ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం మరోసారి మావోయిస్టు, పోలీసు బలగాల రణరంగమైంది. దంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు. భారీ మొత్తంలో రివార్డులున్న పలువురు సీనియర్లను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటైన 24 సంవత్సరాల కాలంలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్. వరుస నష్టాలతో కునారిల్లుతున్న మావోయిస్టులకు తాజా ఎన్కౌంటర్ పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఐదు మాసాల క్రితం కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మరణించారు. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 188 మంది నక్సల్స్ హతులయ్యారు. మొత్తంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల మృతుల సంఖ్య 237కు చేరుకుంది. శుక్రవారం నాటి ఎదురు కాల్పుల్లో పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. మారుమూల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు పూర్తి సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించడం వల్లే ఇది సాధ్యమైందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. కానీ, హింస ఎటువైపు నుంచి జరిగినా ప్రాణ నష్టం తప్ప సాధించేదేమీ ఉండదు.
సుమారు ఆరు దశాబ్దాల కిందట సమ సమాజం, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే భావనలతో మొదలైన నక్సలైట్ ఉద్యమం కాలక్రమంలో అనేక చీలికలకు గురైంది. ప్రస్తుతం నక్సల్ ఉద్యమం కొన్ని ప్రాంతాలకే, ముఖ్యంగా గిరిజనులు అధిక సంఖ్యలో ఉండే అటవీ ప్రాంతాలకే పరిమితమైంది. గిరిజనులకు వారసత్వంగా సంక్రమించిన అటవీ సంపదను కార్పొరేట్‌శక్తుల బారి నుంచి కాపాడే ప్రయత్నాలకు నక్సలైట్లు మొదటినుంచీ అండగా నిలుస్తున్నారు. అయితే అందుకు వారు సాయుధ మార్గాన్ని ఎంచుకోవడం సమస్య అయింది. నక్సల్ ఉద్యమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూసే ప్రభుత్వం పోలీసు బలంతో అణచడం వైపే ఎక్కువగా మొగ్గుచూపడం తెలిసిందే. అందునా కమ్యూనికేషన్స్, నిఘా సాంకేతికత ఎంతగానో విస్తరించిన ప్రస్తుత కాలంలో పోలీసు వ్యవస్థకు ఉండే ఆధిక్యతను తక్కువగా అంచనా వేయలేం.ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాలు విపలమయ్యాయనేది ఎంత సత్యమో, కేవలం ఆయుధ బలంతో ఉద్యమాలను అణచివేయలేమనేదీ అంతే సత్యం.
ఈ నేపథ్యంలో జరిగిన బస్తర్ ఎన్కౌంటర్ అటు ప్రభుత్వ వ్యవస్థ, ఇటు మావోయిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అగత్యాన్ని నొక్కి చెప్తున్నది. పోలీసుల్లోనూ, నక్సల్స్లోనూ అధికంగా బలయ్యేది అట్టడుగు, నిరుపేద వర్గాల యువతే. ఈ దేశ సంపదలో భాగమైన యువత ఇలా హింసాత్మక ఘటనలకు బలైపోవడం బాధాకరమైన విషయం. నక్సల్స్‌కు నెలవులుగా మిగిలిపోయిన గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే సమస్యకు పరిష్కారం కనుగొనడం సాధ్యమే. అదేవిధంగా నక్సల్స్ కూడా కాలం చెల్లిపోయిన సాయుధ పోరాట వ్యూహాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాల్సిన అవసరమూ ఉన్నది. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు. ఇకనైనా ఇరుపక్షాలూ పట్టు విడుపులు ప్రదర్శించి ఏకాభిప్రాయానికి వస్తే దేశానికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.