వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 10: ఉత్తర తెలంగాణకు సంజీవనిగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలను మరింత మెరుగుపర్చడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఎంజీఎంలో మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవల అధికారులను ఆదేశించడంతో ప్రక్షాళనకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా విధులకు హాజరు కాని, సమయపాలన పాటించని వైద్యులను గాడిలో పెట్టేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రారంభిస్తూ ఎంజీఎంలోని పలు విభాగాలకు సర్క్యులర్ సైతం జారీ చేశారు. దీంతో ఎంజీఎంలో వైద్యుల కార్లు పార్కింగ్ చేయడానికి స్థలాభావం ఏర్పడిందంటే హాజరు శాతం పెరిగిన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు విధులపై నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు చేపడుతున్నారు. గత మార్చి 31న ఆర్ఐసీయూ విభాగంలో జరిగిన ఎలుకల ఘటనపై సైతం విచారణ జరిపి ఇద్దరు వైద్యులను టెర్మినేట్ చేయడంతోపాటు ఉన్నతాధికారిని మార్పులు చేయడం, సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టు సంస్థ ఏజిల్ గ్రూప్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ కఠినంగా వ్యవహరించి ఎంజీఎం ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. ఆర్ఐసీయూలో రోగికి ఆక్సిజన్ అందించేందుకు అక్రమంగా డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులైన అనస్థీషియా టెక్నీషియన్, బార్బర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యాధికారులు చేపడుతున్న చర్యలకు ఉద్యోగులు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగులు, సిబ్బంది గుండెల్లో గుబులు మొదలైంది. ఓ వైపు క్రమశిక్షణ చర్యలతో హడలెత్తిస్తూనే.. మరో వైపు రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఎంజీఎంలో సుమారు రూ. 7.50 కోట్లతో అధునాతన ఎంఆర్ఐ మిషన్, సుమారు రూ. 2.15 కోట్లతో అదనపు సిటీస్కాన్ యంత్రాన్ని మంజూరు చేశారు. ఈ రెండు యంత్రాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ఎంజీఎంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమ వసూళ్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల మంత్రి హరీశ్‌రావు సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాలు, వైద్య విద్యార్థుల హాస్టల్ వసతులను మెరుగుపర్చేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రెండు యంత్రాల సేవలను అందుబాటులోకి తెస్తాం.
– డాక్టర్ వీ చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్