కందుకూరు : ఉద్యమాల పార్టీ టీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కందుకూరులో మాట్లాడుతూ, రైతులకు గులాబీ దండు అండగా ఉంటుందని చెప్పారు.
తెలంగాణ వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే ధర్నాలతో నిరసన జ్వాల హస్తినాకు తాకాలని పిలుపు నిచ్చారు. ఢిల్లీలో ఒక మాట,గల్లీలో మరొకమాట ఇది బీజేపీ జూఠా పార్టీ విధానమని పేర్కొన్నారు.
శాంతియుతంగా రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ నేడు రైతు పక్షాన పోరుకు సిద్దం అయినట్లు చెప్పారు. రైతాంగానికి గులాబీ దళం వెన్ను దన్నుగా నిలుస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్ విడుదల అయినందున ఎన్నికల మార్గదర్శకా లకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకొని ధర్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఉదయం 10గంటల నుండి ధర్నాలు ప్రారంభం అవుతాయని వివరించారు.యాసంగిలో పండే పంటలను గుజరాత్ మాదిరిగా తెలంగాణలో కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.