ప్లవనామ సంవత్సరం వీడ్కోలు చెబుతూ శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతిస్తూ వెళ్లిపోయింది. ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులు నింపాలని కోరుకుంటూ, వసంతాగమనంతో పచ్చదనం పులుముకున్న ప్రకృతి కాంత, కోయిలమ్మలై కూసే వేళ, ఉగాది పచ్చడి రూపంలో షడ్రుచులనూ ఆస్వాదించి, రాబోయే సుఖసంతోషాలు, కష్టసుఖాలను ఎదుర్కొనేందుకు తెలుగు లోగిళ్లు సిద్ధమయ్యాయి. శనివారం ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అందోల్/మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదిని ఘనంగా జరుపుకొనేందుకు పల్లెలు, పట్టణాలు సిద్ధమయ్యాయి. నేటితో ప్లవనామ సంవత్సరం ముగిసి శుభకృత్‌నామ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా ఇకనుంచి అన్నీ శుభాలే జరుగాలని గ్రామాల్లోని ఆలయాలను ఉత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు నిర్వాహకులు. నిరాశావాదాన్ని పోగొడుతూ… కొత్త ఆశలు చిగురింపజేస్తూ ..కోటి ఆశలు… కొంగొత్త ఊసులతో నవ వసంత శుభోదయానికి శ్రీకారంచుట్టే తెలుగువారి నూతన సంవత్సరాదియే ఉగాది. ప్రపంచానికి కొత్త సంవత్సరం జనవరి కాగా.. తెలుగు వారికి చైత్రశుద్ధ పాడ్యమి రోజున చంద్రమాసం ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది రోజున పండితులు చెప్పే కొత్త పంచాంగాలపై సామాన్యులు మొదలుకొని ప్రభుత్వ పెద్దల వరకు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. కొత్త సంవత్సరంలో ఎవరి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. కొవిడ్ వ్యాప్తితో రెండేండ్లుగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణాలు ఎలాంటి హంగు.. ఆర్భాటాలు లేకుండా నిర్వహించగా, ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉగాది ఉత్సవాలు, పంచాంగశ్రవణాలు ఘనంగా జరుపుతూ శుభకృత్‌లో అంతా మంచే జరగాలని ప్రజ లు సుఖసంతోషాలతో ఉండాలని వేదపండింతులు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
వసంతగమన శుభవేళ, పచ్చదనం సింగారించుకొని కళకళలాడే ప్రకృతి సాక్షిగా చిత్త నక్షత్ర ప్రవేశంలో చైత్రశుద్ధ పాఢ్యమి రోజున వచ్చే పండుగ ఇది. ఇక శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం కానున్నది. ప్రమోదాల కలబోతగా గడిచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ రాబోయే సంవత్సరమైన తమ జీవితాల్లో నవ్యకాంతుల్ని నింపుతున్నదనే ఆశతో మరో వసంతాన్ని స్వాగతించడమే ఉగాది పరమార్థం. తెలుగునాటి కాలగమనం ప్రారంభమైంది ఈ రోజునే కావడం విశేషం. సకల చరాచర సృష్టికి బ్రహ్మదేవుడు బీజం వేసింది ఈ రోజే అంటారు. నిజానికి ఈ ‘యుగాది’ కాల ప్రవాంగంలో ‘ఉగాది’గా పరిణమించిందని చెబుతారు. ఈ అపురూప వేడుకను శనివారం ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు.
ఉగాది పండుగను ప్రజలు కొత్త పనులకు శుభదినంగా భావిస్తారు. ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభిస్తే ఎలాంటి అవరోధా లు లేకుండా పనులు సవ్యంగా సాగుతున్నాయనేది ప్రజలకు గట్టి విశ్వాసం. విభన్న సంస్కృతులు, భిన్న రకాలుగా ప్రజలు ఉగాదిని జరుపుకొంటారు. రైతులందరూ ఒకే సంప్రదాయాన్ని పాటిం చి పండుగను చేసుకుంటారు. ఉగాదితోనే రైతులు పొల్లాలో పనులను ప్రారంభిస్తారు. అనంతరం షడ్రుచులతో పచ్చడితయా రు చేసి సేవిస్తారు. ఆ పచ్చడిని ప్రకృతి అందించే కొత్త చింతపండు, కొత్తబెల్లం, కొత్తకారంపొడి, ఉప్పు, వేపపువ్వు, మామిడికాయలతో తయారు చేస్తారు.
ఉగాది పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకొంటారు. బంజారా గిరిజనులు మైదాన ప్రాంత వాసుల మాదిరిగానే పండుగ చేసుకుంటారు. గోండులు వారి ఉపతెగలైన గిరిజనులు కొంత భిన్నంగా పండుగ వేడుకలను జరుపుకొంటారు. ఒకరోజు ముందు పాత పండుగ చేస్తారు. ఆవులను పూజిస్తారు. గోధు మ సేమియాలను ఆరగిస్తారు. తెల్లవారుజామున భూమిపూజ చేసి ఖాకీకారం, గట్కానైవేద్యం సమర్పిస్తారు. విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, వడ్రంగి కుల వృత్తులవారు తమ వృత్తి పరికరాలకు ఒకచోట పెట్టి ఐదు రోజుల పాటు ఎంతో నిష్టగా పూజ చేస్తారు. పూజ లు జరిగే ఐదు రోజులు పనులను పూర్తిగా నిలిపివేస్తారు. సామగ్రి ని దేవతలతో సమానంగా భావిస్తారు. మార్వాడీలు ఇండ్లలో దేవ త విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు నిత్యపూజలు నిర్వహిస్తారు.
ఉగాదిరోజు తయారు చేసే పచ్చడి సేవించడంతో ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతున్నది. మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, వేపపువ్వు, ఉప్పు, కారంతో తయారు చేసే ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఇందు లో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు అనే షడ్రుచులు ఉండటంతో అవి ఆరోగ్య పరంగానూ మేలు చేస్తాయి. కోపం, ధ్వేషం, సంతోషం, దు:ఖం లాంటి భావోద్వేగాలకు ఈ షడ్రుచులు దోహదపడుతాయి. జీవితంతో ఎప్పుడు సంతోషాలే ఉండవని, ప్రతి మనిషి జీవితంలో కష్ట, నష్టాలు మామూలేనని తెలయ పరిచేందుకు తీపి, చేదు, వగరు, కారంతో కలిపి పచ్చడిని తయారు చేసినట్లు పచ్చడికి ప్రత్యేకత ఉంది.
వేపపువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్నోవేటరీ ఉంటాయి. వేపలో ఉండే ఎంజైమ్ ఇన్సూలిన్‌గా పనిచేసి షుగర్ వ్యాధి తగ్గించేందుకు దోహదపడుతుంది. వేప ఆకులు, పూత తినడం వలన రక్తం శుద్ధి అవుతుంది. అంతే కాకుండా కడుపులోని నూలీపురుగులను నాశనం చేస్తున్నది.
మామిడికాయలో సీ విటమిన్ ఉంటుం ది. జీర్ణాశయానికి ఉపయోగపడే ఆమ్ల రసాయనాలను పెంపొందిస్తుంది. మా మిడికాయలు తినడం వలన పిత్తాశయానికి ఎంతో ఉపయోగం. విటమిన్ సీ లోపం వలన వచ్చే వ్యాధులను నివారించవచ్చు. మామిడితో గొంతు సంబంధ వ్యాధులను నివారించడంతో పాటు ఆకలి పెరుగుతున్నది.
ప్రతి మనిషి శరీరంలో ఎలక్ట్రోలైడ్స్ సమతుల్యంగా ఉండాలంటే ఉప్పు చాలా అవసరం. ఎండాకాలంలో ఉప్పు శాతం చెమట ద్వారా బయటకు వెళ్తుంది. మని షి డీ హ్రైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఉప్పునీరు చాల అవసరం.
మనలోని రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తాన్ని అభివృద్ధి చేస్తుం ది. బెల్లంలో మినరల్స్ ఎక్కువ శాతంలో ఉం టాయి. అస్తమా, సైనసైటిస్, వంటి జబ్బులు తగ్గుతాయి.
ప్రతీ ఇంట్లో చింతపండు ఎక్కువగా వాడు తారు. ఇందులో సీ విటమిన్ ఉం టుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తున్నది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉండే వాపులను తొలిగిస్తుంది.
కారం వలన ఒంట్లో వెలువడే కఫం తగ్గుతుంది. వేడిని పుట్టిస్తుంది. రుచి అందిస్తుంది. పచ్చి మిరప వాతాన్ని తగ్గిస్తుంది.
శుభకృత్‌నామ సంవత్సరంలో అంతా శుభసూచకాలు ఉన్నా యి. గత రెండేండ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మరి నుంచి ఈ సంవత్సరంలో ఉపశమనం కలుగుతుంది. సమస్త జీవకోటికి అన్న, పానీయాలు లభించి లోకమంత సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలున్నాయి. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉంటుంది. ఏప్రిల్ 13 నుంచి గురువు మీనరాశిలోకి ప్రవేశించడంతో ప్రాణాహిత పుష్కరాలు ప్రారంభం అవుతాయి.
– శీలంకోట ప్రవీణ్‌శర్మ, ప్రముఖ పురోహితులు
ఈ సంవత్సరం రాజు శని యాగుట చేత కొన్ని ఇబ్బందికరమై న పరిస్థితులు తలెత్తుతున్నాయి. మంత్రి గురుడు అగుట చేత తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధి చెందును. ఉమ్మడి మెదక్ జిల్లా విద్యా, వైద్య రంగాలతో పాటు న్యాయ రంగం, బ్యాంకింగ్ రంగంలో అభివృద్ధి చెందును. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందును. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తారు.
-వైద్య శ్రీనివాస్‌శర్మ, వేదబ్రాహ్మణుడు