శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Apr 12, 2020 , 22:31:03

కలమే కదనాస్త్రం

కలమే కదనాస్త్రం

కరోనా వ్యాధి విస్తరించకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యం. సరైన అవగాహన లేకపోతే ప్రజల్లో అనవసర భయాందోళన ఎక్కువయ్యే అవకాశం ఉన్నది... ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు కవులు, రచయితలు చేసిన కృషి ప్రశంసనీయం.

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఒక్కొక్కటిగా దేశాలన్నీ చుట్టి, మనదేశంలోనూ తన రెక్కలు చాచింది. చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో మానవ హననానికి కారణమవుతున్న ఈ వైరస్‌ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. గత నెల 22న కేంద్రం ‘జనతా కర్ఫ్యూ’ను ప్రకటించి, ఆ తర్వాత ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ విధించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. 

కరోనా వ్యాధి విస్తరించకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యం. సరైన అవగాహన లేకపోతే ప్రజల్లో అనవసర భయాందోళన ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. లేని వ్యాధిని ఉన్నట్టు ఊహించుకోవడం వల్ల ఇతరత్రా మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు కవులు, రచయితలు చేసిన కృషి ప్రశంసనీయం. 

తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు పలు కీలక సమయా ల్లో, పోరాటాల్లో నిబద్ధతతో సాహితీవేత్తలు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. అందువల్లే కరోనాపై యుద్ధం లో కవులు, రచయితలు భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన అయినంపూడి శ్రీలక్ష్మి కవిత ‘కరోనాకి ఓ రిటర్న్‌ గిఫ్ట్‌'ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. గతంలో ప్రపంచం ఎదుర్కొన్న కలరా, ప్లేగు వంటి వ్యాధులను ఈ కవయిత్రి గుర్తుచేస్తూ, వాటిపై మానవజాతి విజయ పరంపరను వివరించారు. ‘గతమెప్పుడూ విజయాల్నే గుర్తుచేస్తుంది/వర్తమానపెప్పుడూ సవాళ్లనే చూపిస్తుంది/భవిష్యత్తెప్పుడూ ఆశలనే ప్రోదిచేస్తుంది’ అంటూ ఆశావహ దృక్పథంతో ముందుకుసాగాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చినా సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని ఉద్బోధించే కవిత ఇది. ఈ నేపథ్యంలోనే సీఎం పిలుపునకు స్పందించిన కవులు విస్తృతంగా కవిత్వం వెలువరిస్తున్నారు. ఆ కవిత్వ ప్రచురణకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ముందుకువచ్చి, తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నది. సాహిత్య ప్రత్యేక పేజీ ‘చెలిమె’లోనే కాకుండా ‘సంపాదకీయ పేజీ’లో కూడా కవితలను ప్రచురిస్తుండటం ముదావహం.

గత నెల 9న కొమురవెళ్ళి అంజయ్య రాసిన ‘క..రోనా’ అనే కవితతో ‘నమస్తే తెలంగాణ’ ప్రారంభించింది. ‘ఇప్పుడిక చేతులు కడుక్కుందాం/కాళ్లు, మొఖాలు కడుక్కుందాం/ మనల్ని మనమే కడిగేసుకుందాం/ ముఖాలకు మాస్క్‌లేసుకుందాం/ దగ్గినా, తుమ్మినా దాచుకొని తుమ్ముదాం’ అంటూ ఈ కవిత ద్వారా అవగాహన కల్పించేందుకు కవి ప్రయత్నించారు. ‘శరీరమంతా మాస్కులు ధరించిన/ ఒంటరితనాల వార్డులు రెడీ రెడీ’ అనడంలో మనుషులు ఒంటరి అని కాకుండా వార్డులు సైతం ఒంటరివే అంటూ మానవీకరించడం కనబడుతుంది.

‘కరోనా క్యా హోనా’ అనే వారణాసి భానుమూర్తిరావు కవితలో.. ‘జాతి మొత్తం ఏకమై/ కరోనా భూతాన్ని తరిమేద్దాం!/ స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ/ వైరస్‌ లేని సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ ఈ కవిత ప్రజలకు పిలుపునిస్తుంది.

‘కరుణ లేని కరోనా’ అనే కవిత ద్వారా ప్రజల్లో ధైర్యాన్ని ప్రోది చేసేందుకు డాక్టర్‌ ఆర్‌.రమేశ్‌ ప్రయ త్నించారు. ‘భయాన్ని వదిలి ధైర్యా న్ని నింపుకో/అపోహల్ని వదిలి నిజాల్ని తెలుసుకో/ జాగరూకతతో మెలిగి/నీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకో/ ఆరోగ్యమే మహాభాగ్యం/ పరిశుభ్రతే నీ మంత్రం/ నమస్కారమే మన సంస్కారం’ అనే పంక్తులు చక్కటి సందేశాన్ని అందజేస్తాయి.

‘ఇప్పుడు/ చేయిచేయి కలపడం కన్నా/చేతుల్ని శుభ్రం గా కడుక్కోవడమే ముఖ్యం/దగ్గరవ్వడం కన్నా/కాస్తంత దూరంగా ఉండటమే మేలు’ అంటూ చేతుల పరిశుభ్రత తో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పే కవిత బిల్ల మహేందర్‌ రాసిన ‘మనిషి దేవుడని ప్రకటిద్దాం’. ‘కరోనా ‘వైరి’స్‌' కవితలో ‘స్పర్శ వినా బతకలేని మానవుడు/దూరాలను అభ్యాసం చేస్తున్నాడు/అదృశ్య రాకాసిని ఎదుర్కొనే అస్ర్తాలు లేక/శూన్యంలో యుద్ధం చేస్తున్నాడు’ అని వాస్తవ పరిస్థితిని కవితాత్మకంగా వివరించారు డాక్టర్‌ ఎన్‌.గోపి. ‘భగవంతుడా../నేనేమైనా పరవాలేదు/ఎంతో జీవితం చూశాను/నా చుట్టూ ఉన్నవాళ్లు బాగుండాలి’ అని ఈ కవి పేర్కొనడం పాఠకులను కదిలిస్తుంది. 

వైరస్‌ వ్యాప్తి ఆగిపోవాలని కోరుకునే కవిత డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి రాసిన ‘గొలుసు తెగాలె’. అందు లో.. ‘మనం కదలకుండా ఉంటేనే/దాని గొలుసు భళ్ళున తెగిపోతుంది/మనం చేతులు కలపకుండా ఉంటేనే/దాని సామ్రాజ్యం కూలిపోతుంది/మనం పరిశుభ్రతా మాలను ధరిస్తేనే/అది జారుకుంటుంది’ అని పరిశుభ్రతకు ప్రజలు ప్రాముఖ్యం ఇవ్వాలని ఈ కవి సూచించారు.

‘హలో’ అనే మినీ కవితలో కోట్ల వెంకటేశ్వర్‌ రెడ్డి..‘ఇంటి నుంచి బయటికి వస్తే/కబర్‌ లేకుండా చంపేస్తా/ మీరు ఇంట్లోనే ఉంటే/నాకు నేనుగా కనుమరుగై చస్తా’ అంటూ తక్కువ పంక్తుల్లో సూటిగా వైరస్‌ మనస్తత్వాన్ని విశ్లేషించారు.

‘నేటి స్వీయ నిర్బంధాలే/రేపటి స్వేచ్ఛకు దుర్భేద్యాలు’ అంటూ వివరించిన కవిత గాజుల పవన్‌ కుమా ర్‌ రాసిన ‘అజ్ఞాత వాసం’. ‘అనుబంధపు ఆలింగన స్పర్శలే/ అణుబాంబుల కన్న/ప్రమాదమనుకోలేదు’ అంటూ ప్రస్తుత పరిస్థితిని వివరించే కవిత వి.ప్రకాశ్‌ రాసి న ‘నీ దేహమే శత్రు స్థావరమైతే’.

కరోనాపై ఒకే రోజులో వంద పద్యాలు రాసిన పద్య కవి సిద్దిపేట జిల్లాకు చెందిన బండికాడి అంజయ్యగౌడ్‌తో ఎస్‌. మల్లారెడ్డి చేసిన ఇంటర్వ్యూను కూడా ‘నమస్తే తెలంగాణ ప్రచురించింది. ‘జనజాతర తగ్గెను శో/ధన బెరిగెను నిను హరించు దారులు వెదకన్‌/మనుజులు సంసిద్ధులయిరి/ మనెదవు నీవెట్టులనిక మహిని కరోనా’ మొదలైన పద్యాలను ఈ సందర్భంగా ఉదహరించారు.

‘రోడ్లు కూడా ఉగ్రంగా మండుతున్నయ్‌!/రయ్యిరయ్యి న వస్తే/మంటల్లో తగలడిపోతావ్‌!’ అనే సందేశంతో రావులపల్లి సునీత రాసిన కవిత ‘ఖబడ్దార్‌'. ‘ఇకనైనా మారండిరా మానవాధముల్లారా!/శుభ్రత పాటిస్తే/పత్తా లేకుండా పరారవుతా/మందు కనిపెడితే/తోక ముడుచుకుంటా’ అంటూ వైరస్‌ మనోభావాలను వెల్లడించిన కవిత ఇందిర వెల్ది రాసిన ‘మీ మంచికేనోయ్‌' బాగుంది. ‘కనబడని శత్రువుకు కనబడకుండా/రహస్యమైపోవడమే వ్యూహం’ అం టూ లాక్‌డౌన్‌ వెనుక పాలకుల వ్యూహాన్ని ‘రణస్థలి’ అనే కవితలో రామా చంద్రమౌళి వివరించారు.

సాహిత్య పేజీ ‘చెలిమె’, సంపాదకీయ పేజీ ద్వారా కరోనాపై ప్రజ ల్లో అవగాహన పెంచేందుకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక చేస్తున్న కృషి ప్రశంసనీయం. విస్తృతస్థాయిలో కరోనా మహమ్మారిపై సృజనాత్మక రచనలు వెలువడేందుకు ప్రేరణగా నిలుస్తున్న ఈ పత్రిక సంపాదకులు అభినందనీయులు.

- డాక్టర్‌ రాయారావు సూర్యప్రకాశ్‌ రావు

94410 46839


logo