రవీంద్రభారతి : భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన, అప్యాయత, ప్రేమని, చిన్నారులు ఆయన జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
శ్రీసాయి ఆలేఖ్య సాంస్కృతిక సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ సినీహీరో సుమన్ విచ్చేశారు. శ్రీసాయి ఆలేఖ్య ఆర్ట్స్, విజన్ వివికె హౌజింగ్ ఇండియా, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమవారం రవీంద్రభారతిలో బాలోత్సవాలు-2021, చాచా నెహ్రూ పురస్కారాలు కార్యక్రమం ఘనంగా జరిగింది.
అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరముందన్నారు.
అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన బాలబాలికలకు చాచా నెహ్రూ పురస్కారాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు.హీరో సుమన్ మాట్లాడుతూ సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా అద్బుతంగా నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉపద్రష్ట అరుణను అభినందించారు.
చిన్నారులు చాచా నెహ్రూ వేషధారణలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, గొట్టిముక్కల పాండురంగారావు, గాయకులు నిహాల్, విజయ్‌కుమార్, కుద్దూస్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.