శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jun 17, 2020 , 00:07:48

కర్షకులకు కంటికి రెప్ప

కర్షకులకు కంటికి రెప్ప

చిరుజల్లుల మధ్య దుక్కి దున్ని విత్తనాలు వేసే కాలంలో  రైతన్నలకు అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పథకానికి వెంటనే నిధులు విడుదల చేయడం హర్షణీయం. రైతులు ఈ వ్యవసాయానికి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వల్ల ఒకప్పుడు ఇబ్బందులు పడేవారు. ఈ దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించడానికి కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కర్షకులను కేసీఆర్‌ కంటికి రెప్పలా కాపాడుకుంటు న్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని అంతటినీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడం దేశ చరిత్రలోనే అపూర్వం. భవిష్యత్తులో రైతులకు ధాన్యం అమ్ముడుపోకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి సమస్యలు తలెత్తకుండా నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సానుకూలంగా స్పందించి నియంత్రిత సాగు విధానానికి మొగ్గుచూపడం వారికి ముఖ్యమంత్రిపై ఉన్న ప్రబల విశ్వాసానికి నిదర్శనం. 

‘వేరు సెన్గల రాసి మేరు శైలము భంగి పడియున్నదొకచోట పసపు కాంతి /పచ్చజొన్నల రాసి బాలకృష్ణుని పట్టు పీతాంబరము మించు పీతకాంతి/ కొర్రల రాసులు కొండల రీతిగా రమ్యంబుగా నపరంజి కాంతి/ మొక్కజొన్నల రాసి చొక్కపు బంగారు వనమాల గుండ్ల సువర్ణకాంతి...’ అంటూ తెలంగాణలో రైతు బిడ్డలు పండించిన భిన్నరకాల పంటలను గంగుల శాయిరెడ్డి తన ‘కాపు బిడ్డ’ కావ్యంలో శోభాయమానంగా వర్ణించాడు. అంతా ఒకే పంటగా వరిని పండించడమనేది తెలంగాణలో ఏనాడూ లేదు. ఎప్పుడైనా సమాజానికి అవసరమైన భిన్నరకాల పంటలను పండించేవారు. పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి ఆకాశమే హద్దు. ఇప్పుడున్న అవకాశాల దృష్ట్యా స్థానిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు దేశ, విదేశాల అవసరాలూ తీర్చవచ్చు. వ్యవసాయాన్ని వ్యాపారం మాదిరిగా లాభ సాటిగా మార్చుకోవచ్చు. రైతు, సమాజం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత సాగును ఉత్తమమైనదిగా గుర్తించారు. 

నియంత్రిత సాగు ఒక్క పంటకో, పసలుకో పరిమితమైంది కాదనీ, రాష్ట్రంలో వ్యవసాయరంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మకమార్పులలో భాగమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన మాట గమనార్హమైనది. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులను సమగ్రంగా పరిశీలించి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో జల విప్లవాన్ని తీసుకురావడం మొదలుకొని నియంత్రిత వ్యవసాయవిధానాన్ని ప్రవేశపెట్టేవరకు ఏ ఒక్కటీ యథాలాపంగా జరిగినవి కావు. తెలంగాణ ఏర్పాటుకు ముందునుంచే ఉద్యమనాయకుడైన కేసీఆర్‌కు భవిష్యత్‌ తెలంగాణపై స్పష్టమైన వ్యూహం ఉన్నది. పారిశ్రామిక ప్రగతి అయినా, వ్యవసాయ, గ్రామాణాభివృద్ధియైనా అన్ని రంగాలను వ్యూహాత్మకంగా సమన్వయపరుచడాన్ని గమనించవచ్చు. తెలంగాణను దృఢమైన వ్యవసాయ రాష్ట్రంగా మార్చడంలో భాగమే ఈ నియంత్రిత సాగు లక్ష్యమని రైతులు గ్రహించాలి. 


logo