మియాపూర్ : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా తానున్నాన్న భరోసాను ఇస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజవకర్గ వ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 8,18,000 ఆర్థిక సాయం చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో బాధిత లబ్దిదారుల కుటుంబాలకు అందించారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం ఎంతో తోడ్పాటును అందిస్తున్నదన్నారు. ఆపదలో ఆపన్న హస్తాన్ని అందిస్తూ పేదలకు అండగా నిలుస్తు తన నిరంతర సేవలను కొనసాగిస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ పథకం కింద దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సహాయం లభించేలా తాను సంబంధిత అధికారులతో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రఘునాథ్‌రెడ్డి,గణేశ్, చంద్రారెడ్డి, శ్రీను, కాశీనాథ్, పోశెట్టి, రాజేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.