నీలం రంగు గుంటనక్క నీళ్లల్లో తడిసింది. పులుముకున్న బులుగు రంగు ఆ దెబ్బకు ఇడిసింది. ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ చెప్పిన మాటలు నీటిమూటలై పాయె అన్నట్టు ఆరునెలల్లో అమలు చేస్తామన్న బీసీ రిజర్వేషన్ల పెంపు పదహారు నెలలైనా అయ్యేట్టు కనిపించడం లేదు. వెన్నుపోట్ల పరంపరలో ఇప్పుడు బీసీల వంతు. కులగణన ఓ ప్రహసనంలా మారింది. తప్పుల తడక లాంటి నివేదికను ముందు పెట్టి తమాషా చేస్తున్నారు. అధికారంలో వాటా కోసం కొట్లాడుతున్న బీసీ సోదరుల ఆశలపై నీళ్లు గుమ్మరించారు. జనాభాలో 60 శాతం ఉన్నామనీ, అదే దామాషాతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలనీ బీసీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న 23 శాతం రిజర్వేషన్లను ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా కనీసం 42 శాతానికైనా పెంచాలని వారంటున్నారు. కానీ కాంగ్రెస్‌కు ఆ మాత్రం పెంచే ఉద్దేశం కూడా లేనట్టుగానే కనిపిస్తున్నది. బీసీల లెక్కలను తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తుండటమే అందుకు కారణం. బీసీలు 46.25 శాతానికి మించి లేరని సర్కారు వేసిన లెక్కలు వింతల్లోకెల్లా వింతగా చెప్పుకోవాలి. అసలు ఆ లెక్కలు ఎక్కడి నుంచి తెచ్చారో వారికే తెలియాలి. పదేండ్లలో పెరిగిన తెలంగాణ జనాభా రెండు లక్షలేనంటూ రెండు చెవుల్లో రెండేసి పువ్వులు పెడుతుండటం మరీ విడ్డూరం.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వే లెక్కలతోనూ సర్కారు వండివార్చిన గణాంకాలకు పొంతన కుదరడం లేదు. అసలు జనాభా పెరుగుదలే అంతంతమాత్రమంటూ, బీసీల జనాభా తగ్గినట్టు చూపడం అనుమానాలకు దారితీస్తున్నది. బీసీలకు మొండిచెయ్యి చూపేందుకు, రిజర్వేషన్ల విషయంలో అసలుకే ఎసరు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. 42 శాతం కోటాకైనా బిల్లు పెట్టి చట్టం తెస్తారేమో అనుకుంటే ఆ పని చేయకుండా అష్టవంకర్లు తిరుగుతున్నారు. కేంద్రం ఒప్పుకుంటేనే జరుగుతుందని ప్లేటు ఫిరాయిస్తున్నారు.
మరి ఆసంగతి హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పుడేమో బిల్లు సంగతి పక్కన పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామంటున్నారు. ఇస్తే కేంద్రం దయ. ఇవ్వకపోతే పార్టీ పరంగా అమలు చేస్తామంటూ మేకపోతు గాంభీర్యం. మీరూ అలాగే చేయండని విపక్షాలకు గడుసుగా సవాలు విసురుతున్నారు సీఎం రేవంత్. ఆ మాత్రం దానికి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు? అరకొర నివేదికతో అసెంబ్లీలో ఆగమాగం చేసుడేంది? అన్ని వివరాలు లేవని వెనుకకు తగ్గుడేంది? బీసీలపై సర్కారు కురిపించింది కపట ప్రేమేనని ఈ తీరుతెన్నులు చెప్పకనే చెప్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా బడుగుల రిజర్వేషన్లకు మంగళం పాడేందుకు జరిపిన తతంగమే ఇందుకు నిదర్శనం. ఈ మోసాన్ని గ్రహించి ఆగ్రహించిన బీసీలు పోరుబాట పడుతున్నారు. విపక్ష బీఆర్ఎస్ అడుగడుగునా సర్కారు సాకులను నిలదీస్తూ నిద్రలేకుండా చేస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రైడా తిరుగుబాట పడుతున్న సూచనలు వెలువడుతుండటం గమనార్హం.
సందట్లో సడేమియా అన్నట్టు ఈ కుప్పిగంతుల వల్ల మరో ప్రమాదమూ పొడసూపుతున్నది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంటూ కేంద్రం పావులు కదుపుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా మా జనాభా తక్కువ అని చెప్పుకోవడం మన ప్రాతినిధ్యానికి మనమే ముప్పు తెచ్చుకోవడం కాదా? బీసీలతో పాటుగా యావత్తు రాష్ర్టాన్ని బలిపెట్టేస్తుండటం దురదృష్టకరం. వ్యూహరచనా ప్రావీణ్యం, పరిపాలనా నైపుణ్యం లేని అసమర్థ పాలకుల నిర్వాకం ఇది. హామీలు, ఆపై గ్యారెంటీలు, అవీ సరిపోవని డిక్లరేషన్లు. తీరా గెలిచాక ‘ఆడలేక మద్దెల ఓడు’ తరహా కుంటిసాకులు. కొన్ని బుకాయింపులు, మరికొన్ని దబాయింపులు. ఇంతకు మించి ఈ సర్కారుకు ఇంకేం చాతకాదని ప్రజలు ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు.