యాదాద్రి, ఏప్రిల్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం కోలాహలంగా జరిగింది. నారసింహుడి ప్రధానాయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. సుమారు గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కార్యక్రమం జరిగిం ది.
ప్రాకార మండపంలో స్వామివారి నిత్యకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలు, పుష్పాలతో దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించారు. ప్రాకార పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యారాధనలను వైభవంగా చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
అనంతరం స్వామివారికి నిజాభిషేకం, సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. కొండకింద కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి పక్కనే ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు.
దేవాలయం ఆధ్వర్యంలో ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వయంభువులను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామివారి ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీవారి ఖజానాకు రూ.14,80,846 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.