‘కలప అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి జిల్లాలో బొగ్గు బట్టీలు అనేవే లేకుండా చేశాం. నాలుగేండ్ల కాలంలో 200కిపైగా కేసులు నమోదు చేసి, రూ.2 కోట్ల వరకు జరిమానాలు విధించాం. జిల్లాలో 4 శాతం మేర ఉన్న అటవీ విస్తీర్ణంలో విరివిగా మొక్కలు నాటి హరితారణ్యాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సహజ అడవులను అభివృద్ధి పరిచి జిల్లాను రాష్ర్టానికే మోడల్‌గా నిలిపాం. ఆరేండ్లలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 34 లక్షలకుపైగా నాటిన మొక్కల ఫలితాలు మొదలయ్యాయి. పచ్చదనం పెంపు, జల సంరక్షణ చర్యలతో పలుచోట్ల జీవ వైవిధ్యం ఉట్టిపడుతున్నది’ అని జిల్లా అటవీ శాఖ అధికారి డి.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, హరిత నిధి స్ఫూర్తి మరింత నింపుతున్న తరుణంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయన్ని పలుకరించింది. ఈ సందర్భంగా జిల్లాలో అడవుల అభివృద్ధి కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక అంశాలను వివరించారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘జిల్లాలో నాలుగు శాతం ఉన్న అటవీ విస్తీర్ణంలో విరివిగా మొక్కలు నాటి హరిత అరణ్యాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సహజ అడవులను అభివృద్ధి చేసి జిల్లాను రాష్ర్టానికే మోడల్‌గా నిలిపాం. పచ్చదనం పెంపు.. జల సంరక్షణ పనులతో జీవ వైవిధ్యం ఉట్టిపడుతున్నది’ అని జిల్లా అటవీశాఖ అధికారి డి.వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ మరిన్ని
అంశాలను వివరించారు.
పక్కా ప్రణాళికతో అడవుల అభివృద్ది..
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3,091.48 చదరపు కిలోమీటర్లలో నాలుగు శాతం మేర అంటే 111.733 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అటవీప్రాంతం విస్తరించి ఉన్నది. మూడు రేంజ్‌లు, 24 బీట్లుగా విభజించి అటవీ అభివృద్ధికి పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నాం. 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆరేండ్లలో 34 లక్షలకు పైగా మొక్కలు నాటాం. అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వంటి చోట్ల కూడా విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా అటవీశాఖతోపాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో 30లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాం.
ఆహ్లాదాన్ని పంచుతున్న అర్బన్ పార్కులు
హెచ్ఎండీఏ, వైటీడీఏ పరిధిలోని అడవులను అర్బన్ పార్కులుగా తీర్చిదిద్ది పల్లె, పట్టణ ప్రాంత ప్రజానీకానికి ఆహ్లాదాన్ని అందుబాటులోకి తెచ్చాము. చౌటుప్పల్‌లోని తంగేడువనం, రాయగిరి రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని నృసింహ స్వామి, ఆంజనేయస్వామి అభయారణ్యాలను అర్బన్ పార్కులుగా తీర్చిదిద్దాం. సహజ అందాలకు మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. చౌటుప్పల్, పోచంపల్లి మండలంలోని జలాల్పూర్, బీబీనగర్, కొండమడుగు ప్రాంతాల్లో మరో నాలుగు అర్బన్ పార్కులను ఏర్పాటుచేసి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాచకొండలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు అక్కడ కూడా అర్బన్ పార్కును ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పటిష్ట నిఘాతో అడవుల పరిరక్షణ
అడవుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేశాం. ముఖ్యంగా కలప అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాచకొండ ప్రాంతంలో నాలుగు ట్రాప్ కెమెరాలు, బేస్ క్యాంపు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. రాచకొండ, మోత్కూరు, ఆలేరు, రాజాపేట అటవీ ప్రాంతాల నుంచి కలప అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా నాలుగేండ్లలో 200కు పైగా కేసులు నమోదు చేసి రూ.2కోట్ల వరకు జరిమానా విధించాం. ఒకప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా బొగ్గుబట్టీలు కనబడేవి. స్పెషల్ డ్రైవ్ వంటి కార్యక్రమాల ఫలితంగా.. ప్రస్తుతం ఒక్క బట్టీ కూడా లేదు.
రాష్ర్టానికే స్ఫూర్తినిచ్చిన యాదాద్రి మోడల్..
తక్కువ భూవిస్తీర్ణంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు నాటి చిట్టడవిలా మార్చేందుకు ప్రయోగాత్మకంగా చౌటుప్పల్ వద్ద తంగేడు వనంలో చేపట్టిన సహజ అటవీ అభివృద్ధి ప్రయత్నం ఫలించింది. ఇది రాష్ర్టానికే మోడల్‌గా నిలువడం జిల్లాకే గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో ‘యాదాద్రి మోడల్’ను అనుసరిస్తున్నారు. గతేడాది ఇదే పద్ధతిలో 10 ఎకరాల్లో 40వేల మొక్కలు నాటించాం. ఈ ఏడాది మరో 45 ఎకరాల్లో 1.8లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా నాలుగేండ్ల కిందటి వరకు రాళ్లు, గుట్టలతో కన్పించిన ప్రాంతాలు నేడు దట్టమైన అడవులుగా రూపాంతరం చెందాయి.
ముమ్మరంగా జల సంరక్షణ పనులు..
అటవీ ప్రాంతాల్లో జల సంరక్షణ పనులను ముమ్మరంగా చేపడుతున్నాం. చెక్ డ్యామ్, పర్క్యులేషన్ ట్యాంకులను చాలా వరకు నిర్మించాం. వర్షం నీరు వృథాగా వెళ్లకుండా గుట్టల చుట్టూ కందకాలను తవ్వించాం. ఈ చర్యల ఫలితంగా అడవి పందులు, జింకలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, నెమళ్లు వంటి జంతువుల సంతతి గతంతో పోలిస్తే చాలా వరకు పెరిగింది. రిజర్వ్ ఫారెస్ట్‌లో పండ్ల మొక్కలతో పాటు కోతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టులు ఉపయోగకరంగా మారాయి. నాలుగేండ్లలో చేపట్టిన అనేక కార్యక్రమాలు అడవుల్లో జంతువుల సంతతి పెరిగి జీవ వైవిధ్యం వెల్లివిరిసేందుకు దోహదపడ్డాయి.
‘వన సందర్శన’తో అడవులపై అవగాహన
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ‘వన సందర్శన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో తీసుకొస్తుచ్చి చైతన్యపరుస్తున్నాం. రెండేండ్ల నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. కరోనా కారణంగా స్కూళ్లు మూతబడడంతో గతేడాది నిలిచిపోయిన ‘వన సందర్శన’ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం.