్రాతిపదికన పీఏసీ సభ్యుల ఎంపిక జరగాలి. పీఏసీ ఏర్పాటుచేసే నాటికి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. ఆ ప్రకారం ముగ్గురు సభ్యులు బీఆర్ఎస్ నుంచి ఉండాలి. ఒక్కో సభ్యుని ఎన్నికకు 13 మంది అవసరమవుతారు. మరి గాంధీని ఎన్నుకున్నది ఏ 13 మంది ఎమ్మెల్యేలో? 1958-59 నుంచి విపక్ష సభ్యుడినే పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకునే ఆనవాయితీ ఉన్నట్టు అసెంబ్లీ సభ్యుల కరదీపికలో స్పష్టంగా ఉన్నది. మరి పార్టీ ఫిరాయించిన గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమించారు? ఈ తరహా నియామకం జరపడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధం కాదా? పీఏసీ అనేది ప్రభుత్వ ఖాతాలను, వ్యయాలను తనిఖీ చేసే కీలక బాధ్యతను నిర్వర్తిస్తుంది. మరి తమ పార్టీ వారికే తాళాలు ఇస్తే సర్కారీ లెక్కల్లో సత్యాసత్యాలను నిగ్గు తేల్చడం సాధ్యమవుతుందా?
ఏ మాత్రం అవకాశం దొరికినా అన్నింటిలో స్వపక్షీయులను జొప్పించాలని చూసే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎన్నడూ ఇలాంటి సంప్రదాయ ఉల్లంఘనకు పాల్పడలేదు. 2014-19లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీ థామస్‌ను, మల్లికార్జున ఖర్గేను పీఏసీ చైర్మన్లుగా నియమించి, క్యాబినెట్ ర్యాంకు కల్పించడం గమనార్హం. ఆ తర్వాత అధీర్‌రంజన్ చౌదరిని, ప్రస్తుతం కేసీ వేణుగోపాల్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించారు. ఈ సంప్రదాయం ప్రకారమే బీఆర్ఎస్ హయాంలో విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పి.కిష్టారెడ్డి, రామ్ వెంకటరెడ్డి, జె.గీతారెడ్డి, ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్లుగా నియమితులయ్యారు. మరి పొద్దున లేస్తే రాజ్యాంగ విలువలను కాపాడతామని ఊదరగొట్టే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణలో జరుగుతున్న విలువల హననం కనిపించడం లేదా? బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిహసిస్తుంటే చూసీచూడనట్టు వదిలేస్తారా? ఊరుకో రీతి అవసరానికో నీతి అనేదే కాంగ్రెస్ విధానమా? పార్లమెంట్లో విపక్ష హోదాతో కమిటీ పదవులు పొందుతూ ఇక్కడ విపక్షానికి ఆ అవకాశం దక్కకుండా చేయడం ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా?