ఉస్మానియా యూనివర్సిటీ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నల్లజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తేనే రాష్ట్రం ఏర్పడలేదని, దేశంలోని 38 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి కేసీఆర్ రాష్ట్రం సాధించారని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ ఎంతో మంది అమరులయ్యారని, ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీలదేనని మండిపడ్డారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడాన్ని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుకు పలు రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతుంటే మోడీ పీఠం కదులుతోందని అన్నారు. దాంతో రాష్ట్రాన్ని, టీఆర్ ఎస్ ను విచ్ఛిన్నం చేసేందుకు మోడీ కుట్ర పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మోడీ వ్యాఖ్యలను తెలంగాణవాదులంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటే తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాలను కించపరిచినట్లేనన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్ కు వరుస కడుతుంటే బీజేపీ నాయకులు మాత్రం తెలంగాణపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, ప్రవీణ్ రెడ్డి, గుండగాని కిరణ్ గౌడ్ , కడారి స్వామి, కోతి విజయ్ , వీరబాబు, రఘురాం, ప్రధాన కార్యదర్శులు గదరాజు చందు, శ్రీకుమార్ , శిగ వెంకట్ , నవీన్ గౌడ్ , కృష్ణ, హరిబాబు, కార్యదర్శులు వేల్పుకొండ వెంకటేశ్ , భాస్కర్ , రవి, జంగయ్య, కాటం శివ, రమేశ్ గౌడ్ , నాగరాజు, మిథున్ , రేణు, నరేశ్ , క్రాంతి, ప్రశాంత్ , సురేశ్ , అవినాశ్ , సునీల్ , శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో…
నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో ఎన్ సీసీ గేటు సమీపంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, నాయకులు సాయిబాబ, భాస్కర్ , సొహైల్ , వెంకట్ , యాసర్ , హరి, అరవింద్ , పవన్ తదితరులు పాల్గొన్నారు.